‘స్వాతంత్య్రమంటే ఏమిటో నిర్వచించుకోలేని దశలోనే దశాబ్దాలు గడిచిపోవడం నిజంగా విషాదకరం’ అని అన్నారు ఆరుద్ర. స్వాతంత్య్ర పోరాటంలో ఆస్తులు, అశువులు కోల్పోయిన యోధులంతా నేడు తిరిగి పుట్టినా (బహుశా) పరిస్థితుల్లో మార్పు రాదేమో! దేశంలో ఎన్నెన్నో మార్పులు, అభివృద్ధి అనివార్యమయ్యాయి.
సాంకేతిక రంగంలో వినూత్నమైన ఆవిష్కరణలు జరిగాయి. చంద్రుని మీదికి ప్రయాణాలు విస్తృతమయ్యాయి. ఆర్థికపరమైన వృద్ధి సాధ్యమైంది. దేశం అభివృద్ధిలో అంగలు వేసింది. ప్రతీ రంగంలో ఈ మార్పు కనిపిస్తున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమమేధ)తో మనుషులను సజీవంగా యాంత్రికతతో నిలుపుతున్నాం. మానవ రహిత వ్యోమనౌకలను అంతరిక్షంలోకి పంపగలుగుతున్నాం. దేశ స్వాతంత్య్రం అంటే ఇంతేనా అనే ‘విరుపులు’ ఉన్నాయి. ఈ మెరుపులు నాణేనికి ఒకవైపు. మరి రెండోవైపు? ‘ఆకాశం అందుకునే ధరలు ఒకవైపు, అంతులేని నిరుద్యోగం ఇంకొక వైపు/ అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు’ అని శ్రీశ్రీ ఐదు దశాబ్దాల కిందటనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఏడున్నర పదుల స్వాతంత్య్రం పూర్తిచేసుకున్న నాటికీ మహాకవి ఆవేదన అక్షర సత్యంగానే మిగలటం ఆవేదన కలిగిస్తున్నది. ‘భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని ఆసేతు హిమాచల పర్యంత ప్రజలంతా ప్రగతి ఫలాలు అందుకోవాల’ని ఆశించిన నెహ్రూ కలలు ‘కల్ల’ కావటం శోచనీయం.
నాలుగు వైపులా నీరున్నా ‘అన్నదాతకు’ బతుకు భరోసా లేదు. పీజీలు చేసినా పిడికెడు బువ్వ కోసం యువత నిరంతరం పోరాడుతూనే ఉన్నది. అటవీ ప్రాంతంలో అభివృద్ధి ఛాయలు పావు వంతు కూడా కనపడటం లేదు. అటవీ సంపద, ‘ఆటవిక’ జీవనం కింద నలుగుతున్న వైనం దేశ యవనికపై నిత్య దృశ్యం. ఆదివాసుల జీవనం ఎంత దుర్భరంగా మారినా పట్టించుకునే నాయకులు లేరు. కరెంటు, తాగునీరు, రహదారి సౌకర్యం లేని ఆదివాసీల సంఖ్య 12 నుంచి 18కి చేరిందని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. ఆగస్టు 15న జెండాకు వందనం చేసే నాయకులు సైతం ఏది నిజమైన స్వాతంత్య్రం? నిజంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశం ‘లౌకిక దేశమని’ పేర్కొన్నారు. ఆ ఛాయలు మాత్రం (మణి)పూర్‌గానే ఉన్నాయి. ఎవరు బాధ్యులంటే అంతటా ‘నిశ్శబ్దం’ ఆవహిస్తున్నది. భాష, కులం, మతం, ప్రాంతం, వర్గం ఇవి నేడు దేశాన్ని నడిపిస్తున్న తరుణంలో ‘పాడవోయి భారతీయుడా ప్రగతి గీతిక’ని ఎలా నినదించాలి. అధికారం ప్రజాపాలనకు, వారి అభివృద్ధికి నాయకులు వినియోగించాలని చెప్పిన రాజ్యాంగ నిర్మాత(ల) ఉపదేశాలు కేవలం నాయకుల ఉపన్యాసాలకే పరిమితం కావటం మరో విషాదం.
స్త్రీ, బాలికల సంరక్షణ అంకెలు ఘనం, ఆచరణ శూన్యం. మండుతున్న ప్రాంతాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. దేశంలో అశాంతి పెరిగితే, అది దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి చేటు. స్వాతంత్య్రం అనేది కేవలం నామమాత్రపు అంశంగా ఏర్పడే అవకాశం ఉన్నదని బాబు రాజేంద్రప్రసాద్ నాడే హెచ్చరించారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్టు దేశంలో ఉగ్రవాద ఉద్యమ విషసర్పాలకు పాలు పోసి పెంచి పోషించిన పాపం పాలకులదే. తదుపరి ఆ పాము కాట్లకు బలైనది కూడా వారే. మరి వర్తమాన, రాబోయే తరాలకు ఏది నిజమైన స్వాతంత్య్రమో ఎలా వివరించగలం?
విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు సైతం స్వాతంత్య్ర దినోత్సవం కోసం ఆటలు ఆడిస్తున్నాయి. పలురకాల పోటీలు పెట్టి బహుమతులు ఇస్తున్నాయి. కానీ, ఆగస్టు 15 గొప్పతనం, స్వాతంత్య్ర పోరాటాల గురించి వివరించే సిలబస్‌లను మాత్రం దూరం చేస్తున్నాయి. తల్లిదండ్రులకు సైతం ఆగస్టు 15న సెలవే. మరి వారు తమ పిల్లలకు ఏం చెప్తున్నారు? కవులు, కళాకారులు సైతం ప్రభుత్వ సేవలో ఉంటూ వారిచ్చే పురస్కారాల కోసం పరితపిస్తున్నారు. మరి ఏది నిజమైన స్వాతంత్య్రమో యువతకు చెప్పేదెవరు? ఆ దిశగా ఆలోచింపజేసేదెవరు? అభివృద్ధి అంటే సాంకేతికంగా ఎదగడం కాదు. సంపద, ఉత్పత్తి, శ్రమ, పెట్టుబడులకు సమానమైన ఫలితం దక్కటం. సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు స్వాతంత్య్ర ఫలాలను, కనీస సౌకర్యాలను పొందగలగటం. భద్రతతో కూడిన బతుకును స్వేచ్ఛగా అనుభవించగలగటం. భ్రమలు లేని వాస్తవ సమాజాన్ని నిర్మించడం కోసమే 1857 నుంచి 1947 వరకు ఉధృతంగా పోరాటాలు చేసి ధన, మాన, ప్రాణాలను తృణంగా సమర్పించిన నిస్వార్థ నాయకుల జీవితం గురించి వివరించాల్సిన అవసరం వర్తమానంలో ఉన్నది. కానీ, ఆ దిశగా ‘విద్యా విధానం’లో తగు మార్గదర్శక సూత్రాల్లేవు. ఉన్నా, వాటిని సైతం రాజకీయ, మత ప్రయోజనాల ప్రాతిపదికగా పుస్తకాల నుంచి తీసేయడం ఎటువంటి పునర్నిర్మాణమో పాలకులే చెప్పాలి. ‘సమ సమాజమనే కల వాస్తవం కాదని, యాభై ఏండ్ల స్వాతంత్య్రం నాకు చెప్పింది. కానీ, సమన్యాయం, తిండి, విద్య, వైద్యం కూడా అందరికీ అందని ఫలాలని నాకు అర్థమైంది. మరెందుకీ స్వాతంత్య్రమని భవిష్యత్ తరాలు చింతిస్తే ఆ తప్పునకు ఎవరు బాధ్యత తీసుకుంటార’న్న అలిశెట్టి ప్రభాకర్ వ్యాఖ్యానం నేటికీ సత్యం.