విద్యుత్ ఒప్పందాల్లో అదానీ లంచాల వ్యవహారంపై అమెరికాలో కేసు నమోదైంది. దీంతో మన దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో అదానీ ప్రభావం కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఏదో అయిపోతుందని కాదు కానీ, తమ దేశ చట్టాల ప్రకారం కేసును అమెరికా ముందుకు తీసుకువెళ్తే మాత్రం పెను ప్రకంపనలు తప్పవు. ఇతర ప్రయోజనాలు ఆశించి మన దేశంలో లాగానే వ్యవహరిస్తే మాత్రం అదానీ వివాదం టీ కప్పులో తుఫాన్ వలె ముగిసిపోతుంది.
విద్యుత్ ఒప్పందాల్లో రూ.2 వేల కోట్ల వరకు లంచాల ఆరోపణలపై గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సిరిల్ కబా నెస్, సౌరవ్ అగర్వా ల్, దీపక్ మల్హోత్రా, రూపేష్ అగర్వాల్ సహా ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. అమెరికా న్యాయవిభాగం అధికారిక వెబ్సైట్లో ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ఒప్పందాల్లో లంచాల వ్యవహారంపై కేసు అమెరికాలో నమోదు కాగా, ఆ కంపెనీ కార్యకలాపాలు భారత్‌లో నిర్వహిస్తున్నది. విద్యుత్ ఉత్పత్తి చేసేదీ, వినియోగించేదీ ఇక్కడే. ఒప్పందాలు చేసుకున్నదీ ఇక్కడి రాష్ర్టాలతోనే. అయితే అమెరికాలో కేసులేమిటి? అమెరికాకు ఏం సంబంధం? అనే సందేహాలు కలుగవచ్చు. గ్రీన్ ఎనర్జీ కోసం అదానీ కంపెనీ అమెరికన్ల నుంచి కూడా నిధులు సేకరించింది.
అందుకోసం అదానీ కంపెనీ గురించి ఆ దేశంలో ఇన్వెస్టర్లకు సమాచారం ఇచ్చారు. తమ కంపెనీ లంచాలకు వ్యతిరేకమని, విలువలు పాటించామని తప్పుడు సమాచారం ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. లంచాల వ్యవహారం మన దేశంలోనే జరిగినా.. అది అమెరికా నిబంధనలకు విరుద్ధం. కాబట్టి, అమెరికా చట్టాల ప్రకారం కేసులు అక్క డ నమోదయ్యాయి. అదే భారత్‌లో అయితే గతంలో వచ్చిన ఆరోపణలు టీ కప్పులో తుఫాన్‌లా ముగిసినట్టే ఇప్పుడూ అలాగే ముగిసేవి. కానీ, ఇప్పుడు కేసులు నమోదైంది అమెరికాలో కాబట్టి అంత సులువుగా సమసిపోతాయనే అంచనాకు రాలేం. రెండు దేశాల మధ్య సంబంధాలు, ఇతర అనేక అంశాలు ఈ కేసుపై ప్రభా వం చూపుతాయి. బైడెన్ శకం మరో రెండు నెలల్లో ముగిసిపోయి.. ట్రంప్ శకం ప్రారంభం కానున్నది. దీనిపై బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. రెండు నెలల్లోనే నిర్ణయాలు వెలువడతాయా? లేక ట్రంప్ పగ్గాలు చేపట్టేదాకా కేసు కొనసాగుతుందా అనేది కూడా మనం చెప్పలేం.
‘ఓటుకు నోటు కేసులో ఏకంగా ఎమ్మెల్సీనే కొనేందుకు రూ.50 లక్షల నగదుతో పట్టుబడ్డ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మరీ ముఖ్యమంత్రిని చేశారు. రూ.2 వేల కోట్ల లంచం ఆరోపణలు వచ్చిన అదానీ ఒకవేళ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే అతడిని ప్రధానమంత్రిని చేసేవారా?’ అని నెటిజన్లు రాహుల్‌గాంధీని ఒక ఆట ఆడుకుంటున్నారు.
ఒకవైపు న్యాయస్థానాల్లో కేసు నడుస్తుండగా నే దేశంలో జోరుగా రాజకీయాలు సాగుతున్నాయి. రాజకీయ పక్షాలు ప్రతి అంశం నుంచి ప్రయోజనాలను ఆశిస్తాయి. అమెరికా కోర్టు అదానీ అరెస్టుపై ప్రకటన చేయగానే ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించా రు. ఒక ముఖ్యమంత్రిపై రూ.10-15 కోట్ల ఆరోపణలు రాగానే అతన్ని అరెస్టు చేశారని, మరి రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చినా అదానీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయ న ప్రశ్నించారు. నిజమే ఎలాంటి ఆధారాలు లేకపోయినా లిక్కర్ స్కామ్ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. అదే విధంగా ఝార్ఖండ్ సీఎంనూ అరెస్ట్ చేశారు. మరి అమెరికా వంటి అగ్రరాజ్యం కోర్టు చెప్పినా అదానీని ఎందుకు అరెస్టు చేయడం లేదు. రాహుల్‌గాంధీ అడిగిన ప్రశ్నలో న్యాయం ఉన్న ది. అయితే ఆయన వేసిన ప్రశ్నకు కౌంటర్‌గా సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సంధించిన ప్రశ్నలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.
