కలం బరువును మాత్రమే మోయగల శరీరం, సాహిత్య లోకాలన్నింటినీ తడిమి చూడగల క్రాంత దర్శిత్వం ఆయన సొంతం. ఆయన కలంలోంచి కళ్లు తెరిపించే కవిత్వం జాలువారింది. అబ్బుర పరచే పరిశోధనా గ్రంథాలు అవతరించాయి. ఒకటా రెండా శతాధికం! ఆ మహారచయితే డా. కపిలవాయి లింగమూర్తి (1928…2018). సాహిత్యంలోని క్లిష్టమైన ప్రక్రియలు అనగా చిత్రపది, బంధాలు, శబ్దపది, అలంకారాలు, యతులతో చమత్కారాలు వంటివి వీరిరచనలలో చాలా కనిపిస్తాయి. భాషాసముద్రపు లోతుల్లోకి దిగి తెలుగుపలుకుబడిపై ప్రత్యేకాధికారం పొందారు. ఉమ్మడిపాలమూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించి మరుగునపడిన శాసనాలు, చరిత్ర, జానపదుల నోళ్లలో నానే అపూర్వమైన, విలువైన విషయాలను గ్రంథస్థం చేశారు.
‘ఒక్క సిరా చుక్కలక్ష మెదళ్ళ కదలిక’ అన్న కాళోజీ వాక్యంతో అన్వయిస్తే కపిలవాయి సృజించిన వేల అక్షరాలు ఎంతమంది మెదళ్లకు పదును పెట్టినవో. లింగమూర్తిగారు 1928 మార్చి 31న (ప్రభవ మాఘ శుద్దనవమి నాడు) నాగర్‌కర్నూలు జిల్లా బలుమూరు మండలం జినుకుంట గ్రామంలో ఒక పండిత వంశంలో మాణిక్యాంబ, వెంకటాచలం దంపతుల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించినారు. అమరాబాదులో మేనమామగారైన చేపూరు పెద్దలక్ష్మయ్యగారి దగ్గర పెరిగి విద్యాబుద్ధులు నేర్చి సంస్కృతాంధ్ర నిఘంటువులు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలు, జ్యోతిష్య, శ్రౌతాది శాస్ర్తాలు నేర్చారు. వారు మొదలు కొంతకాలం స్వర్ణకార వృత్తిపని చేసి తర్వాత ఉద్యోగ జీవితంలోకి మారి అపూర్వమైన సాహిత్య సృజన చేశారు.
నిత్య సాహితీ కృషీవలుడైన కపిలవాయి లింగమూర్తి 157దాకా గ్రంథాలు రాశారు. వీనిలో వివిధ ప్రక్రియలలో వెలువరించినవి 94. పరిష్కృత, సంపాదక, సంకలనాల రచనలు 63. ప్రక్రియలలో శతకాలు, కావ్యాలు, ఉదాహరణలు, సంకీర్తనలు, హరికథలు, వచనగేయ పద్యకృతులు 41. వచనరచనలలో ఆధ్యాత్మిక రచనలు, కథలు, నవలలు, నాటికలు, స్థలచరిత్రలు, జీవితచరిత్రలు, నిఘంటువులు, అనువాద రచనలు మొత్తం 53. లింగమూర్తిగారు వివిధ విషయాలపై వందలాదిగా వ్యాసాలు రాశారు.
అవి అనేక ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వానిలో సాహిత్య, ఆధ్యాత్మిక, చారిత్రక, పుస్తకపరిచయాలు, కవులపరిచయాలు, విశ్వకర్మ సాహిత్యవ్యాసాలు ఉన్నాయి. అవి ముద్రితాలు, అముద్రితాలు కలిపి 430 దాకా ఉంటాయి. వీరు చాలామంది రచయితల
పుస్తకాలకు ముందుమాటలు, పీఠికలు, అభిప్రాయాలు రాసిపెట్టారు. చాలా పుస్తకాలు పరిష్కరించి వాటికి వివరమైన పీఠికలు రాశారు. అవి
అన్నీ కలిపి 320 దాకా ఉంటాయి.
ప్రచురించిన గ్రంథాలలో ఆర్యశతకము (చిత్రపది పదాల గారడి), దుర్గాభర్గ శతకము (అలంకార యతి లక్షణాలు), ఉమామహేశ్వరం హరికథ, సుబ్రహ్మణ్యోదాహరణము (పాలెంసుబ్బయ్య జీవితచరిత్ర), ప్రబోధ పటాహము (సామాజిక గేయాలు), శ్రీమత్ ప్రతాప గిరిఖండము (అమరబాదు స్థలచరిత్ర) కుటుంబ గీత (కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను తెలిపే కావ్యం), భాగవత కథాతత్వము (పది భాగవతకథలకు వ్యవహారికమైన వివరణ), గీతాచతుష్పథం (భగవద్గీత, ఉత్తరగీత, ఉద్ధవగీత, భ్రమరగీతల సారాంశము), జీవుడు – దేవుడు (పురాణాలలోని సంఘటన లను నేటి సమాజానికి అన్వయిస్తూ రాసిన విశ్లేషాత్మక రచన), పాలమూరు జిల్లా దేవాలయాలు (జిల్లాలోని 300 ప్రాచీన, ఆధునికదేవాలయాల చరిత్ర), గురు గోవిందమాంబ చరిత్ర, ఉమ్మడి పాలమూరు కవిపండిత వంశాలు, యోగులు, ఉప్పునూతల కథ, ఆంధ్ర పూర్ణాచార్యులు (చారిత్రక నవల), పద్యకథా పరిమళం, కపిలవాయి కథానికలు, కావ్యగణపతి అష్టోత్తరము (కావ్యాలలోని 108 గణపతి స్తుతులకు వ్యాఖ్యానం), స్వర్ణశకలాలు (90 కావ్యాల్లోని స్వర్ణాభరణాలను గురించిన వివరణ), రుద్రాధ్యాయము (సామాజిక చారిత్రక వ్యాఖ్యానం) మాంగల్యశాస్త్రము (ప్రాచీన ఆభరణాల విశేషాలు, వివరాలు), హనుమచ్చహస్రము (హనుమంతుడి వేయినామాలకు వ్యాఖ్యానము), మా భగోట (సవివర కుటుంబ చరిత్ర), రాజరథం (నాటకం), పీఠికలు (330 పుస్తకాలకు వ్రాసినవి), పామర సస్కృతము (6000 పాలమూరు మాండలికాల సేకరణ), విశ్వ బ్రాహ్మణుల సంస్కృతీ అనుకరణము (కన్నడ నుండి అనువాద రచన) కొన్ని మాత్రమే.
పరిష్కృత రచనలలో సాలగ్రామశాస్త్రము, (సాలగ్రామం పుట్టుక వాని భేదాలు, మహత్యము, పూజావిధానము వివరించిన రచన), యోగసక్తా పరిణయము, యయాతి చరిత్ర (అచ్చతెలుగుకావ్యం), ఆరు అముద్రిత శతకాలు, మనోబుద్ధిర్వివాదము, సంక్షిప్త ఆబ్దిక విధానము, శ్రీ మదాంధ్ర
పూర్ణాచార్య ప్రభావము ముఖ్యమైనవి.
కపిలవాయి ఏడుదశాబ్దాల సాహితీకృషికి గుర్తింపుగా పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో 30-08-2014న గౌరవ డీ.లిట్ సత్కృతిని అందించింది. ఆయన రాసిన శతాధిక గ్రంథాలలో కొన్నింటిని మాత్రం పరిచయం చేస్తాను. ఒక్కొక్క గ్రంథంపైన ఒక్కో పీహెచ్డీ చేయొచ్చు. తెలంగాణ పదకోశాల్లో ‘పామర సంస్కృతం’ విశిష్టమైంది. దశాబ్దాలపాటు పల్లెప్రజలతో మమేకమై ఈ పదాలను, జాతీయాలను, సామెతలను సేకరించారు. ఈ పదకోశ నిర్మాణానికి డా.కపిలవాయి లింగమూర్తిగారిని గడియారం రామకృష్ణశర్మ, వావిలాల గోపాలకష్ణయ్య ప్రోత్సహించారు. ఇక్కడ పామరులు అనగా జానపదులు. తెలంగాణ పల్లె ప్రజలు శిష్ట వ్యావహారిక పదాలని తమకు అనుగుణంగా
మార్చుకొని మాట్లాడతారు.
‘పామర సంస్కృతం అనగా పామరుడు తాను సంస్కరించుకున్న భాష అనే అర్థంలో ఈ పేరుంచా ను’ అని లింగమూర్తి గారు పేర్కొన్నారు. పామర సంస్కృతంలో పదాలకు అర్థాలతో పాటు పద్యపాదాలు, పాటల పల్లవులు, నానార్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు, సామెతలు, న్యాయాలు, పదవివరణ, రూపసాధన, పదవ్యుత్పత్తి, అన్యదేశ్యాలు అనుబంధంలో ఇచ్చినవాటిని స్థాలీపులాకన్యాయంగా పరిశీలించడం జరుగుతుంది.
ఆయన రాసిన మరో అపూర్వ గ్రంథం మాంగళ్యశాస్త్రం. ఇది తాళపత్రాలలో వారి తాతగారి గ్రంథాలయంలో దొరికింది. మన ఆభరణాలు, వాటి చరిత్ర తెలుగువారి సొమ్ముల స్వరూపాలు, వివాహాభరణాల విశేషాలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇంకా ఇందులో మాంగళ్యాల వివిధ రూపాల గురించి,
స్త్రీల కాలిమెట్టెలు, చేతిగాజుల గురించి కూడా సవివరంగా తెలిపారు.
