నిస్వార్థ ప్రకృతి ప్రేమికుడు అస్తమించారు. పర్యావరణవేత్తగా, సామాజిక కార్యకర్తగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి శాశ్వతంగా ప్రకృతి ఒడిలోకి జారుకున్నారు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ అలుపెరుగని ప్రకృతి సేవ చేసిన వనజీవి రామయ్య ఇకలేరు.
వనజీవి రామయ్య ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందినవారు. మొక్కలు నాటడమే తన జీవితాశయంగా పెట్టుకున్న దరిపల్లి రామయ్య పేరు వనజీవి రామయ్యగా స్థిరపడింది. ప్రకృతి ప్రేమికుడైన రామయ్యకు ఆయన సతీమణి జానమ్మ తోడయ్యారు. ఆ దంపతులు కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలు కనిపిస్తే చాలు వనజీవి మొక్కలు నాటేసేవారు. 2022లో వనజీవికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన గాయపడ్డారు. అయితే, ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు వనజీవి ప్రత్యేక శిక్ష విధించారు. పోలీస్ కేసు పెట్టకుండా, బదులుగా అతడితో 100 మొక్కలు నాటించి, వాటిని సంరక్షించాలని ఆదేశించారు. ప్రమాదం చేసిన వ్యక్తిని క్షమించడంతో పాటు మొక్కలపై తనకున్న ప్రేమను ఈ విధంగా రామయ్య చాటుకున్నారు. మొక్కలపై వనజీవికి ఎంత ప్రేమ ఉందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం.
సమాజ హితం కోసం, భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న సత్సంకల్పం ఉన్న గొప్పవ్యక్తి రామయ్య. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు ఆయన మొక్కలు నాటుతూనే ఉన్నారు. జీవిత చరమాంకంలో ఆరోగ్యం సహకరించకున్నా వెనకడుగు వేయలేదు. ఎండాకాలంలో అడవుల్లో తిరుగుతూ వివిధ విత్తనాలను సేకరించేవారు. వాటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి, పెంచమని సూచించేవారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల వనజీవికి ఉన్న నిబద్ధతకు గుర్తింపుగా ఆయన జీవిత కథను పర్యావరణ పరిరక్షణ సందేశంగా పాఠ్యాంశాల్లోనూ చేర్చారు. మహారాష్ట్రలో వనజీవి జీవితాన్ని 9వ తరగతి తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణలో 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చారు. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. రామయ్య సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఆయన అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ప్రస్తుతం నగరాల్లో అభివృద్ధి పేరిట నగరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయి. అభివృద్ధి పేరిట పచ్చని చెట్లను నరికేసి పెద్దపెద్ద భవంతులు నిర్మిస్తున్నారు. ప్రకృతి పరిరక్షణకు సర్వస్వం ధారపోసిన వనజీవి అస్తమించడం పర్యావరణానికి తీరని లోటు.
– జాజుల దినేష్ 96662 38266