టీఆర్ఎస్ బలోపేతంపై ఇక దృష్టి కేంద్రీకరించగలమని పార్టీ అధ్యక్షుడైన సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల పలుమార్లు పేర్కొనటాన్ని బట్టి, రానున్నకాలంలో ఆ పని ఒక పద్ధతి ప్రకారం జరగనున్నదనే అభిప్రాయం కలుగుతున్నది. ఆ దిశలో ఇప్పటికే జిల్లా కమిటీలఏర్పాటును ఆరంభించి, కార్యకర్తల శిక్షణకు ఆలోచనలు జరుగుతున్న స్థితిలో రానున్న రోజుల్లో ఇందుకు స్పష్టత రావచ్చు. పార్టీ బలోపేతం అన్న మాటలో అనేక అంశాలు ఇమిడి ఉన్నందున ఇది జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయమవుతున్నది.
ఏపార్టీ అయినా సరే బలోపేతం అయేందుకు నాలుగు అంశాలు ఆధారభూతమవుతాయి. అవి ఒక సైద్ధాంతిక భూమిక, సరైన పార్టీ యంత్రాం గం, నిరంతర ఆచరణ, పటిష్ఠమైన నాయకత్వం. ఎన్నికలలో జయాపజయాలు పరిస్థితులపై ఆధారపడవచ్చుగాక. కానీ ఈ నాలుగు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఒక పద్ధతి ప్రకారం, పట్టుదలగా వ్యవహరించే పార్టీకి దీర్ఘకాలంలో చలనం అంటూ ఉండదు. పార్టీ బలోపేతం గురిం చి మాట్లాడుతూ టీఆర్ఎస్ అప్పుడప్పుడు డీఎంకే ప్రస్తావనను తీసుకువస్తున్నది.
టీఆర్ఎస్ను దృష్టిలోకి తీసుకుంటూ ఇప్పుడు ఈ నాలుగు అంశాలను విచారిద్దాం. మొదటిది- సైద్ధాంతిక భూమిక. తమిళపార్టీలకు గల భూమిక ఏమిటో అందరికీ స్థూలంగా తెలిసిందే. క్రీస్తుపూర్వపు సంగమకాలం నుంచి గల భాష, లిపి, సాహిత్యం, చరిత్రల ప్రాచీనత, ద్రవిడ జాతీయత అనే గుర్తింపు. ఇదంతా తదనంతర కాలానికి కొనసాగి తమిళులు తూర్పు ఆసియా ప్రాంతాలతో వర్తక వాణిజ్యాలు సాగించి తమ సంస్కృతిని వ్యాపింపజేసి అక్కడ పాలనలు కూడా చేయటం ఒక ఎత్తు కాగా, దేశ స్వాతంత్య్రం తర్వాత ఉత్తరాదితో, హిందీతో, ఆర్యులు అనబడేవారితో, బ్రాహ్మణ్యంతో, వారి దేవతలతో, వర్తమాన రాజకీయాధికారంతో తలపడటం మరొక ఎత్తు. ఫెడరల్ అధికారాల పరిరక్షణ ఇందులో ఒక భాగమైంది. ఇది యావత్తూ కలగలిపి తమిళ సంస్థలకు, పార్టీలకు సైద్ధాంతిక భూమికగా మారింది.
