విద్యాబోధనను, సాహిత్య కృషిని సమానంగా నడిపిన ధన్యజీవి ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి. అసంఖ్యాకమైన విద్యార్థుల అభిమానం చూరగొనడమే కాకుండా సంస్కృతాంధ్రాంగ్ల సాహిత్యాల్లో అపారమైన కృషి చేసి పేరుప్రఖ్యాతులు పొందారు. ఆయన నిరాడంబరులు, నిగర్వి, నిత్య పఠనాభిలాషి. వారి మరణంతో తెలంగాణ ఒక గొప్ప బహుభాషాకోవిదుణ్ణి, సంప్రదాయవాదిని, ఆధ్యాత్మిక వాదిని కోల్పోయిందని చెప్పవచ్చు.
కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో సుదీర్ఘంగా అంటే దాదాపు 30 ఏండ్ల పాటు ఆంగ్ల బోధకుడుగా విశేష సేవలందించిన శ్రీపెరంబుదూరు లక్ష్మణమూర్తి నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో 1940 జులై 20న వైష్ణవ సాంప్రదాయ కుటుంబంలో రాఘవాచార్యులు, తాయారమ్మ దంపతులకు జన్మించారు. కురుచైన విగ్రహం, విశాల ఫాలభాగం మధ్యలో వైష్ణవ సాంప్రదాయం ఉట్టిపడేట్టు నిలువు కుంకుమరేఖ, పాండిత్య శోభతో అలరారే వదనంతో చూపరులను ఇట్టే ఆకర్షించేవారు.
ఆంగ్లంలో ప్రొఫెసర్‌గా లక్ష్మణమూర్తి ఎంత లబ్ధప్రతిష్టులో, సంస్కృతాంధ్ర సాహిత్యంలోను అంతే ప్రఖ్యాతి గాంచారు. తరగతి గదిలో వారి వైవిధ్యమైన ఆంగ్లబోధన ఒకవైపు, సంస్కృతాంధ్ర భాషల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు మరొక వైపు వీరికి సాహితీ సమాజంలో ఎనలేని గౌరవాన్ని సంపాదించి పెట్టాయి. ఎమ్.ఎ విద్యార్థులందరికీ వారి పాఠం వినటం కర్ణపేయంగా ఉండేది. వారి విద్యార్థులమని చెప్పుకోవడానికి గర్వ పడేంత గొప్ప గురువు ఆయన. ఆధ్యాత్మిక ప్రసంగమైనా, సాధారణ ప్రసంగమైనా అందరినీ కట్టిపడేసే ప్రత్యేక శైలితో, సున్నితమైన హాస్య ధోరణితో అటు పండితులను, ఇటు పామరులను సమంగా అలరించిన ప్రతిభ వారిది. లక్ష్మణమూర్తి స్వయంగా శివ భక్తులు. వారి నాన్న గారి కోరిక మేరకు శ్రీకృష్ణుడిపై గోపికా వల్లభా అనే శతకం రాశారు. వేల పుస్తకాలు ముద్రించి ధర: ’అమూల్యం’ అంటూ పఠనాసక్తి ఉన్నవారందరికి ఉచితంగా అందజేసిన గొప్ప సంస్కారం వారిది.
‘సమర్పణం’ పేరిట లక్ష్మణమూర్తి తన ప్రియమిత్రుడు నరసింహారెడ్డి స్మృతిలో ఖండ కావ్యాలు రాసి, ఆయన ఆత్మకే అంకితమిచ్చారు. ప్రముఖ సాహితీవేత్త రవ్వా శ్రీహరి చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరింపబడింది. వేదాలు, ఉపనిషత్తులపై లక్ష్మణమూర్తి చేసిన వందలాది రేడియో ప్రసంగాలను రేడియో పాఠకులు ఇప్పటికీ ఎంతో ఆసక్తితో ఆలకిస్తుంటారు. వరంగల్‌కు చెందిన సహృదయ సాహితీ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో రామాయణ, మహాభారత, భాగవతాలపై తమ ప్రసంగాలతో లక్ష్మణ మూర్తిగారు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవారు. వీరు చాలా కాలం టి.టి.డి. సంపాదక వర్గంలో ఉండి భక్తి సంబంధమైన అనేక వ్యాసాలను రాశారు. చివరగా, మూర్తి గారికి స్వామి వివేకానందుని జీవితమన్నా, వారి బోధనలన్నా అపారమైన గౌరవం ఉండేది. స్వామి వివేకానందకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలైనా వారు ఉత్సాహంగా పాల్గొనేవారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకై వరంగల్ విచ్చేసిన స్వాములు వివిధ భాషల్లో ప్రసంగిస్తున్నప్పుడు వారి ప్రసంగాలను అలవోకగా తెలుగులో తర్జుమా చేసి ప్రేక్షకుల మన్ననలను పొందిన ఘనత వీరిది.
– డా. తుమ్మూరి శరత్ బాబు
76719 36040