సర్కార్ బడులను బాగు చేయవయ్యా బాబూ అంటే తాళం పెట్టడమే తగిన పరిష్కారం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలోని సుమారు 27 వేల బడుల్లో 23 వేల వరకు మూసివేయాలనే ఆలోచనను ఆయన ఇటీవల వెల్లడించడం తెలిసిందే. అంటే దాదాపు 85 శాతం బడులకు ఎసరు పెట్టాలని చూస్తున్నారన్న మాట. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు చదువును చేరువ చేసే సర్కారీ బడులపై సీఎంకు ఉన్న ప్రేమ ఏపాటిదో దీన్ని బట్టి తెలుస్తున్నది. పిడుగులాంటి ఈ ప్రతిపాదన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. విద్యారంగంలో సంస్కరణల ముసుగులో తలపెట్టిన ఈ నిర్ణయం నిజంగా నాణ్యత పెంపునకు దోహదపడుతుందా? లేక గ్రామీణ విద్యా వ్యవస్థను మరింత కుదేలు చేస్త్తుందా? సర్కారీ బడులు మూతపడితే ప్రైవేట్ బడులకు పండుగేనని చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ వ్యవహారం ఇల్లు పీకి పందిరేసిన చందంగా తయారయ్యే ప్రమాదం ఎంతైనా ఉన్నది.
ప్రభుత్వం బడుల మూసివేతకు చెప్తున్న ప్రధాన కారణం.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేసి, పెద్ద పాఠశాలల్లో సమగ్ర వనరులు అందించడం. ఒకే చోట మంచి ఉపాధ్యాయులు, డిజిటల్ తరగతులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు వంటి సదుపాయాలు ఉంటే విద్యార్థులకు మెరుగైన అభ్యాస వాతావరణం లభిస్తుందని ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పాఠశాలలు కేవలం విద్యాకేంద్రాలు మాత్రమే కాదు, గ్రామీణ వికాసానికి అవి వేదికలు కూడా. వాటి మూసివేతతో పిల్లలు దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తుంది. రవాణా సౌకర్యాల లోపం కూడా ఒక కీలక సమస్య. ముఖ్యంగా బాలికల విద్యపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉన్నది. ఇదంతా కూడా అభివృద్ధి అంతగా వేళ్లూనుకోని కాలం నాటి పరిస్థితికి మళ్లడం తప్ప మరోటి కాదు. ఇప్పటికే పేదరికం, సామాజిక అసమానతలతో పోరాడుతున్న కుటుంబాలకు ఇది మరింత భారమవుతుంది.
రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు హయాంలో వచ్చిన ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం వంటి సంస్కరణలకు రేవంత్ సర్కార్ నీళ్లు వదలడం ఏమాత్రం భావ్యం కాదు. ప్రభుత్వం బడులను మూసివేస్తే, వాటిల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటనేది మరో కీలక ప్రశ్న. పాఠశాలలు మూసివేయడం వల్ల 30 వేల మంది దాకా టీచర్లు మిగిలిపోతారని అంచనా. దీనివల్ల ఉద్యోగ భద్రత సమస్యలు తలెత్తవచ్చు. బదిలీలు, నిర్బంధ ఉద్యోగ విరమణలు తప్పకపోవచ్చు. లేక ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాల్సి రావచ్చు. ఇవన్నీ సమాజంలో సుదూర పర్యవసనాలకు దారితీస్తాయని చెప్పక తప్పదు. విద్యా వ్యవస్థలో స్థిరత్వం లేకపోతే, అది అంతిమంగా విద్యా నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సర్కారీ బడుల్లో విద్యా నాణ్యత పెంపు అనివార్యం. కానీ దానికి మార్గం పాఠశాలల మూసివేత కాదు.
కేసీఆర్ హయాంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపర్చారు. 11 వందల గురుకులాలను ఏర్పాటు చేసి, అద్భుతంగా నిర్వహించారు. ప్రభుత్వ బడుల స్థితిగతులను మార్చారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించారు. అంతేకాకుండా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. ఆ పథకం ప్రాధాన్యతను గుర్తించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఇప్పుడు కొత్తగా తామే తీసుకొస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకొంటున్నది. తెలంగాణలో భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలను కేసీఆర్ అమలు చేశారు. ఉపాధ్యాయుల వేతనాలు పెంచారు. నేడు కాంగ్రెస్ పెద్దలు సర్కారీ బడుల సడుగులు విరుస్తున్నారు. ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేసి, ప్రీప్రైమరీ క్లాసులు పెట్టాలని విద్యాకమిషన్ సిఫారసు చేస్తే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీకే ప్రభుత్వం ఎసరు పెడుతున్నది. విద్యా రంగానికి బడ్జెట్లో 18% నిధులు కేటాయించాలని సూచిస్తే 8%తోనే సరిపెట్టింది. బడుల సమస్యలను పరిష్కరించడం అంటే వాటిని ఎత్తివేయడమే నని సర్కార్ భావిస్తున్నది.
ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి సమాజ భాగస్వామ్యాన్ని పెంచాలి. గ్రామ స్థాయి కమిటీలు, తల్లిదండ్రుల సంఘాలు, స్థానిక సంస్థలు కలిసి పనిచేస్తే పాఠశాలల పనితీరు మెరుగుపడే అవకాశమున్నది. ఒకసారి పాఠశాల మూసివేస్తే దాన్ని తిరిగి ప్రారంభించడం చాలా కష్టం. అధికారంలోకి వస్తే ఒక్క బడిని కూడా మూసివేయబోమని నమ్మబలికి న కాంగ్రెస్, ఇప్పుడు గుండుగుత్తగా ఊచకోత కోస్తున్నది. ఈ చర్య విద్యా వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమిస్తున్నది. కాబట్టి, భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి, తొందరపాటు, అనాలోచిత నిర్ణయాలు మానుకోవా లి. దీర్ఘకాలిక ప్రభావాల దృష్ట్యా సమగ్రసం ప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకోవాలి.