బీఆర్ఎస్ రజతోత్సవ సంరంభంలో ఒక సింహావలోకనం అవసరం. బీఆర్ఎస్ పాతికేండ్ల ప్రస్థానం నిశితంగా గమనిస్తే అడ్డంకులను అధిగమిస్తూ గమ్యాన్ని చేరుకునే జీవనదీ గమనాన్ని తలపిస్తున్నది. బీఆర్ఎస్ వర్తమాన రాజకీయాలకు ఒక పాఠ్య ప్రణాళిక. 2001 నుంచి 2014 దాక కొనసాగిన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో బీఆర్ఎస్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఎన్నికల్లో నిరాశాజనకమైన ఫలితాలను చవిచూసింది. ఆ కష్టకాలంలో అనుమానాలు, భయాలు లేకుండా నిశ్చలంగా నిర్భయంగా తెలంగాణ వచ్చితీరుతుందని మొక్కవోని విశ్వాసంతో ముందుకుసాగిన ఉద్యమనేత ఒకే ఒక్కడు. అతడే కేసీఆర్.ఒ క దశలో ప్రజలు సమైక్య రాష్ర్టాన్ని కోరుకుంటున్నారని, అదో ముగిసిన చరిత్ర అని, బీఆర్ఎస్ పనైపోయిందని ఎవరికి తోచినట్టు వారు శాపనార్థాలు పెట్టి పైశాచికానందాన్ని అనుభవించారు.
ఎన్నో ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగరవేసిన బీఆర్ఎస్కు 2008 ఉప ఎన్నికలు, 2009 సాధారణ ఎన్నికల్లో చేదనుభవాలు ఎదురయ్యాయి. మళ్లీ ఉప ఎన్నికలకు ఉపక్రమించడాన్ని చూసి సమాజం నివ్వెరపోయింది. కథ పునరావృతమవుతుందని తెలంగాణ వ్యతిరేకులు చంకలు గుద్దుకున్నారు. బీఆర్ఎస్కు అవే ఆఖరి ఎన్నికలన్నారు. ఉద్యమకారుల్లో నరాలు తెగే ఉత్కంఠ. చావో రేవో తేల్చుకోవాలన్న తెగింపు. సిర్పూర్ కాగజ్నగర్, చెన్నూరు, మంచిర్యాల, ఎల్లారెడ్డి, కోరుట్ల, ధర్మపురి, సిరిసిల్ల, హుజూరాబాద్ సిద్దిపేట, వరంగల్ పశ్చిమ మొత్తం పది మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు రాజీనామా చేశారు.
నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్లీ అదే పార్టీ నుంచి పోటీలో నిలవగా వేములవాడ టీడీపీ శాసనసభ్యుడు పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ఎన్నికలు జరిగి 2010 జూలై 30న ఫలితాలు వెలువడ్డాయి. ఏడాది పాటుగా కమ్ముకున్న కారు మబ్బులు తొలగిపోయాయి. అవి ఫలితాలు అనే కంటే ప్రభంజనాలు అంటే సరిపోతుందేమో. బీఆర్ఎస్ మెజారిటీల సునామీ సృష్టించింది. కాంగ్రెస్ అతిరథులంతా కొట్టుకుపోయారు. అన్నిచోట్ల టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ విజయం సాధించింది.
అదే ఒరవడిలో 2011లో బాన్సువాడ 2012లో కామారెడ్డి ఆదిలాబాద్ శాసనసభ్యులు టీడీపీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఘన విజయం సాధించగా నాగర్కర్నూల్ టీడీపీ శాసనసభ్యుడు అదే దారిలో బీఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
ఇక కాంగ్రెస్కు చెందిన కొల్లాపూర్, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యక్తిగత కారణాలతో చేసిన రాజీనామాతో అదే ఏడాది జూన్లో జరిగిన పరకాల ఉప ఎన్నికలో ఆఖరి పోరాటంగా భావించిన కాంగ్రెస్, టీడీపీ విశ్వప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ విజయ వీచికలు రాష్ట్రమంతా ప్రసరించాయి. ఈ వీచికలే మహా ప్రభంజనాలై తదనంతర కాలంలో రాష్ట్ర సాధనకు దారితీశాయి. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర సాధకుడిగానే కాదు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర తెలిసిందే.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238