EMPLOYMENT అనే ఆక్రోనింను ఆధారం చేసుకుని వాటి అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తామనే వాగ్దానంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను 23 జూలై రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆక్రోనిం అక్షరక్రమ విస్తరణ రూపంలో విద్య, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఉత్పాదకత, భూమి, అవకాశాలు, యువత, మధ్యతరగతి, శక్తి, నూతన సంస్కరణలు, సాంకేతికత వంటి పది అంశాలలో వికాసం కోసం కేటాయింపులు జరిపామని చెప్పుకొచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పైవాటిలో 7 అంశాలను తీసుకుని సప్తర్షి సాధన అని నామకరణం చేశారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో వేగంగా దూసుకెళ్తున్నామని గ్రామాలను, పేదలను, రైతులను, నయా మధ్యతరగతి వర్గాలకు మరింత సమృద్ధిని కలిగించే దిశలో ఈ బడ్జెట్ ఒక శక్తిగా పని చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
కానీ, రాజ్యాంగ పీఠిక, సంక్షేమ రాజ్య సిద్ధాంతాల వెలుగులో మోదీ బడ్జెట్‌ను పరిశీలిస్తే అనేక విస్మయకర, తిరోగమన, వివక్ష, ప్రతీకార, అభద్రత, ఫాసిస్ట్ ధోరణులు స్పష్టమవుతున్నా యి. 2014 నుంచి కొనసాగుతున్న ఎన్డీయే పాలనలో మానవ జీవన ప్రమాణాల కొలమానాలలో తీవ్రమైన వెనుకబాటు దిశ ఉన్నది. దీన్ని విస్మరిస్తూ దేశం పలు రంగాల్లో అగ్రగామిగా ఉన్నదనే అందమైన అబద్ధాలను చెప్పి దేశ ప్రజలను నమ్మించే ప్రయ త్నం నిరాఘాటంగా చేస్తున్నది. సమాఖ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ దక్షిణాది రాష్ర్టాలకు మొండిచెయ్యిని చూపింది.
కేంద్రాని కి వస్తున్న పన్నుల ఆదాయంలో అత్యధిక వాటా దక్షణాది రాష్ర్టాలదే. దశాబ్దాలుగా పలురకాల వివక్షను, అణచివేతను అనుభవించిన తెలంగాణకు బడ్జెట్ ఏడుపునే మిగిలించింది. 8 సీట్లను కట్టబెట్టిన తెలంగాణకు నిధుల కేటాయింపులో భరించలేని వివక్షను చూపుతున్నది. కేంద్రానికి వస్తున్న పన్నుల, సేవల ఆదాయంలో సగంపైగా శ్రామిక ఉత్పాదకవర్గాల నుంచి వస్తున్నది. కానీ వీరికి సామాజిక భద్రత విద్య, వైద్యం అందించే అంశాలలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.
సార్వత్రిక విద్య, వైద్యం సంక్షేమరాజ్య పునాదులు అని ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. ప్రజలు తమ సంపాదనలో 75 శాతం వెచ్చిస్తున్నారని చెప్పింది. భారత్‌లో వ్యాపారవేత్తలు, పారిశ్రామిక అధిపతులు లాభాల సముద్రంలో విహరిస్తున్నారని కూడా ప్రస్తావించింది. కానీ బడ్జెట్లో ఈ అంశాలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. జీడీపీలో విద్యకు 6 శాతం, వైద్యానికి 3 నిధులు కేటాయించాలని సూచించింది. విద్య, వైద్యం ఆధారంగా వెలువరించే మానవాభివృద్ధి సూచిక-2024లో భారత్ 134వ స్థానాన్ని కలిగి ఉన్నది. ఈ సూచిక ఎన్డీయే కాలంలో క్షీణిస్తూ పోతున్నది. విద్యకు రూ.1,25,638 కోట్లు, వైద్యానికి రూ.89,287 కోట్లు కేటాయించారు. ఇవి జీడీపీలో ఒక శాతం లోపే ఉంటాయి.
ఉమ్మడి జాబితాలోని విద్యపై కనీస పట్టింపు లేదు. పీఎం పోషణ్, రాష్ర్టాల యూనివర్సిటీలకు నిధులను భారీగా తగ్గించారు. ఆయుష్మాన్‌భవ, స్వస్థసురక్ష పథకాలకు కూడా నిధులను తగ్గించారు. గ్రామీణ ప్రజలపై బడ్జెట్ తీవ్ర కక్షపూరితంగా వ్యవహరించింది. కూలీల కొనుగోలు శక్తిని పెంచే గాంధీ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేల కోట్లను ఇచ్చింది. ఇవి 20 రోజుల పనిని కూడా కల్పించలేవు. ఇటీవల బీజేపీ ఓడిపోయిన పార్లమెంట్ స్థానాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలే. కసితో సర్కారు ఆ ప్రజలపై సర్జికల్ స్ట్రయిక్ చేసినట్టున్నది. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్ ఇచ్చే నేషనల్ అసిస్టెన్స్ కార్యక్రమానికి నిధులను పెంచలేదు.
రైతుల ఉసురు తీస్తూ వచ్చిన మోదీ ఈసారి 20 లక్షల కోట్ల రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం విడ్డూరం. ఇది మరొకసారి రైతులను మభ్యపెట్టేదిగా ఉంది. 2023-24 బడ్జెట్ కేటాయింపులతో పోల్చితే ఈసారి ఎరువుల సబ్సిడీ భారీగా తగ్గించారు. ఆహార సబ్సిడీకి ఏడు వేల కోట్ల కోత పెట్టారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 4 శాతం నిధులను తగ్గించారు. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఎక్కువై, వారి నిజ ఆదాయం తగ్గుతుంది. వ్యవసాయరంగ ఆధార అభివృద్ధితో పారిశ్రామిక ప్రగతి వైపు దృష్టి సారించాలనే స్పృహ బడ్జెట్లో ఏ మాత్రం లేదు. మొత్తం మీద రాజ్యాంగ వ్యతిరేక, ఫాసిస్ట్ అనుకూల ధోరణులకు పరాకాష్ఠగా కేంద్రం ఈ బడ్జెట్‌ను రూపొందించింది.
– అస్నాల శ్రీనివాస్ 96522 75560