దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని అన్నారు విద్యావేత్త కొఠారి. ఆయన చెప్పినట్టు దేశ భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలి. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కూడా అందడం లేదు. ముఖ్యంగా విద్యార్థినులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుండటం శోచనీయం.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో టాయిలెట్స్ కొరత ప్రధానమైనది. ఇటీవల విడుదలైన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) 2024-2025 నివేదిక కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పింది. ఈ సమస్య విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, వారి విద్యాభ్యాసంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నది. యూడైస్ నివేదిక ప్రకారం.. తెలంగాణలో మొత్తం 29,421 కో-ఎడ్యుకేషన్ పాఠశాలలున్నాయి. ఇందులో దాదాపు 1,752 పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ లేకపోవడం మన విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతున్నది. 1,100 పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నప్పటికీ అవి నిరుపయోగంగా మారాయి. ఈ సమస్య బాలికలకే పరిమితం కాలేదు. బాలురు కూడా ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. సుమారు 4,069 పాఠశాలల్లో బాలురకు టాయిలెట్స్ లేవు. 1,400 పాఠశాలల్లో ఉన్నప్పటికీ నిరుపయోగమే. ప్రభుత్వ పాఠశాలల పట్ల సర్కారు నిర్లక్ష్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
టాయిలెట్స్ లేకపోవడంతో చాలా మంది విద్యార్థినులు నీళ్లు తాగేందుకు జంకుతున్నారు. ఆరుబయట టాయిలెట్స్‌కు వెళ్లాల్సి వస్తుందనే భయంతో విద్యార్థినులు నీళ్లు తాగడం మానేస్తున్నారు. దీని వల్ల విద్యార్థినులు డీహైడ్రేషన్, మూత్ర సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. ముఖ్యంగా బాలికలు యుక్త వయసులో ఉన్నప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. సరైన టాయిలెట్స్ లేని కారణంగా వారు పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. రుతుస్రావ సమయంలో వారి కష్టాలు వర్ణనాతీతం. చాలామంది పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. ఇది వారి విద్యాభ్యాసానికి పెద్ద అడ్డంకిగా మారుతున్నది.
బాలికల డ్రాపౌట్స్‌కు ఇది కూడా ఒక కారణం. విద్యార్థినులే కాదు, ఉపాధ్యాయినులూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు భద్రత, భోజనం, ఆరోగ్యం కల్పించాలి. కానీ, ఇవేవీ రాష్ట్రంలో అమలు కావడం లేదని యూడైస్ నివేదికను చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల పిల్లలే ఎక్కువగా చదువుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే ఈ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసినట్టే.
విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న ముఖ్యమంత్రే పాఠశాలల్లో నెలకొన్న సమస్యలకు బాధ్యత వహించాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తే విద్యారంగం సమస్యలు పరిష్కారమైనట్టేనని భావిస్తున్న ప్రభుత్వ ఆలోచన విధానం మారాలి.
విద్యారంగానికి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకపోవడమే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడానికి ప్రధాన కారణం. తాము అధికారంలోకి వస్తే విద్యారంగానికి బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చాక 7.57 శాతం నిధులే కేటాయించి పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది.
విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న ముఖ్యమంత్రే పాఠశాలల్లో నెలకొన్న సమస్యలకు బాధ్యత వహించాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తే విద్యారంగం సమస్యలు పరిష్కారమైనట్టేనని భావిస్తున్న ప్రభుత్వ ఆలోచన విధానం మారాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించినప్పుడే విద్యారంగం సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలు జరిపినట్టే.. పాఠశాలలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేసే విద్యార్థి సంఘాలతోనూ ప్రభుత్వాలు చర్చలు జరపాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు పాలకులకు తెలుస్తాయి. తద్వారా ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది.
పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల విద్యార్థినుల ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్నది. పాఠశాలల్లో సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. టాయిలెట్స్ సమస్యను పరిష్కరించకపోతే, అది విద్యావ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడమంటే భవిష్యత్తు తరాల ఆరోగ్యంతో చెలగాటమాడటమే కాదు, విద్యను నిర్లక్ష్యం చేయడమే. పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థి సంఘాలతోపాటు విద్యావేత్తలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
– (తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్)
పల్లె నాగరాజు 85004 31793