వక్ఫ్ సవరణల బిల్లు ఆగమేఘాల మీద లోక్సభ ఆమోదం పొందడం బీజేపీ సర్కారు ప్రాధాన్యాలకు అద్దం పడుతున్నది. సొంతంగా బలం లేకపోయినా మిత్రపక్షాల మద్దతుతో నెట్టుకురావచ్చన్న ధీమా అడుగడుగునా కనిపించింది. వక్ఫ్ నిర్వహణలో సమస్యలు లేవని, వక్ఫ్ ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయని ఎవరూ అనరు. కానీ, బీజేపీ తలపెట్టిన సవరణలు వాటికి పరిష్కారాలు చూపుతాయా? అనేది ప్రశ్న. ఏ మతం వారైనా తమ మతానికి సంబంధించిన ఆస్తుల నిర్వహణలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారనేది తెలిసిందే. కానీ, ఇక్కడ ముస్లింలకు ప్రత్యేకించిన ఆస్తుల నిర్వహణలో ముస్లిమేతరులకు వీలుకల్పించడం విమర్శలకు దారితీస్తున్నది.
వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు, పారదర్శకత తేవడానికి, వక్ఫ్ ఆస్తుల సమర్థ నిర్వహణకు తాజా సవరణలు తోడ్పడతాయని ప్రభుత్వం అంటున్నది. అయితే సవరణలు ముస్లిం సమాజానికి సంప్రదాయకంగా దఖలుపడిన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని, మతపరమైన నిధులపై ప్రభుత్వ నియంత్రణకు అవి దారితీస్తున్నాయని విపక్షాలు అంటున్నాయి. అనేక వక్ఫ్ ఆస్తులు ప్రధాన పట్టణాల్లో ఉన్నందున, ప్రభుత్వ పర్యవేక్షణ చివరికి వాణిజ్య ఉపయోగాల కోసం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు దారితీస్తుందనే భయమూ వ్యక్తమవుతున్నది.
దీర్ఘకాలికంగా మసీదు, ఖబరస్థాన్ లేదా మరే ఇతర మతపరమైన అవసరానికి ఉపయోగించే భూమిని ప్రత్యేకించి రాసివ్వకపోయినా వక్ఫ్ ఆస్తిగా పరిగణించే ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధన తొలగింపును బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ వ్యతిరేకించింది. జేపీసీ నివేదికలో ఆ సం గతి నమోదు చేశారు. అంతిమంగా బిల్లులో మాత్రం ఆ సిఫారసును చేర్చలేదు. ఒక ఆస్తి వక్ఫ్ కిందకు వస్తుందా లేక సర్కారుకు చెందుతుందా? అనేది నిర్ధారించే అధికారం కలెక్టర్ లేదా ఆ పైస్థాయి అధికారికి కల్పించే నిబంధన కూడా వివాదాస్పదమైంది.
ఇలాంటి కీలక సవరణలను రూపొందించే విషయంలో ప్రభుత్వం ముస్లిం సంస్థలను తగినంతగా సంప్రదించలేదనే ఆరోపణలూ ఉన్నా యి. ఇదంతా ఒక మొక్కుబడి తంతుగానే సర్కారు నిర్వహించింది. పాలక, విపక్షాల సీట్ల లెక్కలకు అనుగుణంగా బిల్లును సమర్థిస్తూ 288 ఓట్లు, వ్యకిరేకిస్తూ 232 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి సుమారు 2 గంటలకు బిల్లును సభ ఆమోదించినట్టు ప్రకటించడం గమనార్హం. బిల్లు మైనారిటీ శాఖమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టినప్పటికీ విపక్షాల అభ్యంతరాలకు సమాధానం ఇస్తూ హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి.
మతపరమైన ఆస్తుల విషయంలో ఇతరుల జోక్యం ఉంటుందని, మతపరమైన విషయాల్లో కాదని ఆయన ఇచ్చిన వివరణ విపక్షాలకు సంతృప్తి కలిగించలేదు. అంతా సవ్యంగా, చట్టబద్ధంగా జరుగుతున్నదా లేదా అనేది నిర్ధారించుకునేందుకే ముస్లిమేతరులకు వక్ఫ్ బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్టు చెప్తున్న మాటలు న్యాయపరమైన సమీక్షకు నిలుస్తాయా అనేది సందేహమే. సవరణలను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ప్రకటించింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బిల్లు ప్రతులను సభాముఖంగానే చించేసి నిరసన తెలిపారు.
ఇంతకూ న్యాయపరిశీలనకు బిల్లు నిలుస్తుందా అనేది పెద్ద ప్రశ్న. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను సమర్థిస్తూనే, ప్రజా సంక్షేమం కోసం మత సంస్థలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతిస్తుంది. ఆయా మతవర్గాలకు మతపరమైన ఆస్తుల నిర్వహణను సొంతంగా నిర్వహించే హక్కును రాజ్యాంగంలోని 26వ అధికరణం హామీ ఇస్తుంది. అదేవిధంగా మైనారిటీలకు సొంత సంస్థల స్థాపనకు, నిర్వహణకు 30వ అధికరణం హక్కులను కల్పిస్తున్నది. మతపరమైన ఆస్తుల దుర్వినియోగమే అసలు సమస్య అయితే అందుకు కట్టుదిట్టమైన కట్టుబాట్లు తేవచ్చు. కానీ పారదర్శకత, జవాబుదారీతనం ముసుగులో మతపరమైన స్వయం ప్రతిపత్తిని బలిపెట్టడం అసలు సమస్య. బీజేపీ పాలనలో అభద్రతాభావనకు లోనవుతున్న మైనారిటీలను ఈ వక్ఫ్ బిల్లు మరింతగా ఒత్తిడికి గురిచేస్తుందని చెప్పక తప్పదు.