అంతర్గత కల్లోలంతో బ్రిటన్ అట్టుడుకుతున్నది. దేశవ్యాప్తంగా జాత్యహంకారవాదులు వలసవాదులపై దాడులు చేస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. లూటీలు, దహనాలకు పాల్పడుతూ శాంతిభద్రతల యంత్రాంగానికి సవాలు విసురుతున్నారు. వివిధ నగరాలు, పట్టణాల్లో వారు లక్ష్యంగా చేసుకున్న 39 ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బ్రిటన్లో ఆశ్రయం కోరివచ్చిన వారు బస చేస్తున్న హోటళ్లపై, అపార్టుమెంట్లపై జాత్యహంకారవాదులు వారం రోజులుగా హింసాత్మక దాడులకు తెగబడుతున్నారు. ఆయా ప్రాంతా ల్లో నివసించే వలసదారుల కుటుంబాలవారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని భయం భయంగా బతుకుతున్నారు.
ప్రస్తుత పరిస్థితిని కొందరు ‘అంతర్యుద్ధం’గా అభివర్ణించడం గమనార్హం. జూలై 30న సౌత్ పోర్ట్లో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ అల్లర్లకు నిప్పురవ్వలా మారింది. ఈ దాడిలో పాల్గొన్నది ముస్లిం శరణార్థి అంటూ జాత్యంహంకారులు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడంతో మత కల్లోలం తలెత్తింది. అయితే దాడి జరిపిన వ్యక్తి రువాండా నుంచి వచ్చిన క్రైస్తవుడు. బ్రిటన్లో స్థానిక, స్థానికేతర వైషమ్యాలు ఏ స్థాయికి చేరాయో ఇది సూచిస్తున్నది. పైగా సోషల్ మీడియాను సంఘ విద్రోహశక్తులు ఎలా దుర్వినియోగం చేస్తాయో ఈ ఉదంతం కండ్లకు కట్టింది. తమ దేశంలో అమల్లో ఉన్న వాక్ స్వాతంత్య్రం గురించి గర్వంగా చెప్పుకొనే బ్రిటన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలపై నియంత్రణలు విధించాలని ఆలోచిస్తుండటం గమనార్హం. కొన్నేండ్లుగా రాజకీయవేత్తలు చేస్తున్న వలసవాద వ్యతిరేక ప్రచారాన్ని బ్రిటన్ ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేయడం ప్రస్తుత విపరీత పరిణామాలకు కారణమని చెప్పవచ్చు.
200 ఏండ్లకు పైగా వలసవాద చరిత్ర కలిగిన బ్రిటన్ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యమని తెలిసిందే. ఒకప్పుడు తమ ఏలుబడిలో ఉన్న దేశాల నుంచి రకరకాల కారణాల వల్ల బ్రిటన్కు వలస వచ్చేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. వలసదార్ల సంతతి వారు విద్య, వ్యాపార రంగాల్లో ముందంజ సాధిస్తున్నారు. దీనికి పరాకాష్ఠగా భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ మొన్నటివరకు బ్రిటన్ ప్రధాని పదవిని నిర్వహించిన సంగతి తెలిసిందే. వలసదార్ల వర్గాలు సాధిస్తున్న అభ్యున్నతి స్థానికులకు కంటగింపుగా మారింది. తమకు దక్కాల్సిందేదో వలసదార్ల కుటుంబాల నుంచి వచ్చినవారు తన్నుకుపోతున్నారనే విష ప్రచారం, తద్వారా వలసదార్లపై విద్వేషాలు రెచ్చగొట్టడం ఇటీవలి కాలంలో ఊపందుకున్నది. నిజానికి ఈ ధోరణి యూరప్ అంతటా విస్తరిస్తున్నది.
జాత్యహంకారులు రాజకీయాలను శాసించే స్థితికి రావడం ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తున్నది. అటు అమెరికాలోనూ వలసదార్ల వ్యతిరేక రాజకీయాలు ఇటీవలి కాలంలో ఊపందుకున్నాయి. మాజీ అధ్యక్షుడు ట్రంప్ రాజకీయ విధానాల్లో ఇదే ముఖ్యాంశంగా ఉండటం మనం చూస్తున్నాం. బ్రిటన్ కూడా ఆ తరహా జాతీయ అతివాదానికి మినహాయింపు కాదని తాజా అల్లర్లు రుజువు చేస్తున్నాయి. చివరిసారిగా 2011లో బ్రిటన్లో వలసవాద వ్యతిరేక అల్లర్లు పెద్దఎత్తున జరిగాయి. అయితే అవి లండన్ మహానగరానికే పరిమితమయ్యాయి. కాగా, ఈసారి చిన్న పట్టణాలకూ వ్యాపించాయి. ఇటీవలే పగ్గాలు చేపట్టిన లేబర్ పార్టీ ప్రభుత్వానికి ప్రస్తుత అల్లర్లు అగ్నిపరీక్షగా మారాయి. జన ద్వేషంతో కూడిన హింసాకాండను సత్వరమే కఠినంగా అణచివేయాల్సిన అవసరం ఎంత ఉందో, వైషమ్యాలకు ఆజ్యం పోస్తున్న ‘ఆర్థిక అభద్రత’కు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనడం కూడా అంతే ముఖ్యం.