దేశ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై తమకు మాత్రమే స్పష్టమైన దృక్పథం ఉంటుందని, కొన్ని రాష్ర్టాలకే పరిమితమైన ప్రాంతీయ పక్షాలకు వాటిపై అవగాహన ఉండదని పదే పదే చెప్పుకొనే జాతీయపక్షాలు తమ అవకాశవాద వైఖరిని మరోసారి బయట పెట్టుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్ల రిజర్వేషన్ల విషయంలో అనుసూచిత కులాలను (ఎస్సీలు) ఏబీసీడీలుగా వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి వారం దాటిపోయింది. కానీ, బీజేపీ, కాంగ్రెస్ జాతీయస్థాయిలో దీనిపై తమ వైఖరిని ఇంతవరకు వెల్లడించలేదు.
దాదాపు ఐదున్నర దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్, 16 ఏండ్లకు పైగా ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీలకు వివిధ అంశాలపై అవకాశవాదానికి చోటులేని జాతీయ దృక్పథం లేదని ఎస్సీల వర్గీకరణ అంశంలో రుజువవుతోంది. అలాగే, ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీలు) కోటాల విషయంలో మాదిరిగానే ఎస్సీల రిజర్వేషన్ అమలులోనూ క్రీమీలేయర్‌ను మినహాయించే విషయమై పై తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన సూచనపై కనీసం మాట్లాడడానికి కూడా ఈ రెండు జాతీయ పార్టీలు సిద్ధంగా లేవు.
వాస్తవానికి కోటాల వర్గీకరణ లేదా ఉప వర్గీకరణ అనేది ఉత్తరాదిన పంజాబ్, హర్యానా, బీహార్, పశ్చిమాన మహారాష్ట్ర, దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మాత్రమే మూడు దశాబ్దాలకు పైగా నలుగుతున్న సమస్య. ఈ ఎస్సీల కోటా వర్గీకరణ వివాదాన్ని అన్ని పక్షాలతో సంప్రదింపులు జరిపి సామరస్యపూర్వకంగా పరిష్కరించే వీలున్నా కాంగ్రెస్, బీజేపీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరున అవకాశవాద వైఖరిని అవలంబిస్తున్నాయి. తరతరాలుగా సామాజిక అణచివేతకు గురైన దళితులను వర్గాలుగా చీల్చి ఎన్నికల్లో తమ ప్రయోజనాలకు అనుగుణంగా 1990ల నుంచీ ఇవి రాజకీయాలను నడుపుతున్న విషయం దేశ ప్రజలకు తెలియని రహస్యమేమీ కాదు. ఎస్సీల వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ వంటి దక్షిణాది పార్టీలకున్న సూత్రబద్ధ వైఖరి దశాబ్దాలుగా దేశాన్ని పాలించే రెండు జాతీయపక్షాలకు లేకపోవడం విచారకరం.
కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ర్టాలకు భిన్నంగా హర్యానా, పంజాబ్, బీహార్, మహారాష్ట్రలో చర్మకార వృత్తిపై ఆధారపడిన ఎస్సీ కులాలవారు దాదాపు అన్ని రంగాల్లో మిగిలిన దళిత వర్గాల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాది చర్మకార కులాలైన చమార్లు లేదా జాటవుల మద్దతు మెండుగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) దళితుల కోటా వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన లోక్‌జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) కూడా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు సుముఖంగా లేదనే వార్తలొస్తున్నాయి. దివంగత దళిత నేత రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నాయకత్వం వహిస్తున్న ఈ పార్టీకి ప్రధానంగా వారి కులస్తులైన దుసధులు (పాశ్వాన్లు) ఎక్కువగా మద్దతు పలుకుతున్నారు.
తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని ఎస్సీల్లో అధిక సంఖ్యలో ఉన్న దుసధులు దళిత వర్గాల్లో కాస్త మెరుగైన స్థితిలో ఉన్నారు. అందుకే ఎస్సీల వర్గీకరణను ఎల్జేపీ లోపాయికారిగా వ్యతిరేకిస్తోంది. అదీగాక, 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఎస్సీల ఓట్లను కనీస సంఖ్యలో కూడా దక్కించుకోలేకపోయిన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్న ఎస్సీ వర్గీకరణను తేనెతుట్టెగా పరిగణించడం కూడా దాని నాన్చుడు ధోరణికి ప్రధాన కారణం. అయోధ్యలో రాముడి గుడి కట్టి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్న కాషాయపక్షానికి ఈ పుణ్యక్షేత్రం ఉన్న ఫైజాబాద్ పార్లమెంటు సీటులోనే సమాజ్‌వాదీ పార్టీ నిలబెట్టిన దళిత అభ్యర్థి చేతిలో ఓటమి ఎదురవడం కూడా కోలుకోలేని దెబ్బ.
