సురబాల ధరియించు నగలలో కూర్చబడు ఆ గొప్పదనమును ఆశించ నేగోర ప్రేయసిని మురిపించు ప్రేమికుని మాలలో చేర్చబడి ప్రేయసిని మురిపించనేగోర సామ్రాట్టు శవముపై హరినామ స్మరణతో వేయబడు పూలలో నేనుండగోర దేవతల శిరసుపై వుంచేటి పుష్పముల చేర్చబడు భాగ్యముతో గర్వించనేగోర ఓ మాలి! నను తెంపి విసురుమాబాటయే బాట నడిచెరో వీరులెంతోమంది మాతృదేశం కొరకు శిరసులర్పించ (ప్రముఖ హిందీ కవి మాఖన్‌లాల్ చతుర్వేది ‘పుష్ప్ కి అభిలాష’ కవితకు ఈ వ్యాసరచయిత చేసిన స్వేచ్ఛానువాదం ఇది)
మాతృభూమి పరిరక్షణలో తమ ప్రాణాలను బలిపెట్టేందుకు సిద్ధమై ముందుకు సాగుతున్న వీరుల త్యాగాల విలువలను, ఒక పుష్ప విన్నపం ద్వారా కండ్లకు కట్టినట్టుగా వర్ణించాడు కవి మాఖన్‌లాల్ చతుర్వేది. వివరంగా పరిశీలిస్తే.. తనను తెంపడానికి వచ్చిన తోటమాలితో ఒక పుష్పం తన బలీయమైన కోరికను ఈ విధంగా తెలియజేస్తుంది.
‘ఓ మాలీ! నన్ను తెంపుకో.. కానీ, తర్వాత నన్ను ఎక్కడ ఉంచాలన్న విషయంలో మాత్రం దయచేసి నా ఒక్క చిన్న విన్నపాన్ని ఆలకించు. దేవకన్యలు ధరించే ఆభరణాల్లో కూర్చబడాలని నేను కోరుకోను. తన ప్రేయసిని మురిపించేందుకు ఒక ప్రేమికుడు తెచ్చిన పూలమాలలో అల్లబడి ఆ ప్రేయసిని మురిపించాలని కూడా నేను కోరను. ఒక సామ్రాట్టు శవంపై హరినామ స్మరణతో చల్లబడు పూలలో ఒక పూవుని కావాలని నేను ఎన్నడూ కోరుకోలేదు. చివరికి దేవతల శిరస్సులపై ఉంచబడే పుష్పాల్లో ఒక పుష్పంగా మారి, ఆ భాగ్యంతో గర్వించాలన్న కోరిక కూడా నాకు లేదు. ఇక నాకున్న ఒకే ఒక కోరికతో నిన్ను వేడుకొనేదేమంటే.. మాతృభూమి కోసం తమ శిరస్సుల్ని అర్పించేందుకు ఏ బాటలో పెక్కు వీరులు నడుస్తారో ఆ బాటలో నన్ను విసిరేయి. ఆ త్యాగమూర్తుల పాద స్పర్శతో నా జన్మ సార్థకమవుతుంది. ఆ భాగ్యానికి మాత్రం నన్ను దూరం చేయకు.’
ఏ వీరుల పాదధూళితో తన జన్మ సార్థకమవుతుందని అ పుష్పం బలంగా విశ్వసించిందో ఆ వీరుల కోవకు చెందిన వీరుడే మన కెప్టెన్ వీర రాజారెడ్డి. తన పేరులో కూడా వీరత్వాన్ని కలిగి ఉన్న ఆ వీరుడు కేవలం 24 ఏండ్ల వయస్సులోనే తన మాతృ దేశరక్షణ కోసం ప్రాణాలను బలిపెట్టి అమర వీరుడయ్యాడు. ఆ వీరుడు 1977, సెప్టెంబర్ 22న రాపోలు కొండల్ రెడ్డి-పుష్పలత దంపతులకు నల్లగొండ జిల్లాలోని సైనాపూర్లో జన్మించాడు. వీరులకు, త్యాగధనులకు పుట్టినిల్లయిన నల్లగొండ జిల్లాలో పుట్టినందువల్లనేమో రాజారెడ్డి ముత్తాత కొండల్‌రెడ్డి కూడా అమరవీరుడిగా చరిత్రపుటల్లో నిలిచిపోయాడు. ఆనాటి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని కమ్యూనిస్టు నాయకుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలసి ప్రజలను చైతన్యపరిచినందుకు నిజాం ముష్కర మూకలు కొండల్‌రెడ్డిని, అతడి స్నేహితుడైన ముత్యంరెడ్డిని గడ్డివాములో వేసి తగలబెట్టి చంపేశారు.
