రాత్రికి రాత్రి మనుషులు మాయం కావడం ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో సర్వ సాధారణ విషయం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పోలీసులు రాత్రికి రాత్రే మనుషులను ఎత్తుకెళ్లేవాళ్లు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చట్టబద్ధమైన పోలీసులు చట్ట వ్యతిరేకంగా ఎత్తుకెళ్తే విచిత్రంగా అనిపించేది. ఒక్క తెలంగాణ అనే కాదు అన్ని రాష్ర్టాల్లో పోలీసులు ఇప్పుడు ఇలా మనుషులను ఎత్తుకెళ్లడం మాములు విషయంగా మారింది. వెనిజులా అధ్యక్షుడు, వారి భార్యను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు వారి సైన్యం ఇలా ఎత్తుకెళ్లడం ఈ కాలం నాటి వింతే.
సార్వభౌమత్వం కలిగిన ఒక దేశాధ్యక్షుడిని మరో దేశాధ్యక్షుడు ఇలా ఎత్తుకెళ్లడం నాగరిక ప్రపంచంలో అరుదు. ‘కర్ర ఉన్నవాడిదే బర్రె’ అని అమెరికా పాలకులు నిరూపిస్తున్నారు. నోబెల్ శాంతి కోసం తనకన్నా మించిన వారు లేరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు. నోబెల్‌కు అర్హత ఉందని చెప్పుకొన్న పాలకుడు అచ్చం బందిపోటు దాడిలా ఒక దేశంపై బలగాలతో విరుచుకుపడి ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిని, అతని భార్యను అమానుషంగా తమ దేశానికి ఎత్తుకువెళ్లాడు. వెనిజులా అధ్యక్షుడు భారీ ఎత్తున ప్రమాదకర మాదక ద్రవ్యాలను అమెరికాకు చేరవేస్తున్నారనేది అమెరికా ఆరోపణ. ఈ ఆరోపణల్లో నిజానిజాలు అమెరికాకే తెలియాలి. ఒకవేళ నిజమనుకున్నా తమ దేశంలోకి మాదక ద్రవ్యాలు రాకుండా అమెరికా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవచ్చు. దేశంలోకి మాదక ద్రవ్యాలు తీసుకువస్తున్న వారిని కఠినంగా శిక్షించి అడ్డుకట్ట వేయవ చ్చు. అంతేకానీ, ఒక దేశాధ్యక్షుడిని ఏ విధంగా కిడ్నప్ చేస్తా రు. మాది శక్తివంతమైన దేశం కాబట్టి ప్రపంచం లో ఎక్కడైనా ఏమైనా చేస్తామని బెదిరించడమే. ఒకరకంగా ఇది ఇస్లామిక్ టెర్రరిజం లాంటిదే. తమకు నచ్చకపోతే ప్రపంచంలో ఎక్కడైనా విధ్వంసం సృష్టిస్తామనే టెర్రరిస్టుల ప్రకటనకు, అమెరికా వ్యవహార తేడా లేదు.
ప్రపంచంలో అత్యధికంగా క్రూడాయిల్ నిల్వలు ఉన్న దేశం వెనిజులా. సాధారణంగా క్రూడాయిల్ ఉన్న దేశాలు అంటే సౌదీ అరేబియా పేరు మొదట గుర్తుకువస్తుంది. కానీ, సౌదీ అరేబియా కన్నా వెనిజులా దేశంలోనే క్రూడాయిల్ నిల్వలు ఎక్కువ. వెనిజులాలో 3003 బిలియన్ బారెల్స్ క్రూడాయిల్ నిల్వలున్నాయి. ఇది ప్రపంచం మొత్తం క్రూడాయిల్ నిల్వల్లో 17 శాతంపైనే. సౌదీ అరేబియాలో 267 బిలియన్ బారెల్స్, ఇరాన్లో 267 బిలియన్ బారెల్స్, కెనడాలో 163, ఇరాక్‌లో 145 బిలియన్ బారెల్స్ క్రూడాయిల్ నిల్వలున్నాయి. వెనిజులాపై అమెరికా కన్ను పడటానికి ఆ దేశంలోని క్రూడాయిల్ నిల్వలే ప్రధాన కారణం.
