జన్మతః పౌరసత్వం అనేది అమెరికాలో రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. ఇప్పుడా హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేశారు. అమెరికాలో స్థిరపడి నాణ్యమైన జీవితాన్ని గడపాలని భావించే విద్యార్థులు, యువత ఉత్సాహాన్ని ఇది నీరుగారుస్తుందని అనడంలో సందేహం లేదు. అంతేకాదు, పౌరసత్వం పొంది పెరిగిన పిల్లల ద్వారా భవిష్యత్తులో తల్లిదండ్రులు కూడా పౌరసత్వాన్ని పొందవచ్చునన్న ఆశను ఇది అడుగంటిపోయేలా చేస్తుంది.
జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న ఈ చర్య సార్వత్రిక మానవ తా మూల సూత్రాలకు విరుద్ధమని విదేశీయులు భావిస్తుంటే, అమెరికా జాతీయ మూల సూత్రాలకు అనుకూలమని ప్రాంతీయ అమెరికన్లు సం బురపడుతున్నారు. సొంత దేశ ప్రయోజనాలను కాపాడుకునే చర్యలను ఇతర దేశస్థులు అమానవీయ చర్యలుగా భావిస్తుండటం స్థానిక అమెరికన్లకు మింగుడుపడటం లేదు. ఆ చర్యలు ఆ దేశంలో చట్టసభలకు, న్యాయ పరీక్షకు నిలుస్తా యా? లేదా? అన్నది వేరే విషయం. అయితే, రాజ్యాంగంలోని 14వ సవరణను రద్దుచేసే హక్కు అధ్యక్షుడికి లేదనే వాదన కూడా గట్టిగా వినిపిస్తున్నది.
ఎప్పుడో వందేండ్ల కిందటి అప్పటి అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకున్న పౌరసత్వ చట్టాన్ని ఇప్పటికీ అమలుచేస్తూ, అక్రమ వలసదారులను అక్కున చేర్చుకుంటూ, నానాటికీ పెరిగిపోతున్న వారి సంతతికి తోడ్పడే విలువైన అగ్రరాజ్య పౌరసత్వాన్ని అప్పనంగా ఇచ్చేస్తూ పోతే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. అమెరికన్లలో నిరుద్యోగులు, ఆవాసం లేని వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. 2018, 2019 సంవత్సరాల్లో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికన్ల అవకాశాలను దెబ్బతీసే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేయాలన్న వాదనను తెరపైకి తెచ్చారు. కారణాంతరాల వల్ల దానిని అమలుచేసే అవకాశం రాలేదు.
అమెరికా కోసం అర్రులు చాచడం గత మూడు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. 1990వ దశకంలో ఐటీ విప్లవం ఊపందుకోవడంతో సాంకేతిక నిపుణుల కొరత నెలకొన్నది. దీంతో భారతీయులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరిగాయి. భారీ సంఖ్యలో మేధోవలసలు మొదలయ్యాయి. కానీ అక్కడి జీవన ప్రమాణాలు, విలాసవంతమైన జీవన విధానానికి అలవాటుపడ్డ వలస జీవులు పౌరసత్వాన్ని పొందేవరకు అక్కడే స్థిరపడిపోయారు.
చట్టపరంగా పౌరసత్వం పొంది అక్కడి చట్టాలను గౌరవిస్తూ అక్కడివారితో కలిసి మెలసి హుందా గా అమెరికన్ పౌరులుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. విదేశీ వ్యామోహంలో పడి కొట్టుకుపోవడమే కాకుండా అమెరికా సంపద వృద్ధి చేయడం లో మన పాత్ర గురించి గొప్పలు చెప్పుకోవడం మనకు పరిపాటి. నిజానికి వారి అవసరాలకు అనుగుణంగా మన శక్తి సామర్థ్యాలను అమెరికా వాడుకుంటే, దానికి ప్రతిగా మనవారు కూడా అధిక వేతనాలతో డాలర్ల రూపంలో అక్కడే వ్యక్తిగత సంపద సృష్టించుకొని, విలాస జీవితాన్ని గడుపుతూ లాభపడ్డారు. ఇందులో త్యాగనిరతి ఏ మాత్రం లేదు.
అమెరికా కార్పొరేట్ చరిత్రలో భారత జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ లాంటి ఎంద రో హేమాహేమీల అసామాన్య ప్రతిభ మాత్రం మరువలేనిది. పౌరసత్వానికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశం ఉద్దేశం సరైన పత్రాలతో చట్టపరంగా ఇమిగ్రేషన్ పొందిన వారిని ఇబ్బంది పెట్టడం కాదని, అక్రమ వలసదారులపై వేటు వేసే ప్రధాన ఆయుధంగా ట్రంప్ దీన్ని వాడుకుంటారని శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. ఆ మాటకొస్తే జో బైడెన్ ప్రభుత్వం 1,500 మంది అక్రమ వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించి భారతదేశానికి తిప్పి పంపింది. ఆ సమయంలోనూ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా బహిష్కరించిన మొత్తం అక్రమ వలసదారుల సంఖ్య 2,70,000.
ఇప్పటికీ సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న కోటిన్నర మందిలో భారతీయుల సంఖ్య ఏడున్నర లక్షలుగా చెప్తు నారు. మెక్సికో, కెనడా, లాటిన్ అమెరికా, సాల్వెడార్, ఇండియా దేశాల అక్రమ వలసదారులే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీసా దరఖాస్తుల ప్రక్రియను మరింత కట్టడి చేసే నిర్ణయాన్ని కూడా ట్రంప్ తీసుకున్నారు.
‘బర్త్ టూరిజం’ ముసుగులో మరో మాయాజాలం కొనసాగుతున్నది. తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో ఉన్నత స్థితిలో ఉన్న కొందరు భారతీయ మహిళలు (ఇతర దేశస్థులు కూడా) డెలివరీ సమయానికి అమెరికా సందర్శనకు బయలుదేరుతారు. ప్రసవానంతరం తిరిగి స్వదేశానికి వెళ్లిపోతారు. అక్కడ పుట్టిన పిల్లలకు యథావిధిగా పౌరసత్వం లభిస్తుందని ఈ నాటకానికి తెరతీశారు. దీనినే ‘బర్త్ టూరిజం’ గా పేర్కొంటారు. ఇకపై దీనికి బ్రేక్ పడనుంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 30 దేశాలు జన్మతః పౌరసత్వ హక్కు కల్పించినప్పటికీ తర్వాత కాలంలో ఐర్లాండ్, న్యూజిలాండ్ వంటికొన్ని దేశాలు వాటిని రద్దు చేసుకున్నాయి. విమానాల్లో ప్రయాణించే గర్భిణులు ప్రసవిస్తే అటువంటి శిశువుకి 21 ఏండ్లు నిండే వరకు ఆ సంస్థకు చెందిన విమానాల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉన్నది. అటువంటి పిల్లలకు కొన్ని విమానయాన సంస్థలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయి. ఆకాశంలో పుట్టిన ఈ పిల్లలకు గగనతల పౌరసత్వ హక్కును కల్పించాలా? లేదా, జన్మించిన స్థల పరిధి ఏ దేశానికి సంబంధించినది అయితే ఆ దేశానికి సంబంధించిన పౌరసత్వం కల్పించాలా అనే విషయంపై ఆయా దేశాలు నిర్ణయం తీసుకుంటాయి.
అమెరికా భూభాగం మీదుగా ప్రయాణించే విమానంలో పుట్టిన పిల్లవాడు అమెరికా పౌరసత్వాన్ని పొందుతాడు. ప్రస్తుతానికైతే ఇండియా సహా అన్ని దేశాల్లో విమానయాన సంస్థలు ఆరో నెల నుంచే గర్భిణులను విమాన ప్రయాణానికి అనుమతించడానికి సుముఖత చూపడం లేదు.
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)
-ఆర్సీ కుమార్