‘అదా నీ విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇవ్వజూపారనేది ఆరోపణలు మాత్రమే. నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఆరోపణలకే అదానీని అరెస్టు చేయాలని రాహుల్ పట్టుబడుతున్నారు. మరి ఏకంగా ఓటుకు నోటు కేసులో శాసనమండలి సభ్యుడిని కొనేందుకు రూ.50 లక్షల నగదుతో దొరికిన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ముఖ్యమంత్రిని చేశారు. మరి రూ.2 వేల కోట్ల లంచం ఆరోపణలు వచ్చిన అదానీ ఒకవేళ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే అతన్ని ప్రధానమంత్రిని చేసేవారా?’ అని నెటిజన్లు రాహుల్‌గాంధీ ని ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు అదానీ వ్యవహారంలో మోదీని తప్పుబడితే.. బీజేపీ నాయకులు రేవంత్‌రెడ్డిని ఆడుకుంటున్నారు. అదానీ వ్యవహారంలో మోదీని తప్పుపట్టేవారు.. రూ.వంద కోట్ల విరాళం అదానీ నుంచి తీసుకున్న వ్యవహారంలో, అదానీతో చేసుకున్న ఒప్పందాల వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఎందుకు తప్పుబట్టడం లేదని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
అదానీ కేసు ఎలా ముగుస్తుందనేది అమెరికా కోర్టు నిర్ణయిస్తుంది. ఈ లోపు రాజకీయ పక్షాల న్నీ తమ పార్టీల కోణంలో రాజకీయం చేస్తున్నా యి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ.. అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. గతంలో రాహుల్ కూడా అదానీపై ఆరోపణలు చేశారు, ఎన్నికల సమయంలో ట్రక్కుల్లో అదానీ నుంచి నోట్ల కట్టలు రాగానే మౌనం వహించార ని మోదీ ఆరోపించారు. ఈ ఆరోపణల ప్రకారం కాంగ్రెస్‌కు నోట్ల కట్టలు పంపించిన అదానీకి ఇప్పుడు బీజేపీ ఏకంగా అధికార ప్రతినిధిగా అం డగా నిలవాల్సిన అవసరమేమిటి? ట్రక్కుల్లో నోట్ల కట్టలు పంపించే అదానీపై ప్రభుత్వం ఎం దుకు చర్య తీసుకోవడం లేదు? అంటే ప్రధాని స్థాయి వాళ్లు కూడా ఎన్నికల్లో నోటికి వచ్చింది మాట్లాడుతారన్న మాట. వారు కూడా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తారన్న మాట.
ఈ లంచాల వ్యవహారంతో ఏపీకి కూడా సం బంధాలు ఉండటంతో టీడీపీ అనుకూల మీడి యా అదానీ కన్నా జగన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది. జగన్ హయాంలో జరిగిన ఒప్పందా ల్లో అదానీ లంచాలు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తు న్నది. అదే నిజమైతే ఆ ఒప్పందాలను ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా? రాజకీయ విమర్శలే తప్ప ఒప్పందాల రద్దు వంటి చర్యలు ఉండవనిపిస్తున్నది. ఓ సినిమాలో చిరంజీవి ఫ్యాన్‌గా రవితేజ నటిస్తాడు. తన మీద చేయి వేయడం అంటే ఆల్మోస్ట్ చిరంజీవి మీద చెయ్యి వేసినట్టేనని రవితేజ అంటాడు. అదానీ ఒప్పందా లు రద్దు చేసుకోవడం అంటే ఆల్మోస్ట్ మోదీతో బాబు ఒప్పందాలు రద్దు చేసుకోవడమే. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకొని మోదీకి దూరమయ్యే అవకాశమే లేదు. టీడీపీ, దాని అనుకూల మీడియా అదానీ, మోదీలను మినహాయించి జగన్‌పై విమర్శలకే పరిమితమవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే.. అదానీ బృందంపై అమెరికా లో కేసు వార్త బయటకు రాగానే దేశీయ స్టాక్ మార్కెట్ విలవిలలాడిపోయింది. అదానీ గ్రూప్ కు చెందిన అన్ని స్టాక్స్ 10-20 శాతం వరకు పడిపోయాయి. ఈ ప్రభావం మొత్తం మార్కెట్‌పై చూపింది. మరుసటి రోజు మార్కెట్ కోలుకున్నా అదానీ గ్రీన్ ఎనర్జీపై మాత్రం నీలినీడలు అలానే కమ్ముకున్నాయి. మోదీ ఉన్నంతవరకు అదానీకి ఏమీ కాదనే మాటలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా అదానీ లంచం ఇచ్చా రా? లేదా? అనేది అమెరికా కోర్టు తేలుస్తుంది. అయితే, మన దేశంలో ఒక పాన్‌షాప్ పెట్టాల న్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఎవరో ఒకరికి లం చం ఇవ్వక తప్పదు. ఇవ్వకపోతే పని ముందుకు సాగదు. ఈ విషయం మనందరికీ అనుభవమే. లంచం ఇచ్చారా? లేదా? అనేది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
– బుద్దా మురళి