ప్రస్తుత భారత న్యాయవ్యవస్థలో సమాజంలోని వివిధ సమస్యలు ఉదాహరణకు, కులం, మతం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, స్త్రీలోలత్వం వంటి రుగ్మతలు ప్రతిఫలిస్తున్నాయి. సమాజంలో ఉన్న అవలక్షణాలు న్యాయవ్యవస్థలో కూడా కనిపిస్తున్నాయి. అయితే, సమాజంలో ఉన్న నిజాయితీపరులు, మంచి వ్యక్తులు న్యాయవ్యవస్థలో కూడా ఉన్నారు. న్యాయమూర్తులు మన సమాజం నుంచే వస్తున్నారు; వారు ఆకాశం నుంచి ఊడిపడటం లేదు. కాబట్టి, వారికి మనం ఇచ్చే న్యాయమూర్తి అనే గౌరవాన్ని వారు నిలబెట్టుకోవాలి. అయితే, కొందరి వల్ల న్యాయవ్యవస్థకు చెడ్డ పేరు వస్తున్నది.
కోర్టులను ఆశ్రయించే క్లయింట్లు కూడా న్యాయవాదిని నియమించుకునే ముందు జడ్జిలను ఆ న్యాయవాది ప్రభావితం చేయగలడా లేదా అని పరిశీలిస్తున్నారు. ఇది న్యాయవాదికి ఒక అదనపు అర్హతగా మారింది. నీతివంతంగా పనిచేసే న్యాయమూర్తులను కూడా అవినీతి పరులుగా పేర్కొంటూ, తమ క్లయింట్ నుంచి జడ్జిని ప్రభావితం చేయాలని డబ్బులు తీసుకునే న్యాయవాదులూ ఉన్నారు. దీనివల్ల న్యాయవ్యవస్థపై చాలామందికి దురభిప్రాయం ఏర్పడుతున్నది. అవినీతికి పాల్పడే న్యాయమూర్తుల వల్ల రాజ్యాంగం కల్పించిన రక్షణలు దుర్వినియోగమవుతున్నాయి. ఎవరైనా వారు చేసే తప్పులను ఎత్తిచూపితే,‘కంటెంప్ట్ ఆఫ్ కోర్టు’ అనే రక్షణ చట్రం వారికుంది. ఇది తొలగించాలి. జడ్జిలు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కుండాలి. ‘ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్’ వెంటనే ఏర్పాటుచేయాలి. జడ్జిలు తమ సంతానాన్ని, దగ్గరి బంధువులను జడ్జిలుగా నియమించుకునే విధంగా ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలి.
ఇక్కడ ఒక సంఘటనను గుర్తుచేస్తున్నాను. హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో ఒకటవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేసిన ఒక వ్యక్తి, ఎన్డీపీఎస్ కేసులో ఒక బాధితునికి (నేరం రుజువు కాలేదు) బెయిల్ మంజూరు చేయడానికి రూ.7.5 లక్షల లంచం తీసుకున్నాడు. సదరు జడ్జిపై నేను ఫిర్యాదు చేయగా హైకోర్టు విచారణ జరిపి సదరు జడ్జిని అరెస్టు చేయించి, జైలుకు పంపింది. 55 రోజుల జైలు జీవితం గడిపిన సదరు జడ్జి, ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించబడినాడు. ఇంకా విషాద విషయం ఏమంటే.. ఆ ఎన్డీపీఎస్ కేసులో అరెస్టు చేయబడిన బాధితుడు అసలు నేరమే చేయలేదు, ఆ బాధితుడి నుంచి స్వాధీనం చేసుకున్న పౌడర్ ఎన్డీపీఎస్ పదార్థమే కాదు. పాపం, ఆ బాధితుడు ఎం.టెక్. చదువుతున్న పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. చేయని తప్పునకు జైలుకు వెళ్తే, ఆయనకు బెయిల్ రావడాని కోసం అతని తల్లి తన బంగారం తాకట్టు పెట్టింది.
60 రోజుల జైలు జీవితాన్ని అనుభవించిన బాధితుడి తల్లి జడ్జికి రూ.7.5 లక్షల లంచం ఇచ్చి బెయిల్ మీద తన కొడుకును విడుదల చేయించుకున్నది. తప్పుడు కేసులో అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు, ఆ అవినీతి జడ్జి కారణంగా పేద బ్రాహ్మణ యువకుడి కుటుంబసభ్యులు ఎంతో మానసిక క్షోభను అనుభవించారు. అతను అన్యాయంగా గడిపిన జైలు జీవితాన్ని ఎలా పరిహరించగలరు? అందుకే, ఆ బాధ్యులైన ఎక్సైజ్ పోలీసులపై ‘మాలీషియస్ ప్రాసిక్యూషన్’ కేసు వేయాలని నేను వారికి సలహా ఇచ్చాను. కానీ, వారు భయపడి ఒప్పుకోలేదు. ఆ జడ్జిని, అందులో పాల్గొన్నవారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టింది నాటి అవినీతి నిరోధక బ్యూరోలో పనిచేసిన పోలీసు అధికారి ఎమ్.రమణ కుమార్.
చివరగా, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి మన వంతు బాధ్యతను మనం నిర్వహిద్దాం. ఎందుకంటే, న్యాయవ్యవస్థలో అవినీతి కొనసాగితే, సమాజంలో అరాచకం వస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, All India Judicial Service -AIJS స్థాపన ఒక సముచిత మార్గంగా పరిగణించబడుతున్నది. AIJS ద్వారా జిల్లా న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకతను పెంచి, న్యాయవ్యవస్థలో నైపుణ్యంతో కూడిన వ్యక్తులను ప్రవేశపెట్టవచ్చు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడంలోనూ ఇది సహాయపడుతుంది. అయితే, AIJS స్థాపనపై విభిన్న అభిప్రాయాలున్నాయి. కొన్ని రాష్ర్టాలు, ఉన్నత న్యాయస్థానాలు తమ స్వయం నియంత్రణ హక్కులను పరిరక్షించుకోవడానికి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీనితో, AIJS స్థాపనపై ఇప్పటికీ స్పష్టమైన ఏకాభిప్రాయం లేదు.
న్యాయవ్యవస్థలో ఉన్న అవినీతిని తగ్గించడానికి, న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత, సమర్థత, సమానత్వం అవసరం. AIJS వంటి సంస్కరణలు ఈ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతాయి. అదనంగా, న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ విధానాలను పునఃపరిశీలించి, అవినీతి ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చు. మొత్తంగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి మనమందరం బాధ్యత వహించాలి. అవినీతి, పక్షపాతం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సంస్కరణలను ప్రోత్సహించి, న్యాయవ్యవస్థలో న్యాయం, సమానత్వాన్ని స్థాపించడానికి కృషిచేయాలి. ప్రస్తుత కాల పరిస్థితుల్లో నిజాయితీగా పనిచేయడం అంత సులువు కాదు. వారిని అత్యంత ఆత్మీయతతో గౌరవిద్దాం. భారత న్యాయవ్యవస్థ వర్ధిల్లాలి.
– తన్నీరు శ్రీరంగారావు, న్యాయవాది