ఇరాక్ జీవాయుధాలు కలిగి ఉన్నదని, వీటివల్ల ప్రపంచానికి ముప్పు అని అమెరికా ప్రకటించి ఇరాక్‌పై దాడిచేసి నేలమాళిగలో దాగిన సద్దాం హుస్సేన్‌ను అమెరికా సైన్యం పట్టుకొని హత్య చేసింది. ఆ తర్వాత ఇరాక్‌లో జీవాయుధాలు దొరికాయా? అంటే ఏమీ దొరకలేదు. ఒకవేళ నిజంగానే అమెరికాను భయపెట్టే స్థాయిలో సద్దాం హుస్సేన్ తమ దేశంలో జీవాయుధాలు పెట్టుకొని ఉంటే అమెరికా తమ దేశంపై దాడి చేసినప్పుడు నేలమాళిగలో ఎం దుకు దాగుంటాడు. అమెరికాపై ఆ జీవాయుధాలు ప్రయోగించేవాడు కదా? ఆయిల్‌పై పెత్తనం కోసం ఇరాక్‌పై దాడి చేసేందుకు జీవాయుధాలు అనేది ఒక సాకు మాత్రమే. ఇప్పు డు వెనిజులాపైనా కుంటిసాకులే చెప్తున్నారు.
ప్రపంచంలో మరో దేశం ఇలా చేయలేదు, మేం కాబట్టి చేశాం అని ట్రంప్ తన చర్యను సమర్థించుకుంటున్నారు. ప్రస్తుతానికి వెనిజులాను అమెరికానే పాలిస్తుందని, ఆ దేశంలోని చమురు వ్యాపారాన్ని అమెరికా కంపెనీలు నిర్వహిస్తాయని ట్రంప్ ప్రకటించారు. క్రూడాయిల్ కోసమే ఈ దాడులని ట్రంప్ చెప్పకనే చెప్పారు. క్రూడాయిల్ నిల్వలు భారీగా ఉన్న అన్ని దేశాలపై అమెరికా ఏదో రకంగా పెత్తనం చెలాయిస్తున్నది. తమ మాట వినకపోతే ఆ దేశ పాలకులను కిడ్నాప్ చేస్తారు, ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేయడానికి అమెరికా ఏ మాత్రం వెనుకాడదు. అలా అని క్రూడాయిల్ ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ గొప్ప ప్రజాస్వామిక దేశాలు, అమెరికా మాత్రమే రౌడీ పాలకుల దేశమని చెప్పలేం. అశ్వ బలమే ప్రధాన బలంగా ఉన్న కాలంలో ఇండియాతో సహా అనేక దేశాలపై ముస్లిం పాలకులు దాడులు చేసి, సంపద దోచుకోవడంతో పాటు అధికార బలంతో బలవంతంగా మత మార్పిడి చేశారు. చివరికి టెర్రరిజం ద్వారా ప్రపంచంపై పెత్తనానికి ఇస్లామిక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఇండియానే. అప్పటివరకు టెర్రరిజంను ఇండియా సమస్యగా చూశారు. ట్విన్ టవర్స్‌పై విమాన దాడి తర్వాత టెర్రరిజాన్ని ప్రపంచ సమస్యగా చూస్తున్నారు. అశ్వాల స్థానంలో ఆయుధాలు వచ్చినప్పుడు ఆయుధ సంపద ఉన్న దేశాలది పైచేయి అయింది. తన ఆయుధ సంపద ద్వారా అమెరికా ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నది.
అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలు టెర్రరిస్టులు పట్టించుకోరు, అమెరికా పట్టించుకోదు. వెనిజులాపై అమెరికా దాడిచేసి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడంపై రష్యా, చైనా వంటి దేశాలు ఖండించాయి. ఇండియా మౌనంగానే ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు తమ ప్రయోజనం తాము చేసుకుంటున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ మహా నగరాన్ని నలుగురైదుగురు పేరు మోసిన రౌడీలు అనధికారికంగా పాలించేవారు. సాధారణ పౌరులకు తమ కుటుంబ సమస్యలు తమకుంటాయి. మనకెందుకులే అని మౌనంగా ఉంటారు. ఈ మౌనం వల్లనే రౌడీల హవా సాగేది. బస్తీల్లో రౌడీలకు భయపడినట్టుగా ఇప్పడు అమెరికా దాదాగిరి విషయంలో మనకెందుకు అని అన్ని దేశాలు తమ ప్రయోజనాలు తాము చూసుకుంటున్నాయి. నూతన సంవత్సరంలో పరిణామాలు చూస్తుంటే మరింత ప్రమాదం వైపు ప్రపంచం పయనిస్తున్నదనిపిస్తున్నది. అన్నీ మంచి శకునములు అనిపించడంతో కొత్త సంవత్సరం మొదటి రోజు అన్ని దేశాల స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లు దూసుకువెళ్లాయి. మన నిఫ్టీ ఏకంగా కొత్త రికార్డు సృష్టించింది. వెనిజులా ఉదంతంతో పరిణామాలు తారుమారు అయాయి.