సమ్మక్క సారలమ్మ గుడి సింహద్వారంపై కొలువుదీరిన అమ్మవారికి కిరీటం ఉంది. ఉజ్జయినీ మహంకాళి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ తల్లులకు కిరీటాలున్నాయి. ఊరూరా వెలిసిన గ్రామదేవతలకు భక్తులు యథాశక్తి కిరీటాలు, ఆభరణాలు చేయించి అలంకరించే సంస్కృతి మనది.
ఎములాడ రాజన్న, కొమురెల్లి మల్లన్న, యాదాద్రి నరసన్న, భద్రాద్రి రామన్న గుళ్లలో వేంచేసియున్న అమ్మవార్లకు కిరీటాలు ఉన్నాయి, ఆభరణాలూ ఉన్నాయి. ఏ గుడికి వెళ్లినా అమ్మవార్లు కళ్లకు నిండుగా దర్శనమిస్తారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇదేం పోయేకాలం. ఆచార్య జయశంకర్ సార్ సహా తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, అభిమానులు త్రికరణశుద్ధితో రూపొందించుకొని, వాడవాడల ప్రతిష్ఠించుకొని దేవతగా ఆరాధిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?
కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే రాజకీయాల్లో, ఎన్నికల్లో తేల్చుకోవాలి. అంతేకానీ, ఉద్యమ కాలం నుంచి ప్రజల గుండెల్లో నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని చెరిపేసి, కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించడం దిక్కుమాలిన చర్య. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం బతుకమ్మ. మహిళల ఆరాధ్య దైవం కూడా. అట్లాంటి బతుకమ్మను తొలగించడానికి ప్రభుత్వ పెద్దలకు చేతులు ఎట్లా వచ్చాయి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి విగ్రహం ఎలా ఉందో వారు గమనించలేదా? ఇతర రాష్ర్టాల ముందు తెలంగాణను నవ్వులపాలు చేయాలనుకున్నారా? బతుకమ్మ లేకుండా చేతిగుర్తును చూపిస్తున్న ఆ తల్లి తెలంగాణ తల్లి కాదు.
ముమ్మాటికీ కాంగ్రెస్ తల్లే. కిరీటాలు, వడ్డాణాలు పేద మహిళలకు ఉండవని తన చర్యను సమర్థించుకుంటున్న ప్రభుత్వం ఆ పేద మహిళలు కూడా బతుకమ్మ ఆడుతారని, భక్తితో పూజిస్తారని, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారని పరిగణించకపోవడం ఆశ్చర్యకరం. ఈ నేపథ్యంలో హిందూత్వ మల్లయోధులు, అధికారం వైపు మోహరించిన ఉద్యమకారులు నోరు విప్పాలి. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకు వారంతా తెలంగాణ తల్లికి దండలు వేసి దండం పెట్టుకున్నవాళ్లే కదా.
– డాక్టర్ అయాచితం శ్రీధర్