ఈ నేపథ్యంలో ఎస్సీల వర్గీకరణను సుప్రీంకోర్టు చెప్పినట్టు రాష్ర్టాల వ్యవహారంగా పరిగణించి, ఈ ఏడాది జరిగే నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలోపు తన జాతీయ వైఖరిని చెప్పకుండా దాటవేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం చూస్తోంది. ఆ పార్టీ నేతల మాటల ద్వారా ఈ విషయం అవగతమవుతున్నది. దీనికి తోడు ఎస్సీల కోటా అమలులోనూ ‘సంపన్న శ్రేణి’ నియమం పాటించే విషయంపై ఆలోచించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఉత్తరప్రదేశ్, బీహార్ నేతలు బాహాటంగా వ్యతిరేకిస్తుండటం కమలం పార్టీ నేతృత్వంలోని కేంద్ర సర్కారును ఇరుకున పెడుతోంది.
1990లో వీపీ సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబీసీలకు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 27 శాతం కోటా కల్పించింది. అప్పుడు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ తాను కన్నుమూసే వరకు అదే వైఖరిని అవలంబించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఆయన కుమారుడు రాహుల్‌గాంధీ కులగణన ఎజెండాను సామాజిక న్యాయ పార్టీలుగా పేరొందిన తన మిత్రపక్షాలైన ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ నుంచి గుంజుకుని ఓబీసీ రక్షకుడిగా కొత్త అవతారమెత్తి హస్తినలో అధికారం కోసం వెంపర్లాడుతున్నారు. అయితే, ఆయన చెప్పుచేతల్లో నడిచే కాంగ్రెస్ కూడా బీజేపీ బాటలో పయనిస్తూ ఎస్సీల వర్గీకరణపై జాతీయ వైఖరిని వెల్లడించడం లేదు.
మంగళవారం ఢిల్లీలో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌గాంధీలతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై ఇంకా చర్చించాల్సి ఉందని, త్వరలో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ర్టాల పీసీసీ అధ్యక్షులతో సమావేశమై పార్టీ నాయకులు,
కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటామని ప్రకటించారు.
వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ నాయకులు వర్గీకరణకు అనుకూలంగా ఉండగా, చర్మకార వృత్తి నేపథ్యం ఉన్న కులాల నుంచి వచ్చిన హర్యానా, యూపీ నేతలు కుమారీ సెల్జా, పన్నాలాల్ పునియా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తున్నది. ఈ ఇద్దరు నేతలు హరియానా, పంజాబ్‌లో మూలాలున్న చర్మకార జాటవ్ కుటుంబాల్లో జన్మించినవారే. గతంలో యూపీ నుంచి లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన పునియా 2010 నుంచి 2016 వరకు జాతీయ అనుసూచిత కులాల (ఎస్సీ) కమిషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1977 వరకు నిరాటంకంగా కేంద్రంలో రాజ్యమేలిన కాంగ్రెస్ సామాజిక విషయాల్లో బీజేపీ కన్నా కాస్త ముందుండాల్సింది పోయి, ఎస్సీల వర్గీకరణ వ్యవహారంలో అన్ని లెక్కలు బేరీజు వేసుకుని నడవాలనుకోవడం దాని తాజా అవకాశవాద వైఖరికి అద్దం పడుతోంది.
తమకు అత్యధిక రాష్ర్టాల్లో ఉనికి ఉందని, అంతర్జాతీయ, జాతీయ విషయాల్లో తమకు మాత్రమే సుస్పష్ట అవగాహన ఉందని చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వేలాది కులాలున్న ఇండియాలో ప్రతి సామాజిక వివాదాన్ని ఓట్లు దండుకోవడానికి సాధనంగా మలచుకోవడం ఆనవాయితీగా మారింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఎస్సీల జాబితాలో కొత్తగా కులాలను చేర్చే పకడ్బందీ రాజ్యాంగ ఏర్పాటు ఉన్న మన దేశంలో తరతరాలుగా సామాజిక దోపిడీకి గురైన దళిత కులాల మధ్య పేచీ వచ్చినప్పుడు సామరస్య వాతావరణంలో పరిష్కారాలు కనుగొనడం ఉత్తమ మార్గం. వర్గీకరణ వంటి వివాదాలు తలెత్తినప్పుడు అన్ని రాజకీయపక్షాలూ సుప్రీంకోర్టుకు పరిష్కార బాధ్యత అప్పగించి, తీర్పు వచ్చాక జాప్యం చేసే ధోరణి అవలంబించడం పూర్తిగా బాధ్యతారాహిత్యం అవుతుంది.
అన్ని ఎస్సీ కులాల నేతల మధ్య ఏకాభిప్రాయ సాధనకు, ఎస్సీల వర్గీకరణ వంటి కీలక విషయంపై ఆచరణాత్మక విధానం రూపొందించడానికి ప్రాంతీయపక్షాలు సహా అన్ని రాజకీయ పార్టీల మధ్య అంగీకారం కుదర్చడానికి రెండు జాతీయపక్షాలు చొరవ తీసుకునే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. ‘ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది కాబట్టి, జాతీయపక్షాలకు ఎస్సీల వర్గీకరణ అమలుపై తొందరెందుకు?’ అనే బీజేపీ, కాంగ్రెస్‌ల ధోరణి దేశ ప్రయోజనాలకు, సామాజిక సామరస్యానికి అత్యంత హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
– నాంచారయ్య మెరుగుమాల