పేద ప్రజల ఆర్థిక ఉన్నతికి తోడ్పడేందుకే సంక్షేమ పథకాల రచన జరుగుతుంది. ప్రాంత లేదా దేశ సమగ్రాభివృద్ధి సాధనకు అదో అనివార్య మార్గం. అయితే స్వార్థపర రాజకీయ శక్తులు ఆ చిన్న తోవను కావలసినంత వెడల్పు చేసుకొని ఓట్లు కొల్లగొట్టేందుకు రాజమార్గంగా మార్చుకుంటున్నాయి. తాము సాధించబోయే అభివృద్ధి ద్వారా ప్రజలకు ఒనగూడే మేలు గురించి చెప్పాలి కానీ ఉన్న పథకాల చుట్టుకొలతలు పెంచి పీఠాలనెక్కడం ప్రజా ద్రోహమే అవుతుంది. అలా సాధించిన విజయాల వల్ల నాయకుల కాంక్ష తీరుతుంది కానీ, జనం మెప్పు పొందలేరు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన చేపట్టిన తొలి రోజు నుంచే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో గత ప్రభుత్వాన్ని నిందించడం మొదలు పెట్టారు. ప్రమాణ స్వీకారం చేశాక గాని రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్నదని తెలియలేదని ఆయన అమాయకుడిలా అంటుంటారు. అదొక తెలివైన కుట్ర. ఒక రాష్ట్రం చేసే అప్పు దాచలేని సత్యం. పది రూపాయలు చెల్లించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎవరైనా, ఏదైనా సమాచారాన్ని ప్రభుత్వ సంస్థల నుంచి పొందవచ్చు. ఇదేదీ తెలియనట్టు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో ముంచిందని ప్రచారం చేస్తుంటారు. ఆ అప్పుల వడ్డీలకే రాష్ట్రం నెల రాబడిలో అధిక భాగం ఊడ్చుకుపోతున్నదని ఉప ముఖ్యమంత్రి ఉపదేశిస్తుంటారు.
ఇన్నాళ్ల ఈ బండారాన్ని పార్లమెంట్ బద్దలు కొట్టింది. ఈ నెల 11న లోక్‌సభలో తెలంగాణ అప్పుల గురించి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2024 మార్చి నాటికి తెలంగాణ రాష్ట్ర రుణాలు రూ 3.50 లక్షల కోట్లు అని ఆయన వెల్లడించారు.
2023-24 నాటికి రాష్ట్రం ఆస్తులు గత పదేండ్ల కాలంలో రూ.83 వేల కోట్ల నుంచి రూ.4.15 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. 2014లో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమన్న కాంగ్రెస్ ప్రచారాన్ని కూడా ఈ లెక్కలు ఒప్పుకోవడం లేదు. అప్పటికే తెలంగాణకు ఉమ్మడి రాష్ట్ర వాటాగా రూ.72 వేల కోట్లు అప్పు వచ్చింది. గత ప్రభుత్వం నెత్తిన పెట్టిన రూ.8 లక్షల కోట్ల అప్పుభారం మోస్తున్నామని ఇన్నాళ్లు రేవంత్ ప్రభుత్వ పెద్దలు చెప్పే మాట పార్లమెంట్ సాక్ష్యంగా అబద్ధమని తేలింది. ఈ అప్పులు, వడ్డీల మోత వల్లే తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నామనే బుకాయింపులకు ఇక తెరపడింది.
