ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వ్యూహాత్మకంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఇంతకాలం కళ్లప్పగించి చూస్తూ కాలయాపన చేసి ఇప్పుడు పాలుపోని స్థితిలో లేనిపోని అభాండాలు కేసీఆర్‌పై మోపి తూతూ మంత్రంగా ఏదో చేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సొంత రాష్ట్రంలో రాజకీయ వైరుధ్యాలు, విభేదాలు ఎన్ని ఉన్నా పొరుగు రాష్ట్రంతో హక్కుల కోసం తలపడ్డప్పుడు సొంత రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రి పోరాడాలి తప్ప రాజకీయాలు చేయడం సరైనది కాదు. పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన హరీశ్‌రావు ముల్లుకర్రతో పొడిచేంతవరకు మొద్దు నిద్ర లేవని రేవంత్ ప్రభుత్వ నిష్క్రియా పరత్వం ప్రజల పాలిట శాపం కాక మరేమిటి?
సమైక్య రాష్ట్రంలో తొమ్మిదేండ్లు, నవ్యాంధ్ర రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా ఐదేండ్లు పనిచేసిన చంద్రబాబుకు ఇంటాబయటా ఇంత అనుకూలమైన రాజకీయ వాతావరణం గతంలో ఎప్పుడూ లేదు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మనుగడ చంద్రబాబు మద్దతుపై ఆధారపడి ఉన్నది. పైగా ఏపీలో వారి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నది. చంద్రబాబు కాలేజీలో చదువుకున్న విద్యార్థి నేడు తెలంగాణ సీఎం. ఇంతకంటే ఏం కావాలి. పెంకు వేడిగా ఉన్నప్పుడే రొట్టె కాల్చుకోవాలనే పద్ధతిలో బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. అది పోలవరంలో భాగమేనని దబాయిస్తున్నారు. అడ్డగించాల్సిన ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నత్త నడకలను తలపిస్తున్నాయి. కేసీఆర్, జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన మాటామంతి మేరకే చంద్రబాబు బనకచర్ల ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు. కానీ, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆ ఆరోపణలను ఖండిస్తూ నాటి సమావేశ వివరాలను వెల్లడించారు. నాటి చర్చల్లో బనకచర్ల ప్రస్తావనే లేదని, ఒప్పందాలేవీ జరగలేదని, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భిన్నంగా దేన్నీ ఒప్పుకొనే ప్రసక్తి లేదని నాడు సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. సాక్ష్యాధారాలు చూపించారు.
‘నేను కొట్టినట్టు చేస్తా, నీవు ఏడ్చినట్టు చెయ్’ అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సంకీర్ణ బంధం, కాంగ్రెస్‌కు గురుశిష్య సంబంధం అడ్డొస్తున్న ఫలితంగా ఆ రెండు పార్టీలు బనకచర్ల పట్ల ఒక ఉద్యమస్ఫూర్తి ప్రదర్శించడం లేదు. వాస్తవానికి కాంగ్రెస్ తన చిరకాల ప్రత్యర్థి బీజేపీపై, దాని మిత్రపక్షమైన టీడీపీపై విరుచుకుపడాలి. అవసరమైతే నాటి సీఎం కేసీఆర్‌లాగా తెలంగాణ కోసం ఏకకాలంలో బాబును, మోదీని ధిక్కరించి ఢీకొట్టాలి. కానీ, ఆ వాతావరణం లేదు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు మిత్రపక్షాల్లా వ్యవహరిస్తున్నాయి. బనకచర్ల విషయంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మైత్రి ముక్కోణపు ప్రేమకథా చిత్రాన్ని గుర్తుచేస్తున్నది.
బనకచర్ల నిర్మాణం ద్వారా గోదావరి జలాలపై ఏపీకి అపారమైన హక్కు భుక్తాలను కల్పించే, స్థిరీకరించే, శాశ్వతీకరించే కుట్ర పెద్ద ఎత్తున జరుగుతున్నది. బనకచర్ల కంటే ముందే గోదావరి జలాల్లో తెలంగాణ వాటా అంతిమంగా తేలాలి. చట్టబద్ధమైన కేటాయింపులు జరగాలి.
ఆ దిశగా కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేయలేదు. బనకచర్ల పనులు మాత్రం కేంద్రం దన్నుతో వేగం పుంజుకున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం ఇంకా కాళేశ్వరం ఒక విఫల నిర్మాణంగా చూపించే ప్రయత్నం చేస్తున్నదే తప్ప, మేడిగడ్డను బాగుచేసి కాళేశ్వరం ప్రాజెక్టును సంపూర్ణ వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం బనకచర్లను కట్టి నింపాలనుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరంను చంపాలనుకుంటున్నది. అందుకేనేమో ‘చంద్ర బాబు మీరూ ప్రాజెక్టులు కట్టుకోండి వద్దన్నామా’ అంటూ హితోక్తులు పలికారు. నవ్వేటోడి ముందు జారి పడ్డట్టున్నది తెలంగాణ పరిస్థితి. కాకపోతే ఏమిటి? ఏ ప్రాజెక్టు ఏ రివర్ బేసిన్లో ఉన్నదో, అది ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఉందో ఇంకా అడిగి తెలుసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాధినేతలు ఉంటే పక్క రాష్ర్టాల ముందు పలుచనైపోమా?
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మనమూ బాగుండాలి, పొరుగు రాష్ర్టాలు బాగుండాలన్న రీతిలో నదీజలాల విషయంలో వ్యవహరించారు. దశాబ్దాల వివాదాలకు పరిష్కారమార్గం చూపారు. కుంటిసాకులు చూపి తప్పించుకోలే. కలలో కూడా తెలంగాణ ప్రయోజనాలు విస్మరించలే. ‘నదులు పల్లంలో ఉన్నాయి. మీరు ఎత్తున ఉన్నారు. అది మీ ఖర్మ’ అంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిన సమైక్య పాలకులకు చెంపపెట్టుగా నదులను పైకెత్తి పారించి రాష్ట్రంలో అడుగడుగునా జలదృశ్యాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి కేంద్రంతో కయ్యానికి కూడా వెనుకాడలేదు. వారి ఆర్థిక దిగ్బంధనాలకు కట్టుబడలేదు. బెదిరింపులకు భయపడలేదు. వ్యతిరేక శక్తుల కుట్రలను సాగనీయలేదు. ఆ భావోద్వేగం ప్రస్తుత ప్రభుత్వంలో అణు మాత్రమైనా కనిపించడం లేదు.
రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా జల వనరుల విషయంలో సాధించింది శూన్యం. ఏ ఒక్క ప్రాజెక్టులోను తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు. ఆక్రమణదారులను తరిమేసి పహరా పెట్టి నాగార్జునసాగర్ డ్యాంను కేసీఆర్ కాపాడితే ఈ ప్రభుత్వం చేతులెత్తేసింది. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం మూసుకుపోయింది. సుంకేశుల రిటైనింగ్ వాల్ పడిపోయింది. వట్టెం పంపు మునిగిపోయింది. పెద్దవాగు కూలిపోయింది. చెరువుల వైపు చూసేవాడే లేడు. మొత్తంగా తెలంగాణ జలవనరుల పరిస్థితి ‘అంగట్ల అవ్వ అంటే ఎవరికి పుట్టినావు బిడ్డ’ అన్నట్టు తయారైంది. ప్రభుత్వానికి నీళ్ల సోయి లేకపోవడం వల్ల ఏర్పడిన దుస్థితి ఇది. ఇప్పుడు తెలంగాణ గుండె మీద బనకచర్ల ఒక బండ. అక్రమమని తెలిసీ తన రాష్ట్రం కోసం, రాజకీయం కోసం చంద్రబాబు నదీ జలాల తరలింపునకు ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకునే సోయి తెలంగాణ ప్రభుత్వానికి ఉండాలి. ఏపీకి అండగా కేంద్రం ఉండనే ఉన్నది. ‘తల్లిని చంపి పిల్లను బతికించారు’ అని అన్నప్పుడే తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వైఖరి తేటతెల్లమైంది.
మళ్లీ కేసీఆర్ గద్దెనెక్కితే బనకచర్ల అసాధ్యమని మోదీకి, చంద్రబాబుకు తెలుసు. అందుకే ఈ మూడేండ్లలోపు బనకచర్ల పూర్తిచేసి ఇల్లు చక్క పెట్టుకోవాలన్నది ఆ ఇద్దరి తాపత్రయం. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటినా తెలంగాణకు కేంద్రం ఒక్క జాతీయ ప్రాజెక్టు ప్రకటించలేదు. బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు. ఇప్పుడు బనకచర్లను వారు అడ్డుకుంటారనుకోవడం అత్యాశే. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేయడం తప్ప ఎదిరించే, నిలదీసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నదా అన్నది సందేహాస్పదమే . సీఎం రేవంత్ ఢిల్లీలో మాట్లాడినా, గల్లీలో మాట్లాడినా అదే అరిగిపోయిన రికార్డు. కేసీఆర్‌ను ఆడిపోసుకోవడం. తెలంగాణ తొలి జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, మీడియా సమావేశాల ద్వారా బనకచర్ల ప్రమాదాన్ని, చంద్రబాబు నైజాన్ని బట్టబయలు చేస్తూ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కృషిని వివరిస్తూ తేదీలు, లెక్కలు, ఆధారాలతో వివరిస్తుంటే అదేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల హక్కుల విషయంలో చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నది. మోదీని రేవంత్ గట్టిగా నిలదీయలేరు. చంద్రబాబును మోదీ కట్టడి చేయలేరు. ఎవరి బలహీనతలు వారివి. ఇక తెలంగాణ ప్రజలకు మరో జల సమరం తప్పదేమో.
– డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238