అభివృద్ధి, వికాసాలు మనిషిని సమస్యలనుంచి విముక్తున్ని చేసే బదులు మరింతగా విషవలయంలోకి నెడుతున్నాయి. ఆధునికాభివృద్ధితో కాలుష్యం పెను సవాలుగా మారింది. పట్టణాలు, నగరాలు కాలుష్యకాటుతో నివాసయోగ్యం కాకుండా తయారవుతున్నాయి. మన దేశంలో రాజధాని ఢిల్లీతోపాటు పలు నగరాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి.
భోపాల్లో విషవాయువు 15 వేల మంది ప్రాణాలు తీసి, ఆరు లక్షల మంది నగరవాసుల జీవితాల్లో కల్లోలంనింపి ఇప్పటికి 37 ఏండ్లు అవుతున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద విషవాయు దుర్ఘటన దినం 1984 డిసెంబర్ 2.రాజ్యాంగం దేశ పౌరులకు అన్నివిధాలా రక్షణ కల్పించింది. సమానత్వాన్ని కాంక్షించింది. కానీ రాజ్యాంగం ఉనికిలోకి వచ్చిన నాటి నుంచే చట్టా ల అమలు ప్రశ్నార్థకంగా మిగులుతూనే ఉన్నది. ఎన్ని చట్టాలున్నా వాటి అమలు కీలకం. ఏ దేశం లో నైనా సమర్థమైన పాలన మాత్రమే చట్టానికి ఆయువు పోయగలుగుతుంది.భోపాల్ విషాదం లో చట్టాల ఉల్లంఘనే ప్రధాన సమస్య.
దేశంలో ఆహారపదార్థాల ఉత్పాదకత పెంచి ఆహార సంక్షోభం నుంచి బయటపడేందుకు హరితవిప్లవం ప్రారంభించారు. దీనికి ఊతం ఇచ్చేందుకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు అవసరమయ్యాయి. అలాంటి ఒకానొక పురుగుమందు ‘సెవిన్’. దీని తయారీకి 1969లో యూనియన్ కార్బైడ్ కంపెనీని భోపాల్లో నెలకొల్పారు. మిథైల్ ఐసొ సైనేట్ (ఎంఐసీ) అనే విషవాయువుతో రసాయనిక ఎరువులు తయారు చేయటం ప్రారంభించారు. 1976 నుంచే అక్కడ పని చేస్తున్న ట్రేడ్ యూనియన్లు ఎంఐసీ ప్రమాదాన్ని గురించి యాజమాన్యానికి చెబుతూనే ఉన్నాయి. అవి భయపడినట్లుగానే భోపాల్ దుర్ఘటన జరిగి పెను విషాదాన్ని మిగిల్చింది.
1982లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో45 మంది కార్మికులు విషవాయు ప్రభావానికి గురై చావు అంచులకు వెళ్లారు. పత్రికల్లో 1980ల నుం చే హెచ్చరికల కథనాలు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టాయి. ఫ్యాక్టరీలో ప్రమాదకర పరిస్థితులను కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. ప్రభుత్వాల అలసత్వమూ, బహుళ జాతి కంపెనీ యాజమాన్యానికి ఉన్న నేరపూరిత నిర్లక్ష్యమూ కలిసి అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదానికి దారి తీసింది.
భోపాల్ గ్యాస్ ప్రమాదం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రమాదకర వాయువులతో నడిచే కంపెనీలు జనావాసాల మధ్య, అదీ ఓ మహానగరంలో ఉండటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యం లో జరిగిన ప్రాణనష్టానికి పరిహారంగా భారత ప్రభుత్వం యూనియన్ కార్బైడ్ కంపెనీని రూ. 320 కోట్లు ఇవ్వమని కోరింది. ఈ దుర్ఘటనపై విచారణచేసిన ప్రత్యేక కోర్టు బాధితులకు 350 కోట్లు పరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పింది. అయితే 1989లో కోర్టు బయట జరిగిన ఒప్పందంలో 47 కోట్ల పరిహారం ఇచ్చి కంపెనీ చేతులు దులుపుకొన్నది! విషవాయువుతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయన్న నిపుణుల హెచ్చరికలతో సుప్రీంకోర్టు బాధితుల కోసం ప్రత్యేక దవాఖానా నడపాలని కంపెనీని ఆదేశించింది. అది కూడా ఆచరణలో అమలు కాలేదు.
భోపాల్ దుర్ఘటన జరిగిన నాలుగు దశాబ్దాల తర్వాత కూడా భోపాల్గ్యాస్ పీడిత్ సంఘర్ష్ మోర్చా, ఇతర సంఘాలు ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాయి. మధ్యప్రదేశ్ సర్కారు మొదటినుంచి బాధితుల పక్షాన నిలువటం లేదు. సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులో మృతుల సంఖ్యను కూడా ప్రభుత్వం సరిగా తెలియ జేయటం లేదు. మృ తులు 5వేల మంది అని, మరోసారి 15వేల మందని పత్రాలు దాఖలు చేయడం నిర్లక్ష్యానికి నిలువుటద్దం.
భోపాల్ బాధితుల పక్షాన పౌర, ప్రజాసంఘాలు నేటికీ పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తున్నాయి. రంగస్థల నటుడు హబీబ్ తన్వీర్ ఈ దురంతంపై ‘ఏక్ జహరీలీ హవా’ అనే విషా ద నాటకం రూపొందించారు. 2002లో డొమినిక్ లాపెరే, జేవియర్ మూర్ ‘నైట్ ఇన్ భోపాల్’ అనే పుస్తకం రాసి బాధితులకు అంకితం ఇచ్చారు.
ఈ విషాదం తర్వాతనైనా ప్రభుత్వాలు కాలుష్యనియంత్రణకు, ప్రమాదాల నివారణకు ఏ గుణపాఠాలు నేర్చుకోలేదు. ఆచరణాత్మక చర్యలు పక్కన పెట్టి, చట్టాలతోనే సరిపెట్టారు. భోపాల్ దుర్ఘటన నేపథ్యంలో కేంద్రం 1986లో ‘పర్యావరణ పరిరక్షణ చట్టం’ తెచ్చింది. దానికంటే ముందే 1974లో జాతీయ స్థాయిలో, రాష్ర్టాల స్థాయిలలో కాలుష్య నివారణ మండలి విభాగాలు ఏర్పాటయ్యాయి. ప్రమాదకర రసాయనాల నిల్వ, వాటి దిగుమతి నిబంధనలు, ప్రమాదకర వ్యర్థపదార్థాల నిర్వహణ, వాటి రవాణా నిబంధనలు, జీవ రసాయనాల తయారీ, నిల్వ, ఎగుమతి-దిగుమతి నిబంధనలు లాంటివి ఉనికిలోకి వచ్చాయి. అలాగే.. 1996లో జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం; రసాయన ప్రమాదాల నివారణ, ప్రతిస్పందన నిబంధనలు; పారి శ్రామిక వ్యర్థాల నిర్వహణ, రవాణా నిబంధనలు; శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు రూపొందాయి. వీటి అమలు ఏ స్థాయిలో ఉన్నదో నేడు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న కాలుష్య స్థాయిలే తెలియజేస్తున్నాయి.
పారిశ్రామిక అభివృద్ధిలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించకపోవటం వల్లనే కాలుష్యం పెరుగుతున్నది. నీటినీ, గాలినీ కాలుష్యం విషపూరితం చేస్తున్నది. గంగ నుంచి మూసీ దాకా ఒకే వ్యధ. సర్వత్రా నీటి కాలుష్యం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే కథ.. వాయు కాలుష్యం. ఉత్పాదక కార్యకలాపాలతో వచ్చే కాలుష్యాలను నియంత్రించే బాధ్యత ఉత్పత్తిదారుల మీద ఉన్నది. కాలు ష్య నివారణ చర్యల పరిశీలన, అమలు ప్రభుత్వా ల బాధ్యత. కాలుష్యమైనా, భోపాల్ గ్యాస్ దుర్ఘటన అయినా నిబంధనల ఉల్లంఘన ఫలితమే. ఈ నేపథ్యంలో కాలుష్య వ్యతిరేక చైతన్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. తద్వారానే కాలుష్య కోరల నుంచి దేశాన్ని రక్షించు కోగలుగుతాం.
(వ్యాసకర్త: హెచ్. వాగీశన్ , 94402 53089, అసిస్టెంట్ ప్రొఫెసర్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా)