ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను యుక్తవయస్సులో ఉన్నాను. ఇప్పుడు నరేంద్రమోదీ హయాంలో వయసు మీదపడి వృద్ధుడిగా మారుతున్నాను. వారిద్దరి పాలనను నేను చూశాను. ఈ నేపథ్యంలో నాకున్న వ్యక్తిగత అనుభవం, అధ్యయనం ద్వారా ఇరువురు నేతల మధ్య ఉన్న రాజకీయ వారసత్వ సారూప్యతలు, భేదాల గురించి ఈ వ్యాసంలో సమగ్రంగా చర్చిస్తున్నాను.
కాలం, సిద్ధాంతాలపరంగా వేరైనప్పటికీ ఇందిర, మోదీల మధ్య ఐదు ప్రధాన సారూప్యతలు ఉన్నాయి. ముందుగా మోదీతో ప్రారంభిద్దాం. మొదటిది, ఇందిర లాగానే మోదీ కూడా తన అధికారాన్ని ఉపయోగించి వ్యక్తి ఆరాధన వాతావరణాన్ని సృష్టించారు. పార్టీ, ప్రభుత్వం, దేశానికి ఏకైక ముఖచిత్రంగా తనను తాను చిత్రీకరించుకున్నారు. ప్రజాధనంతోనే ఈ వ్యక్తి పూజ జరుగుతుంది. మోదీ చుట్టూ ఉండేవారు దాన్ని కొనసాగిస్తున్నారు.
రెండవది, ఇందిర వలెనే మోదీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకంగా వ్యవహరించే స్వతంత్ర సంస్థలను బలహీనపరిచేందుకు శాయశక్తులా కృషి చేశారు. ‘కట్టుబడిన వ్యవస్థలు’ (కమిటెడ్ బ్యూరోక్రసీ) అనే ఆలోచనను ఇందిర మొదటిసారి ప్రయోగించారు. ఈ ఆలోచనను మోదీ దత్తత తీసుకున్నారు. అధికారికంగా ఎమర్జెన్సీని ప్రకటించకపోయినా రాజ్యాంగ, ప్రజాస్వామ్య ప్రక్రియలను ఇందిర వలె మోదీ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. నిజాన్ని దాచాలంటూ మీడియాను ఇందిర అణచివేశారు. కానీ, మోదీ మాత్రం అబద్ధాలు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. 1970లతో పోలిస్తే బ్యూరోక్రసీ ఇంకా తక్కువ స్వతంత్రతతో ఉంది. రాజకీయ ప్రత్యర్థుల నోరు నొక్కేందుకు దర్యాప్తు సంస్థలను నేడు తరచుగా ఉపయోగిస్తున్నారు.
మూడవది, ఇందిర వలె మోదీ కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే విధానాన్ని అవలంబించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సమానులలో ప్రథముడిగా ప్రధానిని పరిగణిస్తారు. అమెరికా అధ్యక్షుడి వలె మన ప్రధానికి సర్వాధికారాలు ఉండవు. అన్ని నిర్ణయాలూ ఆయన తీసుకోకూడదు.
తన పాలనలో ఒక్కరి సలహాను మాత్రమే ఇందిర గౌరవించేవారు. మొదట తన కార్యదర్శి పి.ఎన్. హక్సర్, ఆ తర్వాత సంజయ్ గాంధీ. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా హోంమంత్రి అమిత్ షాను మాత్రమే నమ్ముతారు. షా కూడా తన బాస్ వలె పారదర్శకత లేని, నియంతృత్వ పద్ధతులను సమర్థిస్తారు. నాలుగవది, ఇందిర వలె మోదీ కూడా భారతీయ సమాఖ్యవాదాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించారు. ఆర్టికల్ 356ను ఉపయోగించి కాంగ్రెసేతర పార్టీల ప్రభుత్వాలను ఇందిర కూలదోశారు. గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయంగా ఉపయోగించి ఎన్నికైన ప్రభుత్వాలను మోదీ బలహీనపరుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకు, ప్రజా తీర్పును కాలరాస్తూ తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు మోదీ-షా నాయకత్వంలో తమ ఫేమస్ ‘వాషింగ్ మెషిన్’ను (పార్టీ ఫిరాయింపులు) ఎక్కువగా వాడారు.
ఐదవది, ఇందిర వలె మోదీ తన పాలనను బలోపేతం చేయడానికి అతి జాతీయవాదాన్ని రెచ్చగొట్టారు. ఇందిర లాగానే ఆయన కూడా పార్టీ, దేశం, అనుకూల మీడియాను వాడుకొని దేశ ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రతినిధిగా తనను తాను ప్రకటించుకున్నారు. ఎవరైనా విమర్శిస్తే విదేశీ శక్తులతో ప్రేరేపితమైనవిగా ఈ జాతీయవాదం ఆరోపిస్తుంది. గొప్ప దేశ భక్తుడు జయప్రకాశ్ నారాయణ్ పాశ్చాత్య దేశాల ఏజెంట్ అని ఇందిర ఆరోపించారు. ఇప్పుడు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. జార్జ్ సోరోస్ ప్రతినిధి అని బీజేపీ ఆరోపిస్తున్నది.
ఇప్పుడు ఇందిర, మోదీ మధ్య ఉన్న వ్యత్యాసాలను చూద్దాం. ఇరువురు నేతల మధ్య ముఖ్యంగా రెండు భేదాలు ఉన్నాయి. నియంతృత్వ పోకడలు ఉన్నప్పటికీ భాష, మతం, జాతి ఆధారంగా భారత పౌరసత్వాన్ని చూడకూడదని ఇందిర భావించారు. గొప్ప లౌకికవాదిగా పేరొందిన జవహర్లాల్ నెహ్రూ తన హయాంలో ఒక్క ముస్లిం ముఖ్యమంత్రిని కూడా నియమించలేకపోయారు. కానీ, ఇందిర నలుగురిని నియమించారు. అంతేకాదు, ఆమె తన సిక్కు అంగరక్షకులను తొలగించేందుకు నిరాకరించారు. అందుకు ఆమె తన ప్రాణాలను మూల్యంగా చెల్లించారు. కానీ, మోదీ అలా కాదు. తన సహ స్వయంసేవక్‌ల వలె ఆయన హిందూ దేశం నిర్మాణానికి కంకణబద్ధులయ్యారు. మోదీ పాలనలో దేశ రాజకీయాలు, సాంస్కృతిక రీతులు, పాలనాశైలి తదితర అన్ని అంశాలపై రైట్ వింగ్ హిందువులే నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాదు ముస్లింలు, క్రైస్తవులు రెండో శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారు. మోదీ ప్రభుత్వ నినాదం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనేది బూటకమని ఈ పదకొండేండ్ల పాలనలో స్పష్టమైంది. 2014, 2019, 2024 ఎన్నికల్లో పార్లమెంటుకు బీజేపీ పంపించిన 800కి పైగా ఎంపీల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం లేరు. పార్లమెంట్ వెలుపల చూసుకుంటే, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. వారి ఇండ్లను కూల్చడం, వారిని గేలి చేయడం, బలవంతంగా వారిని ఇతర దేశాలకు తరలించడం వంటివి జరుగుతున్నాయి. మోదీ సమర్థకులు, ఒక వర్గం మీడియా ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నాయి.
మతంతో సంబంధం లేకుండా ఈ దేశం అందరిదీ అనే భావన మెజారిటీవాది మోదీ నుంచి ఇందిరను స్పష్టంగా వేరు చేస్తుంది. వీరి మధ్య ఉన్న రెండో వ్యత్యాసం ఇందిరకు అపకీర్తిని తెచ్చిపెట్టింది. ఎమర్జెన్సీ సమయంలో తన కుమారుడు సంజయ్‌గాంధీని వారసుడిగా నియమించడం, 1980లో ఆయన మరణించాక, మరో కుమారుడు రాజీవ్‌గాంధీని వారసుడిని చేయడం ద్వారా ఆమె కాంగ్రెస్ చరిత్ర, వారసత్వానికి విరుద్ధమైన ఒక రాజకీయ ఆచారాన్ని ప్రవేశపెట్టారు.
మనకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూసుకుంటే ఇందిర, మోదీ నియంతృత్వ పోకడలు కలిగిన ప్రధానులు. వారిద్దరిలో ఎవరి పాలన ఎక్కువ అధ్వానంగా ఉంది? వాక్ స్వాతంత్య్రంపరంగా చూస్తే కొన్ని స్వతంత్ర వెబ్సైట్లు, ప్రాంతీయ వార్తాపత్రికలకు నిజాన్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ ఉన్నందున ఇప్పుడు మనం కొంత మెరుగైన స్థితిలో ఉన్నాం. అదే విధంగా రాజకీయంగా విపక్షానికి ఎక్కువగా చోటున్నది. ఎందుకంటే, ఎమర్జెన్సీ సమయంలో ఒక్క రాష్ట్రం మినహా అన్నీ కాంగ్రెస్ పాలనలోనే ఉన్నాయి. కానీ, ఇప్పుడు డజనుకు పైగా రాష్ర్టాలు బీజేపీని వ్యతిరేకించే పార్టీల చేతుల్లో ఉన్నాయి.
2014 నుంచి మన రాజ్యాంగ సంస్థలు అతి రాజకీయ జోక్యం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్యూరోక్రసీ, దౌత్యం ఎక్కువగా రాజీపడింది. ఉన్నత న్యాయవ్యవస్థలో ఈ ధోరణి కొంత తక్కువగా ఉన్నది. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ట్యాక్స్ అథారిటీలు, రెగ్యులేటరీ ఏజెన్సీలు మరింత ఎక్కువగా తమ రాజకీయ యజమానులకు కట్టుబడి ఉన్నాయి. ఎన్నికల కమిషన్ కూడా ఇదే విధంగా ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి.
మోదీ హయాంలో మతోన్మాదం లోతుగా, విస్తృతంగా వ్యాపించింది. ప్రధాని, హోంమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రులు (యూపీ, అసోం), నేతల ప్రసంగాల్లో ఇతర మతాల పట్ల వివక్ష నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఒకనాడు లౌకికవాదానికి మారుపేరైన సాయుధ బలగాలు సైతం హిందూ మతం, హిందూ ఆధిపత్యం పట్ల ప్రజా విధేయతను చూపించాలని పదే పదే కోరే పరిస్థితి వచ్చింది. మెజారిటీవాదం, నియంతృత్వాల కలయిక మోదీ పాలనలో అత్యంత ప్రమాదకరమైన అంశం. ఇది చివరికి ఎంత వరకు వచ్చిందంటే, దీన్ని సరిచేసేందుకు ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత దశాబ్దాలు కూడా పట్టవచ్చు.