‘దండిగా డబ్బు సంపాదించలేనివాడికి నా సర్కారులో చోటివ్వను’ అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిమతం. పలు సందర్భాల్లో ఆయన ఆ సంగతిని తనదైన శైలిలో బల్లగుద్ది మరీ చెప్పారు. ఆచరించి చూపుతున్నారు కూడా. రెండో విడత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన క్యాబినెట్లో 13 మంది అపర కుబేరులు చేరిపోవడమే అందుకు తార్కాణం. 700 కోట్ల డాలర్ల పైచిలుకు విలువైన ఉమ్మడి ఆస్తులతో కూడిన అత్యంత సంపన్న క్యాబినెట్‌ను ట్రంప్ ఏర్పాటుచేశారు. రాజకీయ నేతలకు వెనుక నుంచి అండదండలు అందించే రౌడీలు తామే నేతల అవతారమెత్తి చక్రం తిప్పిన కథలను మన దేశంలో విన్నాం, చూశాం. ఇప్పుడు అమెరికా వ్యాపారవేత్తల వంతు వచ్చినట్టు కనిపిస్తున్నది. మొన్నటివరకు రాజకీయ నాయకుల ద్వారా తమ పనులు సాధించుకున్న సంపన్నవర్గాలు తామే రంగంలోకి దిగి పగ్గాలు పుచ్చుకుంటున్నాయి. ఈ బృహత్ పరిణామాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ‘ఆలిగార్కీ’ (సంపన్నస్వామ్యం) అని అభివర్ణించారు. స్వామ్యం, సామ్యం ఏదైనా మొత్తం మీద రాజకీయానికి, వ్యాపారానికి మధ్య ఉండే సున్నితమైన తెరలు తొలగిపోతున్నాయి.
సంపన్నవర్గాల నుంచి వచ్చి, సంపన్నులను చుట్టూ పెట్టుకొని పరిపాలించే ట్రంప్ సంపన్నులకు కాక ఇంకెవరికీ మేలు చేస్తారు? ప్రజలు, ప్రజల సమస్యలు ఎటుపోయాయో తెలియదు. సంపన్నులకు పన్నుల్లో భారీ కోత, సామాన్యుల సంక్షేమానికి నిధుల కుదింపు వాతతో కలగలిపి ఓ చట్టాన్ని ఆయన తెచ్చారు. దానికి ఇటీవలే కాంగ్రెస్ ఆమోదం కూడా లభింపజేసుకున్నారు. దీనినే ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అని పిలుస్తున్నారు. ఇందులో ఇంకా అనేక తిరోగమన అంశాలున్నాయి. ఉదాహరణకు పర్యావరణ అనుకూల ఇంధన రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాల్లో కోత. ఇది పరోక్షంగా విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు పెద్ద దెబ్బ. దీన్ని ముందే పసిగట్టిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్రంప్ సర్కారు నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ట్రంప్‌పై కారాలూ మిరియాలూ నూరుతున్నారు.
అమెరికాలో రాజకీయ ఆధిపత్యం దక్కించుకున్న సంపన్నుల్లో అంతఃకలహాలున్నట్టు ట్రంప్-మస్క్ తగాదా బయటపెట్టింది. వారిద్దరి మాటల యుద్ధం మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. ‘ఏదో ఒక పార్టీని బలపర్చి, వేరే ఎవరినో అధ్యక్షునిగా గెలిపించడం ఏమిటి? నేనే రాజు.. నేనే మంత్రి’ అంటూ మస్క్ తానే స్వయంగా అమెరికా పార్టీ అనే పార్టీని కూడా ప్రకటించారు. ఇదంతా బిగ్ బ్యూటీఫుల్ బిల్‌ను ఆపలేకపోయాననే అక్కసులో నుంచి పుట్టిన ఉరుకులాటే. అమెరికాలో మూడో పార్టీ నిలదొక్కుకోవడం అసాధ్యమని చరిత్ర రుజువు చేసింది. అయినప్పటికీ, బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందిన వెంటనే మస్క్ కొత్త పార్టీని ప్రకటించారు. అయితే, దక్షిణాఫ్రికాలో పుట్టిన మస్క్.. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అక్కడి రాజ్యాంగం అనుమతించదనేది తెలిసిందే. ఇటీవలి కాలంలో వరుసగా ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం పొందుతున్న ఈ పారిశ్రామిక దిగ్గజం మూడో పార్టీని అమెరికాలో అధికారంలోకి తీసుకురాగలరా? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న.