కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులు ఎందరో ఉన్నారు. తమ తమ రంగాల్లో రాణిస్తూ పేరు ప్రఖ్యాతులు సాధించినవారెందరో. సాహితీవేత్త గుండి గోపాలరావు, వెలిచాల కొండల్రావు, వెలిచాల జగపతిరావు, చెన్నమనేని సోదరులు అలాంటి కోవకు చెందినవారే. వారి వరుసలోనే వృత్తి ధర్మానికి మానవీయతను జోడించి పేదల ‘వకీల్‌సాబ్’గా ప్రశంసలందుకున్నారు జగిత్యాలకు చెందిన ప్రముఖ న్యాయవాది ఎం.హనుమంతరావు.
M. Hanumantha Rao | అరవై ఏండ్లకు పైగా న్యాయవాదిగా సేవలందించిన వకీల్ సాబ్.. ఎనిమిది పదుల వయసులోనూ న్యాయాన్ని గెలిపించేందుకు పోరాడటం విశేషం. ఎందరో జూనియర్లను ఉత్తమ న్యాయవాదులుగా తీర్చిదిద్దిన హనుమంతరావు మార్చి 29న తుదిశ్వాస విడిచారు.
జగిత్యాలకు సమీపంలోని అంతర్గాంలో జన్మించిన హనుమంతరావు నాగ్‌పూర్‌లో న్యాయ విద్యను అభ్యసించారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత 1960లో ప్రాక్టీసు ప్రారంభించిన ఆయన మొదట్లో రెండేండ్ల పాటు హైకోర్టులో కేసులు వాదించారు. ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు జగిత్యాలకు మకాం మార్చిన ఆయన అన్యాయానికి గురవుతున్న బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచారు. జగిత్యాల, కరీంనగర్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తూ అణగారిన వర్గాల గొంతుకగా మారారు.
జగిత్యాలలో బార్ అసోసియేషన్‌ను ప్రారంభించి, చాలాకాలం పాటు దానికి అధ్యక్షుడిగా కొనసాగారు. జగిత్యాలలో ఒకటే కోర్టు ఉండటంతో కేసుల సంఖ్య పెరిగి, తీర్పులు ఆలస్యంగా వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆలస్యంగా వచ్చే న్యాయం అన్యాయంతో సమానమని భావించిన హనుమంతరావు జగిత్యాలలో మరో కోర్టు అవసరం ఉందని ప్రభుత్వానికి విన్నవించారు. పట్టుబట్టి మరీ న్యాయశాఖను ఒప్పించారు. అలా జగిత్యాలలో అదనంగా సీనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేయడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. కొత్త కోర్టు రాకతో కేసుల విచారణ వేగవంతమై పేదలకు సత్వరమే న్యాయం అందింది.
జగిత్యాలలో రెండు పర్యాయాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తించిన హనుమంతరావు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారు భూ తగాదాలతో సతమతమవుతున్నట్టు గమనించారు. తగాదాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన సొంత ప్రాక్టీసు మొదలుపెట్టారు. సివిల్ కేసులు స్వీకరిస్తూ ఎందరికో న్యాయాన్ని అందించారు. మొదట కేసు పూర్వాపరాలను తెలుసుకొని.. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడటం ఆయన ప్రత్యేకత. డబ్బుల కోసం తప్పుడు కేసులను వాదించడం ఆయన నైజం కాదు. అందుకే తప్పులు చేసినవారు, పేదలను ముంచినవారు ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లేవారు కాదు. ఈ క్రమంలో ఫీజులు తీసుకోకుండానే ఆయన వాదించిన కేసులెన్నో ఉన్నాయి.
1962లో జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న మాకునూరు ధర్మారావు వకీలు హనుమంతరావుకు సమీప బంధువు. వకీలు తలుచుకుంటే రాజకీయాల్లోకి వెళ్లడం పెద్ద విషయం కాదు. కానీ, మొదటి నుంచి హనుమంతరావుకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. అందుకే ఆయన అటువైపు వెళ్లలేదు. సొంతూరికి ఎంతో సేవ చేసిన ఆయన గ్రామ రాజకీయాల్లోనూ తలదూర్చలేదు. హనుమంతరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈయన కుమారుడే. సంజయ్ రాజకీయ ప్రవేశానికి కూడా హనుమంతరావు మొదట విముఖత చూపారు. అయితే కంటి వైద్యుడైన సంజయ్ కుమార్ సామాజికసేవా కార్యక్రమాలు చేశారు. వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రజలకు సేవ చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న సంజయ్‌కుమార్ తండ్రి ఆమోదం కోసం తీవ్రంగా ప్రయత్నించి, చివరికి సఫలమయ్యారు.
విలక్షణమైన వ్యక్తిత్వం, నిజాయితీ, నిబద్ధత కలిగిన హనుమంతరావు ఎన్నడూ ప్రచారాన్ని కోరుకోలేదు. నిజానికి ఎమ్మెల్యే సంజయ్‌కు పితృవియోగం అనే కన్నా.. పేదల న్యాయవాది హనుమంతరావు అస్తమయం అని అనడం సబబేమో. ఎంతో మందికి న్యాయ సేవలందించిన ఆయన పేదల వకీల్ సాబ్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతారు.
– బి.నర్సన్ 94401 28169