రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రెండేండ్లలో పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన రెసిడెన్షియల్ స్కూళ్ల సమీక్షా సమావేశంలో ప్రకటించారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. కానీ, అంతకన్నా ముందు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న, ఇప్పటికే నడుస్తున్న గురుకుల విద్యాలయాలలో వసతుల అభివృద్ధికి, నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు గాను బడ్జెట్ను కేటాయించి గురుకులాలలో పునర్వైభవాన్ని తీసుకువస్తే బాగుంటుంది.
1971, నల్గొండ జిల్లా సర్వేలులో మొదటి గురుకుల విద్యాలయం ఏర్పాటైంది. క్రమంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల నుంచి గురుకుల విద్యాలయాలను అభివృద్ధి చేసింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యాలయాల్లో చేరేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపటం లేదు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలు, పాముకాటు సంఘటనలు, ఎలుకల బెడద వంటి ఘటనలతో విద్యార్థులు మరణిస్తుండటమే అందుకు కారణం. దీంతో ప్రభుత్వ గురుకులాలపై ఆదరణ తగ్గింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ గత ఏడాది డిసెంబర్లో విడుదలైంది. కాగా, గడువు ముగిసే నాటికి దాదాపు 80 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు సంవత్సరం 1.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే ఈ ఏడాది 40 వేల దరఖాస్తులు తగ్గాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు గురుకుల సొసైటీలు నడుస్తున్నాయి. ఇందులో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కింద ఉన్న 232 గురుకులాలలో 18,500 సీట్లున్నాయి. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్టీఆర్ఈఐఎస్) కింద ఉన్న 82 గురుకులాలలో 6,560 సీట్లున్నాయి. మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ కింద 294 గురుకులాలలో 23,680 సీట్లున్నాయి. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న 35 గురుకులాలలో 3,124 సీట్లున్నాయి. మొత్తం 4 సొసైటీలలో ఉన్న 643 గురుకులాలలో ఉన్న 51,864 సీట్లున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో వీటి కోసం 1,20,000 దరఖాస్తులు వస్తే, 2025-26 విద్యా సంవత్సరంలో 80,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మిగిలిన 5వ సొసైటీ, మైనారిటీ శాఖ కింద ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా సైట్ నిర్వహించి ప్రవేశాలు చేపడుతున్నది. పై నాలుగు సొసైటీలలో 2020-21 విద్యా సంవత్సరంలో 48,000 సీట్లకు గాను 1,68,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో సీటు కోసం సగటున 3.5 మంది పోటీ పడ్డారు. 2025-26 విద్యా సంవత్సరానికి 51,000 సీట్లకు గాను 80,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో సీటు కోసం సగం సగటున 1.6 మంది మాత్రమే పోటీ పడ్డారు. అంటే గతంలో కంటే పోటీ పడే విద్యార్థుల సంఖ్య తగ్గింది.
కాబట్టి, ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. 105 నియోజకవర్గాల్లో 105 సమీకృత గురుకులాలు ఒకేసారి నిర్మాణం చేపట్టడానికి బదులు, 1 లేదా 2 సమీకృత గురుకులాలను పరీక్ష నిమిత్తం ప్రారంభించాలి. ఒకవేళ అవి విజయవంతమైతే మిగతావి ఒక్కొక్కటిగా ప్రారంభించవచ్చు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు అయ్యే బడ్జెట్ను, గురుకుల విద్యాలయాలకు కేటాయిస్తే వసతులు మెరుగుపడుతాయి. అంతేకాదు, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు తగ్గుతాయి. విద్యలో నాణ్యత మెరుగుపడుతుంది. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అంది విద్యార్థుల ప్రవేశాలు ఎక్కువగా నమోదవుతాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాలు దేశంలోనే అగ్రపథంలో నిలుస్తాయి. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు పరిశోధన బృందాలను పంపించాలి. గురుకుల విద్యాలయాలపై ప్రజల సలహా, సూచనలను సేకరించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.
– సీవీవీ ప్రసాద్ 80196 08475