ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల కష్టార్జితాన్ని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే ప్రధాన వనరు – రిటైర్మెంట్ బెనిఫిట్స్. పిల్లల చదువులు, కుమార్తెల పెండ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం లేదా అత్యవసర వైద్య ఖర్చుల కోసం వారు ఈ సొమ్మునే ఆశ్రయిస్తారు. అయితే, రాష్ట్రంలో దశాబ్దాల పాటు సేవలు అందించి, రిటైరైన ఉద్యోగులు తమ సొంత సొమ్మును కూడా సకాలంలో తీసుకోలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు మూడేండ్లు కావస్తున్నా తమకు పూర్తి మొత్తంలో రావాల్సిన బకాయిలు అందక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడుపుదామనుకునే వారికి ప్రభుత్వ ఉదాసీనత వల్ల తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వం నుంచి రావలసిన ప్రధాన బెనిఫిట్లు నిలిచిపోవడంతో వృద్ధాప్యంలోనూ ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు దాపురించాయి. 2024 ఏప్రిల్ నుంచి రిటైరైన సుమారు 10 వేల మందికి పైగా ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు పూర్తిగా నిలిచిపోయాయి. తీవ్ర ఒత్తిడి, కోర్టు కేసుల నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లలో కేవలం 30-50 శాతం మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తాన్ని సర్కార్ పెండింగ్‌లో పెట్టింది. అరకొర చెల్లింపుల వల్ల తమ అవసరాలు ఏమాత్రం తీరక రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా, గతంలో రావాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా వారికి నిలిచిపోయాయి.
తాము ప్రతి నెలా జీతం నుంచి పొదుపు చేసుకున్న జీపీఎఫ్ నిధులను సైతం నిలిపివేయడం శోచనీయమని ఆవేదన చెందుతున్నారు. టీఎస్జీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, తెలంగాణ స్టేట్ ఇన్సూరెన్స్, జీఐఎస్ బకాయిలు కూడా సకాలంలో చెల్లించడం లేదు. గ్రాట్యుటీ క్రెడిట్ చేయకుండా కేవలం కమ్యూటేషన్ మాత్రమే వేయడంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. వాస్తవానికి కమ్యూటేషన్ ఇచ్చిన మరుసటి నెల నుంచే పెన్షన్‌లో దాదాపు 40 శాతం వరకు రికవరీ జరుగుతుంది. గ్రాట్యుటీ రాకుండా పెన్షన్ మొత్తం తగ్గిపోవడంతో పెద్ద ఆర్థిక భారంగా మిగులుతున్నది. ఎర్న్డ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జీవితాంతం దాచుకున్న 300 రోజుల సంపాదిత సెలవుల నగదు బిల్లులు కూడా చాలామందివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
పాత పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ ఎంతోమందికి పూర్తి స్థాయిలో అందలేదు. గత రెండు నెలలుగా రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు/పెన్షన్ల నుంచి ఈహెచ్ఎస్ పేరిట రికవరీ చేస్తున్నా, క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించే హెల్త్ కార్డ్స్ ఇప్పటికీ అందలేదు. దీనివల్ల వృద్ధాప్యంలో అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
ఆరు నెలల్లో అమలు చేస్తామన్న పీఆర్సీ, నెలలు గడుస్తున్నా కనీసం నివేదిక కూడా బయటకు రాకపోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. 2024 జనవరి నుంచి రావలసిన సుమారు 6 డీఏ బకాయిల మంజూరులో తీవ్ర ఆలస్యమవుతున్నది. విశ్రాంత ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడకుండా ఉండాలంటే..ఉద్యోగ విరమణ చేసిన నెలలోపే వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందించాలి. ఇది వారి ప్రాథమిక హక్కుగా పరిగణించాలి. రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధాప్యంలో గౌరవంగా, ఆర్థిక భద్రతతో జీవించేలా చూడటం ప్రభుత్వ కనీస బాధ్యత. వారి చట్టబద్ధమైన హక్కులను కాపాడటానికి, జీవితాంతం దాచుకున్న సొమ్మును సకాలంలో అందించడానికి వెంటనే స్పందించి, తగిన తక్షణ చర్యలు చేపట్టాలి. అత్యవసర అవసరాల కోసం తాత్కాలిక రుణాలు, జీపీఎఫ్ పాక్షిక ఉపసంహరణలకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలి. జీపీఎఫ్ ఫైనల్ క్లోజర్ మొత్తంతో పాటు పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ నిధులను యుద్ధప్రాతిపదికన విడుదల చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ ఉద్యోగుల జీవన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.
(వ్యాసకర్త: తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు )
– కస్తూరి రవీందర్ 9246931431