ఉద్యమమే ఊపిరిగా పురుడుపోసుకున్న.. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమై నిలిచిన.. ప్రత్యేక తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పోరుసలిపిన.. సబ్బండ వర్గాలను, సకల జనులను కదిలించిన.. ‘నై తెలంగాణ’ అన్నోళ్లతోనే ‘జై తెలంగాణ’ అనేలా చేసిన పార్టీ గులాబీ పార్టీ. ఉద్యమం నాటి నుంచి పునాదులతో సహా పెకిలించాలని, నామరూపాలు లేకుండా చేయాలని చూసినా.. రాజకీయ ప్రలోభాలతో బలహీనపరచాలని కుట్రలు పన్నినా.. వాటన్నింటినీ తట్టుకుని తన వ్యూహాలతోనే తెలంగాణను సాధించిన పార్టీ బీఆర్ఎస్. ఒక్కమాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణే లేదు.
తెలంగాణ అస్తిత్వ ప్రతీక బీఆర్ఎస్పై మరోసారి కుట్రలు జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఉద్యమ పార్టీ చెక్కు చెదరకపోవడం, సంస్థాగతంగా మరింత బలోపేతంగా మారుతుండటంతో ‘విలీన’ కుతం త్రం తెరపైకి వస్తున్నది. మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, వారి కుట్రలకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. వారు ఎన్నివిధాలుగా విష ప్రచారం చేస్తున్నా ప్రజలు ఉద్యమ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. రెండు జాతీయ పార్టీల కుట్రలను తిప్పికొడుతున్నారు.
గులాబీ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. అది అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుం ది. మొన్నటికి మొన్న మేడిగడ్డ కుంగిందని సాకులు చెప్తూ కాంగ్రెస్ పాలకులు గోదావరి జ లాలను సముద్రం పాలుచేస్తుంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించి కాళేశ్వరం జలాల ఎత్తిపోత షురూ చేయించారు. ఈ విధంగా పదునైన ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ప్రజాపక్షం వహిస్తూ.. పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తుండటంతోనే విలీనమంటూ కొంతమంది ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
పది ఎంపీ స్థానాలివ్వండి, తెలంగాణ శక్తి ఏమిటో చూపిస్తానని పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్ పదే పదే చెప్పారు. అప్పుడు ఆయన మాటలను తెలంగాణ సమాజం సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఫలితంగా కేంద్ర బడ్జెట్లో మన కు తీవ్ర అన్యాయం జరిగింది. రెండు జాతీయ పార్టీలను నెత్తిన పెట్టుకున్నా తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. 16 మంది ఎంపీలున్నా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జేడీయూల అండతో సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన మోదీ.. ఏపీ, బీహార్‌లకు కాసుల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ను కాదనుకొని మనల్ని మనమే మోసం చేసుకున్నామని దీన్నిబట్టే అర్థం చేసుకోవాలి. నాడైనా, నేడైనా, భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ పార్టీయే. మరోవైపు ‘కేంద్రం తో సఖ్యతగా లేకుంటే నిధులెలా వస్తా యి?’ అని అప్పట్లో రాద్ధాంతం చేసిన రేవంత్.. సీఎం అయ్యాక మోదీని పెద్దన్నగా సంబోధిస్తూ భుజానికెత్తుకున్నారు. అయినప్పటికీ శూన్యహస్తమే మిగిలింది. రెండు జాతీయ పార్టీల లక్ష్యం అధికారమే తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాదు. ప్రాంతీయ పార్టీల్లో బలమైన శక్తిగా ఉన్న బీఆర్ఎస్ను ఎదగనీయకుండా చేయాలన్నదే రెండు పార్టీల కుట్ర. అయినా కేసీఆర్‌కు ఇలాంటి కుట్రలను ఎదుర్కోవడం కొత్తేం కాదు. సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దిన నాయకత్వం కేసీఆర్‌ది.
తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ అధికారానికి దూరమవడంతో అవకాశవాదులు తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు మళ్లీ ఉవ్విళ్లూరుతున్నారు. పదేండ్లలో విశ్వనగరంగా మారిన హైదరాబాద్, సహజ సంపదల గని తెలంగాణపై కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణలో టీడీపీ పూర్వవైభవం కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు మాటలే అందుకు నిదర్శనం. ఇప్పటికైనా తెలంగాణవాదులు సంఘటితం కావాలి. లేదంటే అవకాశవాద రాజకీయాలకు తెలంగాణ వేదికగా మారే ప్రమాదం ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర సాధనే తన అంతిమ లక్ష్యమంటూ, త్యాగానికి సిద్ధపడి తెలంగాణను కేసీఆర్ సాధించారు. అరిగోస పడి సా ధించుకున్న తెలంగాణను పాలకుడిగా సుసంపన్నం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లలా పరుగులు తీయించారు. త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరిగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా సాగుతున్న కేసీఆర్ నాయకత్వంపై దుష్ప్రచారం చేసి, అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ పాలకులు ఇప్పుడు మరిచారు. నాడు రారాజులా బతికిన రైతులు నేడు తిప్పలు పడుతున్నారు. వరికి బోనస్ బోగస్‌గా మారింది. రుణమాఫీ మాయాజాలంతో లక్షల మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతీ పల్లె కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నది.
కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయిన సాధారణ ప్రజలే కాదు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు. మోత్కుపల్లి నర్సింలు, బక్క జడ్సన్ సహా చాలామంది నేతలు కేసీఆరే తెలంగాణ రక్షకుడని చెప్తున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేసిన కొందరు ఇప్పుడు కేసీఆర్‌ను తల్చుకుంటున్నారు. నాడు కాంగ్రెస్ రెచ్చగొట్టిన నిరుద్యోగులే నేడు ఆ పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజాభవన్ ముందు కంచెలు తొలగించామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ సర్కార్ నేడు తెలంగాణ అంతటా పదునైన ముళ్ల కంచెలను వేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను కాదనుకొని తప్పు చేశామనే భావన సబ్బండ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
ఈ నేపథ్యంలో అవకాశవాదులకు తెలంగాణలో చోటిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుంది. వ్యక్తులను మోసే పార్టీలకు కాకుండా.. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే బీఆర్ఎస్ను ఆదరించాల్సిన అవసరమున్నది. తెలంగాణ ఉనికికి, అస్తిత్వానికి ముప్పు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సబ్బండవర్గాలు కేసీఆర్ వెంట నడవాలి.