దీనికి, టీఆర్ఎస్ సైద్ధాంతిక భూమికకు పోలిక ఉండగల అవకాశం అతి తక్కువ. అదే సమయంలో తనదైన ఒక భూమిక అవసరం. అది మాత్రమే తన వేర్లను భూమిలోకి దించి, వ్యాపింపజేసి సుదీర్ఘకాలం పాటు నిలబెట్టి ఉంచగలదు. యథాతథంగా తెలంగాణ నేలకు తన చరిత్ర, సంస్కృతి, ప్రత్యేక పరిస్థితులు, స్వభావం, ప్రయోజనాలు, లక్ష్యాలు, దృక్పథం ఉన్నాయి. అకడమిక్‌గా చెప్పాలంటే ఇవన్నీ ఒక జాతి, లేదా ఉపజాతి ప్రత్యేక లక్షణాలు. తగువిధంగా, తగు నేర్పరితనంతో రూపు దిద్దగలిగితే సైద్ధాంతిక భూమిక అనేది వీటి నుంచే తయారవుతుంది. ఇందుకు తగినట్లు ప్రత్యే క రాష్ట్ర ఉద్యమ ఉధృతిలో ‘తెలంగాణ తల్లి’ భావన, ‘విగ్రహం’ ముందుకు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇటీవలి కాలంలో పార్టీ నాయకత్వం ప్రాంతీయ అస్తిత్వం, ప్రాంతీయ భావన, అందుకు ప్రాంతీయ పార్టీయే శ్రీరామరక్ష అయి ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడగలగటం గురించి మాట్లాడుతున్నది. అయితే ఈ మాట ఇంకా అప్పుడప్పుడు వినరావటం తప్ప ప్రకాశవంతం కావటం లేదు. ఇదంతా కూడా సైద్ధాంతిక భూమికలో భాగమే అయినందున, పార్టీని బలోపేతం చేయదలచుకున్న పక్షంలో ఇందులోని ఆయా అంశాలను స్పష్టంగా నిర్వచించుకోవటం, వాటిని ముందుకు తీసుకుపోవటం అవసరం. ఆ పని మొదట సూత్రీకరణల రూపంలో జరిగి, తర్వాత పార్టీ శ్రేణులలోకి సామాన్య ప్రజలలోకి వ్యాపించాలి. అప్పుడు వారంతా తమను తాము ఈ సైద్ధాంతిక భూమికతో మమేకం చేసుకుంటారు. అందుకు అంకితమవుతారు. అది పార్టీతో, నాయకత్వంతోచలనం లేని మమేకత అవుతుంది. ఎన్నికల
జయాపజయాలు, అధికారంతో నిమిత్తం లేని సైద్ధాంతిక మమేకత అవుతుంది.
మిగిలిన మూడింటిలో ‘పార్టీ యంత్రాంగం’, ‘నిరంతర ఆచరణ’ అనే వాటిలో మనకు స్థూల దృష్టికి తోచేవి గాక, అధ్యయనం, శిక్షణలు, ప్రజలతో ముఖాముఖిన ప్రత్యక్ష సంబంధాలు భాగమవుతాయి. పార్టీ సభ్యత్వమంటే లక్షల మంది సభ్యులు కావటం ఒక పార్శం మాత్రమే. వారి మమేకతను పెంచటం మరొక పార్శం. స్వయంగా అధ్యయనాలు, శిక్షణలు గలవారు మాత్రమే ఆ పని చేయగలరు. వారికి పార్టీ సైద్ధాంతిక భూమిక, పార్టీ లేదా ప్రభుత్వపు విధానాలు, పరిపాలన, దాని ఫలితాలు, బయట పరిస్థితులు, జరిగే వాటిలోని మంచిచెడులు, దాపరికం లేనివిధంగా ప్రజల అభిప్రాయాలు, వీటన్నింటిని పార్టీకి, ప్రభుత్వానికి చేరవేయగలగటం. తాము గ్రహించిన వాటిని ప్రజలకు ముఖాముఖిన వివరించగలగటం, మంచి చెడులలో వారికి బాసటగా నిలవటం వంటివి పార్టీ యంత్రాంగం, నిరంతర ఆచరణలు, శిక్షణలు, అధ్యయనాలలోకి వస్తాయి.
టీఆర్ఎస్ సర్వతోముఖంగా బలోపేతం అయేందుకు, నాలుగు కాలాలపాటు చలనం లేకుండా నిలిచేందుకు, ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ప్రయోజనాలను నిలబెట్టేందుకు ఇదంతా తప్పనిసరి. కేటీఆర్ సెప్టెంబర్ 18న మాట్లాడుతూ ‘ఈరోజు తమిళనాడులో స్థానిక పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకే మాత్రమే ఉన్నా యి. అక్కడ జాతీయ పార్టీలకు ఎంట్రీ లేదు. అట్లనే తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శీరామరక్ష. అది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ రూపంలో ఉన్నది. టీఆర్ఎస్ రాజకీయ పార్టీ మాత్రమే కాదు. తెలంగాణ జీవనరేఖ’ అని చెప్పారు. ఈ సైద్ధాంతిక భూమికను సాకారం చేయటం అవసరం.
ఇక నాయకత్వం విషయానికి వస్తే, యథాతథంగా టీఆర్ఎస్కు బలమైన నాయకత్వం ఉంది. అదే సమయంలో పై మూడు అంశాలు రూపుదిద్దుకొని జరిగే కొద్దీ నాయకత్వం కూడా అందుకు సమాంతరంగా మరింత బలపడి స్థిరపడుతుంది. ఎందుకంటే ఈ రెండు సమాంతర అంశాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది.
టంకశాల అశోక్