దైవానుగ్రహం పొందాలంటే కఠోర తపస్సు చేయాలి. కఠిన నియమాలు పాటించాలి. అయినా దేవుడు సాక్షాత్కరించాలన్న నియమం ఏమీ లేదు. ‘తపోధనులు, పుణ్యాత్ములకే దేవుడి దర్శనం లభిస్తుంది’ అని చాలామంది భావిస్తుంటారు. కానీ, ‘దేవుడు నావాడు’ అని నిండుమనసుతో విశ్వసిస్తే.. అందరివాడైన గోవిందుడు ఎవరికైనా అందుతాడు అనడంలో సందేహం లేదు. నంద నందనుడి అల్లరిలో ఆనందంగా భాగస్వాములైన గోప బాలకులే ఇందుకు ఉదాహరణ. బృందావనంలో బాలకృష్ణుడు ప్రదర్శించిన లీలలన్నీ వాళ్లు కండ్లప్పగించి చూశారు. అయినా కృష్ణుడిలో దేవుడిని చూడలేదు. ఒక స్నేహితుడినే దర్శించారు.
ఒకసారి బలరామకృష్ణులు, గోపబాలురూ అందరూ కలిసి వనభోజనాలు చేయాలని సంబరపడ్డారు. పొద్దునే లేచి ముస్తాబయ్యారు. గోవులను తోలుకొని, కొమ్ముబూరలు ఊదుతూ కోలాహలంగా బయల్దేరారు. చద్దన్నం కావడులను భుజాలకు తగిలించుకున్నారు. పిండివంటల మూటలు కట్టుకున్నారు. లేగమందలను ఉరికిస్తూ అందరూ వనంలోకి ప్రవేశించారు. ఒకరు పిల్లనగ్రోవి వాయిస్తే, మరొకరు బూర ఊదుతూ కోలాహలంగా కదిలారు. కోకిలను, మిగిలిన పక్షులను అనుకరిస్తూ ఉత్సాహంగా అడుగులు వేశారు. ఈ జట్టుకంతా నాయకులు బలరామకృష్ణులే! వారి అల్లరికి ఆజ్యం పోస్తున్నదీ వీళ్లే!! నదిలో అందరూ స్నానం చేశారు. కొందరు చెట్టు ఊడలు పట్టుకొని ఊ గారు. ఇంకొందరు పరుగు పందాలు వేసుకున్నారు. ఒకరిపై నుంచి మరొకరు దూకుతూ తోసుకున్నారు. రకరకాల భంగిమ లు పెట్టి నీడలను చూసి నవ్వుకున్నారు. ఇలా రకరకాల ఆటలు ఆడుతూ వనభోజన సంబురాన్ని ఘనంగా చేసుకున్నారు. కృష్ణు డు దూరంగా నడుస్తూ ఉంటే ‘కన్నయ్యను ఎవరు ముందుగా ముట్టుకుంటారో వారిదే గెలుపు’ అని పందాలు పెట్టుకున్నారు. గెలిచిన వాళ్లు ఓడిన వాళ్లను చూసి పకపకా నవ్వారు.
గోప బాలకులది ఎంతటి అదృష్టం! ఏ పరమ పురుషుడి పాదపద్మాల ధూళి రవ్వంత సోకితే ఈ జన్మకు అదే పదివేలు అని యోగులు పరితపిస్తారో… అటువంటి కృష్ణుడితో గోప బాలకులు కలిసిమెలిసి ఆడుకున్నారు. అతణ్ని కౌగిలించుకుంటూ, అతనితో చెట్టాపట్టాలు వేసుకొని, హాస్యాలాడుతూ, ఆడుకుంటూ తరించారు. ఈ సందర్భాన్ని మహాకవి అత్యద్భుతంగా వర్ణిస్తూ.. ‘యోగులకు బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకు ఆరాధనీయుడు అయిన ఆ భగవంతుడు గోప బాలకులకు సాధారణ బాలుడిగా కనిపించాడు’ అని పేర్కొన్నాడు. ‘భగవానుడు నా వాడు’ అనే గోప బాలకుల విశ్వాసమే గోవిందుడిని వారి వాడిని చేసింది.
– టి.వి.ఫణీంద్రకుమార్