ముఖ్యమంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం రాష్ట్ర నెలసరి ఆదాయం రూ.18,500 కోట్లు కాగా నెల ఖర్చు రూ.22,500 కోట్లు అవుతున్నది. నెలకు రూ.4 వేల కోట్లు లోటు అన్నమాట. గత అప్పులకు అసలు, వడ్డీగా నెలకు రూ.7,000 కోట్లు చెల్లించవలసి వస్తున్నదని ప్రభుత్వం అంటున్నది. 2014లో రూ.72 వేల కోట్ల అప్పుకు చెల్లింపుగా నెలకు రూ.500 కోట్ల కేటాయింపు జరిగేది. ఆ లెక్కన గత పదేండ్ల అప్పు రూ.3.50 కోట్ల అప్పుకు నెలకు రూ.2,500 కోట్లు సరిపోతుంది. అప్పును పెంచి అబద్ధపు లెక్కలు చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలవారీ చెల్లింపులు కూడా మూడింతలు చేసి దుష్ప్రచారానికి ఒడిగట్టింది.
ఇరువై నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రూ.2.20 లక్షల కోట్లను అప్పుగా తెచ్చిందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కన ఐదేండ్ల కాలానికి రూ.7 లక్షల కోట్ల అప్పు భారం రాష్ట్ర ప్రజలపై పెరుగుతుంది. ఇంత అప్పు చేసి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను వారు నెరవేర్చడం లేదు. రైతుల బ్యాంకు రుణభారం పూర్తిగా దింపలేదు. వాయిదాల నత్త నడకతో నడుమనే రైతుభరోసా ఆగిపోయింది. ఆసరా పింఛన్లు పెరగలేదు. మహాలక్ష్మి పథకంలో మూడు హామీలున్నాయి. మహిళలకు నెల రూ.2,500 ఆర్థికసాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం. ఇందులో ఫ్రీ బస్ తప్ప మిగతా రెండు కార్యరూపం దాల్చలేదు. గ్యాస్ డబ్బులు ఇంతవరకు ఖాతాల్లో పడలేదని అంటున్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారుల ఎంపిక స్థాయిలోనే ఉన్నది. వారికి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలి. ఈ పథకంలోని తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వాలని ఉన్నది. ఇవన్నీ వంద రోజుల్లో చేసి చూపిస్తామన్న మాట ఐదేండ్లకు కూడా సాధ్యపడదని తెలిసిపోతున్నది.
ఆగస్టులోగా భర్తీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం విడుదల చేసిన ‘ఉద్యోగ క్యాలెండర్’ వైఫల్యానికి నిరసనగా తెలంగాణ ఉద్యోగార్థులు క్యాలెండర్ చిత్రానికి ఏడాది తద్దినం పెట్టారు. కొత్త ఉద్యోగాల లెక్క 58 వేల దగ్గరే ఆగిపోయింది. ఖాళీ అవుతున్న పోస్టులను పూరించకపోగా 2024లో పదవీ విరమణ పొందిన 8 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందడం లేదు. ఇప్పటికీ వారికి రూ.8,500 కోట్లు ప్రభుత్వం బాకీ పడింది.
2025లో మరో 10 వేల మంది రిటైర్ అవుతారు. వారి పరిస్థితి కూడా ఇలాగే ఉండకతప్పదు. 2023 జూలైలో వచ్చిన పే రివిజన్ వర్తింపజేయడం లేదని, హెల్త్‌కార్డులు పనిచేయడం లేదని పెన్షనర్ల జేఏసీ ఉద్యమబాట పట్టింది. రాష్ట్రంలో 14 లక్షల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.6 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి. ఈ జాప్యం వల్ల వారికి కాలేజీ నుంచి సర్టిఫికెట్లు అందడం లేదు. వారు పై చదువులకు, ఉద్యోగ ప్రయత్నాలకు దూరమవుతున్నారు. ఇలా ప్రతి అంశం డబ్బుతో ముడిపడి ఉన్నది. అప్పులు పుట్టడం లేదని ముఖ్యమంత్రి అంటున్నారు. ఆరు హామీల మాటేమో కానీ కాంగ్రెస్ చేతిలో రాష్ట్రం కోలుకోలేని చిక్కుల్లో ఇరుక్కుపోయే ప్రమాదంలో ఉన్నది.
– బద్రి నర్సన్