BRS | అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పనైపోయిందని జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు భ్రమపడ్డాయి. ఇక తమదే రాజ్యమని సంబురపడిపోయాయి. కేసీఆర్ అనారోగ్యం, ఇతర సమస్యలు బీఆర్ఎస్ను ముందుకు కదలనీయవని, ఇక బీఆర్ఎస్ పుంజుకొనే అవకాశాలు పెద్దగా లేవని నక్క ఆశలు పడ్డాయి. కానీ, ఆ పార్టీల ఆశలను, ఆకాంక్షలను బద్దలుకొడుతూ అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, ప్రతికూల పరిస్థితులకు వెరవకుండా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి దూకారు. ప్రజల్లోకి దూసుకువెళ్లారు. మారిన పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించారు. వారి గోడు చెవియొగ్గి విన్నారు. వారికి భుజం తట్టి భరోసా ఇస్తున్నారు. మీడియా ఇంటర్వ్యూల్లోనూ తనదైన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు. దీంతో సీన్ మారిపోయింది. నాలుగు నెలలు తిరగకముందే బీఆర్ఎస్ మళ్లీ ఫామ్లోకి వచ్చింది. ప్రజలతో కేసీఆర్ మమేకమవుతున్నారు. జరిగిందేదో జరిగింది, కాగల కార్యం ముందుంది అంటూ ఓటర్లకు కర్తవ్య బోధ చేస్తున్నారు. బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నారు. ఢిల్లీలో తెలంగాణ వాణి బలంగా వినిపించాలంటే బీఆర్ఎస్ను అత్యధిక ఎంపీ సీట్లను అందించాలని ప్రజలను కోరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ప్రభంజనం వీయడం మొదలైంది. కేసీఆర్ ఎక్కడకు వెళ్లినా వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ప్రజల ఆదరణను చూసి బెదిరిన కాంగ్రెస్, బీజేపీలు ఎలాగైనా కేసీఆర్ను కట్టడిచేయాలని కుమ్మక్కయ్యాయి, కుట్రలు పన్నాయి. కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన వెంటనే ఈసీ చర్య తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఇది కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకునే కుట్రలో భాగమే. ప్రధానికి ఒక నీతి, విపక్ష నేతకు మరొక నీతి అన్నట్టుగా ఈసీ చర్యలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇది జరగడం అనేక సందేహాలకు తావిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ బాహాటంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో ప్రసంగాలు చేస్తే మొదట మౌనం వహించి విపక్షాల ఒత్తిడి పెరిగిన తర్వాత నామ మాత్రంగా పార్టీ అధ్యక్షునికి లేఖ రాసి ఊరుకుంది. ఇప్పటిదాకా ఎలాంటి చర్యా తీసుకోలేదు. ప్రధాని ప్రస్తావించిన అంశాలపై దేశవ్యాప్తంగా గగ్గోలు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఆ స్థాయిలో కేసీఆర్పై సాధారణ ప్రజానీకంలో ఎలాంటి విమర్శలు రానప్పటికీ ఆగమేఘాలమీద బస్సు యాత్రకు బ్రేక్ వేసేందుకు సమాయత్తమైంది. ఈసీ దగ్గర బీజేపీకి, ప్రతిపక్షాలకు వేర్వేరు చర్యలు ఉండటాన్ని ఇది సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈసీ కమిషనర్ల నియామకాలను వివాదాలు చుట్టుముట్టడం తెలిసిందే. ప్రధాని, సీజేఐ, ప్రతిపక్ష నేత సభ్యులుగా నియామక కమిటీ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రి ఉండేలా నిబంధనలను మార్చింది. ప్రధాని, కేంద్రమంత్రి కమిటీలో ఉంటే మొగ్గు ఎటువైపు ఉంటుందో తెలిసిందే. పైగా అతితక్కువ సమయంలో ఎంపిక పూర్తిచేసి, ఎన్నికల వేళ హడావుడిగా ఇద్దరు కమిషనర్లను నియమించింది. దీనిపై ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి అసమ్మతి వ్యక్తం చేశారు కూడా. మరోవైపు కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయనప్పటికీ ప్రభుత్వం చూపిన తొందరపాటును మాత్రం ఎత్తిచూపడం గమనార్హం. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కమిషన్ నియామకాలు ఈ విధంగా అనుమానాస్పదం కావడం ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ఉపకరిస్తాయో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. అంతిమంగా ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది.