మావోయిస్టుల పేరుతో దేశవ్యాప్తంగా సాగుతున్న ఎన్కౌంటర్ హత్యాకాండ పతాకస్థాయికి చేరింది. పట్టుకొని బంధించి కాల్చి చంపి ఎన్కౌంటర్ అని ప్రకటించే ఆనవాయితీ దేశంలో కొనసాగుతున్నది. ఇలా ఎన్కౌంటర్ పేరిట హత్య చేయడమనేది ఉమ్మడి ఏపీ భూభాగంలో 1924 నుంచి కొనసాగుతున్నది. 1975 ఎమర్జెన్సీ కాలంలో జలగం వెంగళరావు కొనసాగించిన ఎన్కౌంటర్ హత్యాకాండతో శ్రీకాకుళంసాయుధ రైతాంగ పోరాటం పూర్తి అణచివేతకు గురైంది.
అక్కడినుంచి జగిత్యాల, సిరిసిల్ల జైత్రయాత్రలు అణచివేయడానికి తెలంగాణలోని కొన్ని ప్రాం తాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి 127 సాయుధ క్యాంపులతో అణచివేతను కొనసాగించారు. ఆ తర్వాత వచ్చిన పీపుల్స్‌వార్ ఉద్యమంపై చివరికి నల్లమలలో కొనసాగిన ఉద్యమాలపై ఎన్కౌంటర్ హత్యాకాండ కొనసాగుతూ ఉద్యమాలను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనే ఉనికిలో లేకుండాచేసింది. ఆ క్రమంలోనే 1980ల ప్రాం తంలో దండకారణ్యంలో ప్రవేశించిన పీపుల్స్‌వార్ 2004లో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌తో కలిసి మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో బలమైన ఉద్యమ ప్రాంతాలను నెలకొల్పుకొన్నది. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం… 185 జిల్లాలలో మావోయిస్టు ఉద్యమ ప్రభావం ఉన్నదని ప్రభుత్వ లెక్కలే ప్రజల ముందు పెట్టాయి. కానీ 1990ల నుంచి ప్రారంభమైన దండకారణ్యంలోని ఉద్యమ అణచివేత సల్వాజుడుం, గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్లను దాటుకొని నేడు ఆపరేషన్ కగార్‌లో వేలాది బలగాలు చుట్టుముట్టి కాల్చివేసి ఎన్‌కౌంటర్‌గా ప్రకటిస్తున్న అత్యంత కడుహీన స్థితికి ప్రభుత్వాలు దిగజారిపోయాయి.
ప్రజాస్వామ్యంలో రాజ్యంగం ద్వారా ప్రజలకు ప్రాథమిక హక్కులను హామీ పడ్డ ప్రభుత్వాలు ఆచరణలో ఏమీ లేకుండా చేస్తున్నాయి. చివరికి ఆర్టికల్ 21 ప్రసా దించే జీవించే హక్కు కూడా లేకుండా ఎన్కౌంటర్ పేరు తో వేటాడుతున్నాయి. ఇప్పటికే రెండున్నర దశాబ్దాల్లో 16 వేలకు పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో ప్రభుత్వాలు కాల్చిచంపాయి. ఏ ఎన్‌కౌంటర్‌పై కూడా ఏ రాష్ట్రంలో సరైన న్యాయ విచారణ జరుగకుండానే కేసులు మూతబడిపోతున్నాయి. దీనితో ప్రభుత్వాలు యథేచ్ఛగా పోలీసు బలగాలతో కాల్చి చంపించి ఎన్‌కౌంటర్‌గా ప్రకటిస్తున్నాయి. అందుకు అనేక మిలిటరీ ఆపరేషన్ల పేర్లను సాకుగా వాడుతున్నాయి. కానీ, ఇదే ఎన్కౌంటర్ హత్యాకాండకు వ్యతిరేకంగా ఉమ్మడి ఏపీలో 1997లో కన్నాభిరాన్ ఆధ్వర్యంలో న్యాయస్థానంలో పోరాటం ప్రారంభించారు. దాని తీర్పులో భాగంగా 2009, ఫిబ్రవరి 6న భాగంగా ఉమ్మడి ఏపీ విస్తృత ధర్మాసనం ఒక బలమైన తీర్పును వెలువరించింది. అది వెలువడిన 6 నెలల కాలం అంటే ఆ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చేంత వరకు ఎన్కౌంటర్లు జరుగలేదు. ఆ తర్వాత 2014లో పీయూసీఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేస్‌లో 16 గైడ్‌లైన్‌లతో ఇచ్చిన తీర్పును సుప్రీం కూడా ఖరారు చేసి ఉమ్మడి ఏపీ తీర్పును వెనక్కి నెట్టేసింది. ఈ ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే ఎన్టీఆర్ కాలంలో 1989లో ఆ ఏడాదే అత్యంత ఎక్కువ గా 275 ఎన్కౌంటర్ హత్యలు జరిగాయి. ఆ నేపథ్యంలో తెలంగాణ యువత ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపబడుతున్న స్థితిలోనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్.ఆర్.శంకరన్ చేసిన దశాబ్దకాల కృషిలో భాగంగానే 2004లో వైఎస్ఆర్ ప్రభుత్వానికి, పీపుల్స్‌వార్ పార్టీకి మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ, ఆ చర్చల్లో కీలక భూమికను పోషించిన భూమి విషయం వచ్చేసరికి రెండవ దఫా చర్చల్లో పరిష్కరించుకుందామని మొదటి దఫా చర్చలను ముగించారు.
రెండవ దఫా చర్చలేమో కానీ మళ్లీ నల్లమల అంతా రక్తం ఏరులై పారి చర్చల వాతావరణమే లేకుండా పోయింది. మొత్తంగా ప్రభుత్వాలు ఎవరినైనా చంపాలనుకుంటే ఎన్కౌంటర్ ఆయుధాన్ని చాలా బలంగా ఉపయోగించుకుంటాయి. ఇప్పుడు 2024లో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ ఒక ఏడాదిలోనే 350కి పైగా ఆదివాసీల హత్యలు, 45 ఎన్కౌంటర్లతో మేధావులను, ప్రజా సంఘాలను, ప్రతిపక్ష పార్టీలను ఆందోళను గురిచేయడం గర్హనీయం. ఈ నేపథ్యంలో మధ్య భారతంలో ఒక బలమైన ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టు పార్టీ కూడా తన పేరుతో ఆదివాసీల నర సంహారాన్ని కొనసాగించడాన్ని చూడలేక, సహించలేక చర్చల ప్రక్రియలో తానే ముం దుగా కాల్పుల విరమణ ప్రకటించి నెల రోజులుగా శాంతికోసం ప్రయత్నిస్తున్నది. కానీ, కేంద్రం ఇప్పటివరకు ఆ శాంతి ప్రక్రియపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో 20 25, ఏప్రిల్ 27న తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ స్పష్టంగా ఆపరేషన్ కగార్‌ను ఆపాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో చర్చలు కూడా కొనసాగించాలని లక్షలాది జనం ముందు కేసీఆర్ ప్రకటించారు. నిజంగా ఒక ప్రజాస్వామ్య దేశంలో మనుషులను ఎన్కౌంటర్ పేరుతో వేటాడి హత్య చేయడమనేది సరైంది కాదు. రాజ్యాం గానికి విరుద్ధం. కార్పొరేట్ల కోసం తన సొంత ప్రజలను శత్రుదేశ ప్రజలుగా చిత్రించి యుద్ధం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ హత్యాకాండను అడ్డుకోవాల్సిందే. ఆ నేపథ్యంలోంచే దేశంలోని బుద్ధిజీవులు ప్రజాస్వామికవాదులు, మేధావులు ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచించాలి. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదు.