వెనుకబడిన వర్గాలకు ఆదినుంచి అన్నింటా అన్యాయం జరిగిందనేది వాస్తవం. అస లు వెనుకబడిన అనే సంబోధనే అన్యాయం. బహుజనులైనప్పటికీ ప్రాతినిధ్యంలో బీసీలు అల్పసంఖ్యాకులుగా మిగిలిపోవడం ప్రజాస్వామ్యంలో విలోమ దృశ్యం. ఇప్పటివరకు బీసీలను ఓటుబ్యాంకుగా జాతీయపార్టీలు వా డుకొని వదిలేశాయి తప్ప నిజంగా న్యాయం చేయడానికి ప్రయత్నాలు చేయలేదన్నది నిజం. దామాషా ప్రాతినిధ్యం కోసం బీసీలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నా ఆ దిశగా సరైన అడుగులు పడటం లేదు. ఈ నేపథ్యం లో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీల కు 42 శాతం వాటా కల్పించే రెండు బిల్లులకు రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదం తెలపడం ముదావహం. అందులో మొదటిది విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్‌ను పెంచేందుకు, రెండోది పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్‌కు సంబంధించి కావడం గమనార్హం. ఈ బిల్లులకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. మిగతా పార్టీలూ అదే వైఖరిని అనుసరించడంతో బిల్లుల ఏకగ్రీవ ఆమోదానికి మార్గం ఏర్పడింది.
బీఆర్ఎస్ మొదటినుంచీ బీసీల పక్షాన నిలిచింది. స్వరాష్ట్ర సాధన తర్వాత విశేషించి బీసీల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు చేపట్టింది. కులసంఘాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టించడం మొదలు పశువుల కాపరుల కోసం ఉచిత గొర్రెల పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాలను అమలుచేసింది. సంక్షేమ పథకాల్లోనూ బీసీలదే ప్రధానమైన వాటా కావడంతో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టింది. చిన్నచిన్న కమతాల రూపంలో బీసీల దగ్గరే ఎక్కువ భూమి ఉన్నందున సాగు అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టితో రైతుబంధు, రైతుబీమా వంటి అద్వితీయమైన చొరవలను తీసుకున్న ది. ఇప్పుడు బీసీల వాటా పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బిల్లులను రాజకీయ విభేదాలకు అతీతంగా సమర్థించి తన బీసీ పక్షపాతాన్ని, హుందాతనాన్ని మరోసారి బలంగా నిరూపించుకున్నది.
ఇల్లలకగానే పండుగ కాదన్నట్టు బిల్లులు ఆమోదం పొందడమే అంతిమ విజయం కాదన్నది గుర్తుంచుకోవాలి. ఈ బిల్లుల అమలులో ఎన్నో సాంకేతిక సమస్యలున్నాయి. కోటా 50 నుంచి 70 శాతానికి పెరుగనుండటం సుప్రీంకోర్టు విధించిన పరిమితిని అధిగమిస్తుంది. దీనిపై కేంద్రాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. తమిళనాడు తరహాలో శాస్త్రీయ పద్ధతిలో పోతే అదనపు పరిమితికి రాజ్యాంగ ఆమోదం సంపాదించుకోవచ్చు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయమైన బీహార్ పద్ధతిలో పోతున్నది. ఇది న్యాయస్థానాల తిరస్కారానికి గురయ్యే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నది. సాధికారత కలిగిన బీసీ కమిషన్ల ద్వారా నివేదికలు తెప్పించుకొని, శాస్త్రీయమైన పద్ధతిలో సేకరించిన డాటా ఆధారం గా కేంద్రం వద్దకు వెళ్తే పకడ్బందీగా పనులవుతాయి. ఒకప్పుడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకు న్న చరిత్ర గల కాంగ్రెస్ చిత్తశుద్ధిపై అనుమానాలు కలుగడం సహజమే. బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించింది.
అదేవిధంగా వైన్‌షాపుల కేటాయింపుల్లో గౌడ సోదరులకు రిజర్వేషన్ అమలు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిలో అలాంటి అంకితభావమే కనిపించ డం లేదు. అందుకే బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలనీ, బీసీలకు సబ్‌ప్లాన్ అమలుచేయాలని, బీసీలకు బడ్జెట్లో 20 వేల కోట్లు కేటాయించాలని బీఆర్ఎస్ సవాల్ విసిరింది. వీటిని అమలుచేసి ప్రభు త్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుం దా? అనేది పెద్ద ప్రశ్న. ఆగమేఘాల మీద తూ తూమంత్రంగా సేకరించిన డాటాతో, నామమాత్రంగా బిల్లులను ఆమోదింపజేసి పంపి, ఆ తర్వాత ఎదురయ్యే అవాంతరాల పట్ల నిస్సహాయత ప్రకటించే వగలమారి ఎత్తుగడ ప్రభుత్వ వైఖరి వెనుక కనిపిస్తున్నదని చెప్పకతప్పదు. బిల్లులకు వత్తాసుగా పటిష్ఠమైన సమాచారాన్ని, వాదనలను సమర్పించడం అవసరం. విపక్షాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నప్పుడు ప్రభుత్వం ముందుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.