విద్యాబుద్దులతో,ఆటపాటలతో ఆనందంగా సాగే బాల్యదశ ప్రతి మనిషి జీవితంలో మరపురాని మధుర స్మృతిగా నిలుస్తుంది. ఈ కార్పొరేట్ విద్యా ప్రపంచంలో పిల్లలను యంత్రాలుగా మలిచే తల్లిదండ్రులు, తమ ప్రత్యేకత నిలుపుకోవడానికి పుస్తకాల బరువు పెంచే పాఠశాల యజమాన్యాలు ,ఆటపాటలకు ఆమడ దూరంగా విద్యాభ్యాసం చేస్తున్న బాలల పరిస్థితి దయనీయం. విపరీతమైన స్వేచ్ఛ వినాశనానికి దారి తీస్తుందనే ఉద్ధేశ్యంతో అమలు పరిచే క్రమశిక్షణ వారి పాలిట కారాగారవాసమవుతున్నది. నేటి బాలలే రేపటి పౌరులు. ఆ భావి భారతాన్ని అందంగా ఆవిష్కరించేది పుస్తక పఠనం. నేటి పిల్లలలో నైతికత, సామాజికత, మానవత, సహృదయత, ఆధ్యాత్మికత,క్రమశిక్షణ మొదలైన సుగుణాలు అలవడాలంటే ,వారి కల్మషం లేని మనసులను బాల సాహిత్య పఠనం వైపుకు మరల్చాలి.
పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంబాలు తాతలు, అమ్మమ్మ, నాయనమ్మల తో కూడుకొని ఉండేవి. ఆ తర్వాత కూడా పిల్లలు దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకు అమ్మమ్మ, నాయనమ్మల ఇంటికి వెళ్లేవారు. వెన్నెల రాత్రు ల్లో వారు పిల్లలకు ఎన్నో కథలు చెప్పేవారు. నక్షత్రాలను చూస్తూ పెద్దవారు చెప్పిన నీతి కథలు వినే పిల్లలు హద్దులు లేని ఆనందాన్ని అనుభవించేవారు. మారుతున్న సామాజిక మార్పుల వల్ల ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. చదువు, మార్కులు, ర్యాంకులు అనే మూస పద్దతిలో పిల్లల పవిత్ర మనసులను కలుషితం చేస్తూ, వారిని మరబొమ్మలుగా మారుస్తున్నారు.
పాఠ్యపుస్తకాలు పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తే, కథల పుస్తకాలు వారిలో ఉన్న సృజనాత్మక అం శాలను, జీవన నైపుణ్యాలను పెంపొందిస్తాయి. వారిలో ఆలోచనాశక్తిని రేకెత్తించి, రేపటి సమాజంలో ఉత్తమ వ్యక్తిత్వం గల మనుషులుగా తీర్చిదిద్దుతాయి. సాహిత్యం ద్వారానే బాలల్లో సంపూ ర్ణ వికాసం కలుగుతుంది.అందుకు అభివృద్ధి చెం దిన ఎందరో విద్యార్థుల జీవితాలే నిదర్శనం. బాలలలో అన్వేషణ, చర్చ, నైతిక విచక్షణ జ్ఞానం లాంటి అంశాలను పెంపొందించడానికి సాహి త్యం ఉపయోగపడుతుందనే భావనతో విద్యార్థుల దృష్టి బాల్యం నుంచే రచనా వ్యాసంగం వైపు ఆకర్షింపచేయడం అవసరం. ఇది విద్యలో రాణించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
విద్యార్థుల ఉత్తమ అభ్యసనములో, సత్ప్రవర్తన, నడవడి కలిగియుండడంలో బాల సాహి త్యం పోషిస్తున్న పాత్ర అసాధారణమైనది. విద్యార్థుల సమగ్ర వికాసానికి పాఠ్యాంశాల బోధనతో పాటు వారి లో ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీయడానికి బాల సాహిత్యాభిరుచిని పెం పొందించడానికి కృషి చేయవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు చెడు మార్గంలో పయనించకుండా బా ల్యం నుంచే సాహిత్యాభిలాష వారిలో కల్పిస్తే ,రేపటి తరానికి మంచి చేసినవారమవుతాము. అదే చిత్తశుద్ధితో రాష్ట్ర స్థాయిలో కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు నిస్వార్థంగా శ్రమిస్తున్నారు. పిల్లల సృజనాత్మక అంశాలకు సంబంధించి కథ లు, కవితలు, పద్యాలు, వ్యాసాలు లాంటి సాహి తీ ప్రక్రియల్లో రచనలు చేయిస్తూ పుస్తకాలు కూడా ముద్రిస్తున్నారు. జక్కపూర్ బడిపిల్లల కథ లు, గుర్రాల గొంది మువ్వలు, పూలగోపురం, తొలిజల్లు, గడ్డిపూలు, సికింద్లాపూర్ సిరిమువ్వ లు, కొత్తపేట కలాలు ఇలా పిల్లలు రాసిన అనేక పుస్తకాలు వచ్చాయి.
ప్రముఖ బాల సాహితీ వేత్త గరిపెళ్లి అశోక్ గడిచిన పదిహేనేండ్ల నుంచి సేకరించిన వివరాల ప్ర కారం ఇప్పటి వరకు బాల సాహిత్యంలో 389 పుస్తకాలు వెలువడగా, గత ఏడాది పిల్లలు రాసిన పుస్తకాలు 36, పిల్లల కోసం పెద్దలు రాసిన పుస్తకాలు 26 వరకు ఆవిష్కరించబడినవి.
పాఠశాల ఉపాధ్యాయులు, సాహితీ సంస్థలు, బాల సాహితీవేత్తలు చిన్నారులలో సాహిత్యాభిలాషను పెంపొందించి, వారి చేత రచనా వ్యాసం గం చేపడితే రానున్న రోజుల్లో మంచి సమాజం సృష్టించబడుతుంది. సాహితీ మార్గంలో పయనించే వారు సన్మార్గంలో వెళ్లగలరు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భావి జీవితాన్ని బంగారుమయం చేసుకుంటారనేది నిజం.
రేపటి తరానికి వారసులైన నేటి చిన్నారి బాలలకు చదువుతో పాటు ఆటలు, సాహిత్యం కూడా అంతే అవసరం. ఆటలు శారీరక వికాసాన్ని పెంపొందిస్తే, సాహి త్యం వారిలో నిక్షిప్తమై ఉన్న సృజనాత్మక శక్తిని రాబట్టేందుకు దోహదపడుతుంది. సాహిత్యాభిరుచి గల పిల్ల లు చదువులో కూడా ముందుంటా రు. రేపటి తరం కోసం అందమైన భవితవ్యాన్ని బహుమతిగా ఇవ్వడానికి బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది.
(నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం)
– దుర్గమ్ భైతి 9959007914