ఇక రెండవది సాలగ్రామం. ఇది వారి కుటుంబచరిత్ర. మా భగోటాకు సంక్షిప్తీకరణ. ఈ ఆత్మకథలో అటు స్వర్ణశిల్పంతోపాటు మరిన్ని విద్యలలో రాణించిన ఒక స్త్రీమూర్తి కనబడుతుంది. ఆమే మేడిపూరు గోవిందమ్మ. చిన్నతనంలో భర్త చనిపోవడంతో తండ్రి, అన్నల వద్ద స్వర్ణశిల్పంతో పాటు అన్నివిద్యలు నేర్చుకున్న ప్రతిభావంతురాలు. ఆమె లింగమూర్తిగారి తాతగారైన సింగవట్నానికి స్వర్ణశిల్పంలో శిక్షణ ఇచ్చింది. తోలుబొమ్మలాట ఆడేవారిలో ఉన్న చిత్రకారులతో పౌరాణిక చిత్రాలు గీయించి సింగవట్నానికి వాటిద్వారా చెక్కడం పనికి కావలసిన చిత్రలేఖనం నేర్పించింది. ఆ కాలంలో ఇటువంటి స్త్రీలు అరుదు.
సాలగ్రామం చదివినప్పుడు ఆనాడు విశ్వకర్మలు ఉగాది, దసరా పండుగలను ఎలా జరుపుకునేవారో తెలుస్తుంది. ఆ కాలంలో లింగమూర్తిగారింట్లో ఉగాది, దసరా పండుగలు నవరాత్రులుగా సాగేవట. ఉగాదికి తమ పనిముట్లను పూజించేవారు. ఉగాదినాడు పనిముట్లనన్నింటిని కడిగి, తుడిచి, చమురు (నూనె) పూసి వాటికి గంధంతో తిర్యక్పుండ్రాలు, చంద్రరేఖలు తీర్చి కుంకుమతో అలంకరించేవారు. ఉగాది దినాలలో విశ్వకర్మపురాణం పగటిపూట, భజన రాత్రిపూట ఉండేదట. 1937 ప్రాంతంలోనే బడులలో ‘బడితోటల’ పెంచే సంస్కృతి ఉన్నదని ఈ ఆత్మకథ తెలుపుతుంది.
దీని వలన మనకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ‘నా మొలకమామిడి నివాసం’ శీర్షికలో లింగమూర్తి గారి చదువరితనం వెల్లడవుతుంది. రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి తెల్లవారి నాలుగు గంటలవరకు ఎక్కడా విడువకుండా వేయిపడగలు నవలను చదవడం మనను సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తుంది. ‘పాలెంలో పదేండ్లు’ అధ్యాయంలో లింగమూర్తిగారి మిత్రబృందం సాహిత్యకృషి కనబడుతుంది. తెలకపల్లె విశ్వనాథశర్మ, సీతారామశాస్త్రి, రామకృష్ణశాస్త్రి, శ్రీరంగాచార్యులు, మామిడన్న సత్యనారాయణ మొదలైన కవిపండితుల సాహచర్యంలో ఆయనకు కలిగిన శబ్దజ్ఞానం, పరిష్కరణ సాధకబాధకాల పరిజ్ఞానం భవిష్యత్తులో ఎంతగానో తోడ్పడినట్లు తెలిపారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన ఒక మారుమూల పల్లెటూరు పిల్లవాడు తన క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, కృషి, నిజాయితీలతో ఏ విధంగా రాష్ర్టం మెచ్చుకునే కవిపండితుడయ్యాడో ఈ ఆత్మకథ మనకు తెలుపుతుంది. చిత్రకారునిగా, జ్యోతిషవేత్తగా, యోగసాధకునిగా, పుస్తకాల పురుగుగా, శిల్పిగా, నాటకాలకు వస్తువులు తయారు చేసిన సృజనశీలిగా, కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, చరిత్రకారుడిగా, పరిష్కర్తగా, సంపాదకునిగా విభిన్న పార్శ్వాలు గల కపిలవాయి లింగమూర్తిగారి జీవితాన్ని ఆవిష్కరించే గ్రంథం ఇది.
ఆయన అధ్యాపకత్వానికి ముందు బంగారం పనిచేసినవారే. అందుకే ఆయన సాహిత్య స్వర్ణసౌరభ కేసరి అయ్యారు. ఆయన రచనలూ బంగారమే! ఆయన నడక, నడత…బంగారమే! ఎందరో ఔత్సాహికులకు శిష్యులకు, మిత్రులకు కవితా రంగంలో ఓనమాలు దిద్దించి దశ, దిశా నిర్దేశనం జరిపారు. ఆయన సాహిత్యకృషికి గుర్తింపుగా హైద్రాబాద్‌లో జరిగిన 32వ హైద్రాబాద్ బుక్‌ఫెయిర్‌కు ‘కపిలవాయి లింగమూర్తి ప్రాంగణం’ అని నామకరణం చేసి గౌరవించారు. ఆ పుస్తకప్రదర్శనలోనే వారి ఆత్మకథ ‘సాలగ్రామం’ను ఆనాటి భారత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆయన కృషిచేసిన స్థానిక చరిత్రలను, దేవాలయాల చరిత్రను ఇంకా వెలికితీసి కొనసాగించడమే ఆ మహానుభావునికి నిజమైన నివాళి.
(వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్)
– డాక్టర్ కోడోజు కృష్ణమూర్తి
85001 67845