ముత్తాత ధైర్య సాహసాలు, దేశభక్తి తనలో మూర్తీభవించినందువల్లనేమో మన వీర రాజారెడ్డి చిన్ననాటి నుంచే దేశం కోసం మిలిటరీలో చేరాలని కలలు కనేవాడు. వీర రాజారెడ్డి విద్యాభ్యాసం భాగ్యనగరంలోనే సాగింది. అరవింద స్కూల్లో కేజీ, తక్షశిల పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి, లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఇంటర్ చదివి ఇంటర్లో అత్యున్నత మార్కులతో పాసైన రాజారెడ్డి ఎన్డీఏ రాసి విజయం సాధించాడు. ఎన్డీఏ పరీక్ష ఫలితాలు వచ్చిన రోజున రాజారెడ్డి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. దేశరక్షణ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టబోతున్నానని అందరితో గర్వంగా చెప్పుకొనేవాడు. తండ్రి కొండల్‌రెడ్డి కూడా కొడుకును ప్రోత్సహించాడు. నా కొడుకును దేశానికి అప్పగించానని ఆ తండ్రి అందరితో గర్వంగా చెప్పుకొనేవాడు.
1997లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తిచేసిన రాజారెడ్డి, ఆ తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరి 1998లో లెఫ్టినెంట్ పదవిలో చేరాడు. తన ప్రతిభా పాటవాలతో అతి తొందరలోనే కెప్టెన్ పదవిని పొంది జమ్మూ కశ్మీర్ సరిహద్దులోని రాజోరిలో 69వ ఫీల్డ్ రెజిమెంట్‌లో నియమితుడయ్యాడు. అతని సాహస పరాక్రమాలను గుర్తించిన అధికారులు అతడిని ఆనాటి కార్గిల్ యుద్ధ ప్రణాళికకు సంబంధించిన ఆపరేషన్ పరాక్రంలో చేర్చుకున్నారు.
కెప్టెన్ హోదాలో రాజోరిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 2002 జూలై 31న పాకిస్థాన్ ఉగ్రవాదులు రాజోరిలోని డీసీ కాలనీకి చెందిన ఒక ఇంట్లో గ్రెనేడ్ బాంబులతో, రైఫిళ్లతో దాక్కున్నారని, డీసీ కాలనీలోని రాజకీయ నాయకులను, పొలీసు ఉన్నతాధికారులను మట్టుబెట్టి విధ్వంసం సృష్టించనున్నారన్న వార్త విన్నాడు. రాజారెడ్డి వెంటనే అప్రమత్తమై అస్సాల్ట్ రైఫిల్ తీసుకుని ఉగ్రవాదులు దాక్కొన్న ఇంటిపై దాడిచేశాడు. దాడికి వెడుతూ ఆ విషయాన్ని తన కమాండింగ్ ఆఫీసర్‌కు తెలియజేశాడు.
ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిపై దాడిచేసిన వీర రాజారెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించి ఒక గదిలోని ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాడు. ఇది గమనించిన పక్కగదిలోని మరో ఇద్దరు ఉగ్రవాదులు రాజారెడ్డి మీద తూటాల వర్షం కురిపించారు. 48 తూటాల గాయాలతో రాజారెడ్డి శరీరం ఛిద్రమైంది. ఇంతలోనే అక్కడికి చేరుకొన్న భారత సైన్య బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి మిగతా ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టాయి.
వీర రాజారెడ్డి ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రశంసించిన మిలిటరీ అధికారులు నివాళులర్పించి ధృవతారగా ఆయనను చిరస్థాయిగా నిలపడానికి నార్తన్ కమాండ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ స్మృతి చిహ్నమైన ‘ధృవ’పైన ఆయన పేరును లిఖించారు. దేశ రక్షణ కోసం 24 ఏండ్లకే తన జీవితాన్ని త్యాగంచేసిన వీర రాజారెడ్డి వీరోచిత పోరాటాన్ని పత్రికలు పతాక శీర్షికలతో కొనియాడాయి. భాగ్యనగరంలోని తార్నాక-ఉప్పల్ మార్గంలో స్థాపించబడిన మిలిటరీ దుస్తుల్లో కనిపించే కెప్టెన్ వీర రాజారెడ్డి విగ్రహం యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ కర్తవ్య బోధ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.