వినాశకరమైన వాతావరణ మార్పుల నుంచి భూ గ్రహాన్ని రక్షించేందుకు ఐక్య రాజ్య సమితి నేతృత్వంలో ప్రపంచం ముందుకు కదిలింది. ‘మిషన్ లైఫ్ (పర్యావరణం కోసం జీవన విధానం)’ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమం విజయవంతమైతేనే భవిష్యత్తులో మనిషి మనుగడ సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని ప్రపంచ ప్రజలందరూ గుర్తించి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
వాతావరణ మార్పుల ప్రభావం విధానపరమైన సమస్య తప్ప వ్యక్తిగత బాధ్యత కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉండటం వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతున్నది. కొన్ని దేశాల వల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసం ఫలితాలను అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి. మానవాళి తన అవసరాల కోసం సహజ వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నది. వాయు కాలుష్యాన్ని పెంపొందిస్తున్నది. దీని వల్ల భూతాపం, ఏడారీకరణ వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తమ జీవన శైలిని పర్యావరణ హితంగా మార్చుకుంటే తప్ప వాతావరణ మార్పులను అరికట్టడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిషన్ లైఫ్ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. సులువుగా, సమర్థవంతంగా ఉండే పర్యావరణ హితమైన పనులు చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించడం, మారుతున్న డిమాండ్‌కు తగినట్లు వేగంగా స్పందించేలా పరిశ్రమలు, మార్కెట్లను ప్రోత్సహించడం, సుస్థిర వినియోగానికి, ఉత్పత్తికి మద్దతునిచ్చే విధానాలను రూపొందించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం మిషన్ లైఫ్ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు.
రీయూజ్-రెడ్యూస్-రీసైకిల్ విధానం భారతీయ సంస్కృతిలో భాగం. కానీ కొన్ని దశాబ్దాలుగా మనం ఆ విధానానికి తిలోదకాలిచ్చాం. అందుకే వాతావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాం. వాతావరణ మార్పుల ప్రభావం అనుభవించిన తర్వాత కానీ మన దేశం మేల్కొనలేదు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక సూర్యుడు -ఒక ప్రపంచం – ఒకే గ్రిడ్ అనే కార్యక్రమాన్ని ప్రపంచం ముందుంచింది. చాలా దేశాలు ఈ విషయంలో భారత్ కృషిని ప్రశంసించాయి. ఈ వ్యూహంలో భాగస్వామ్యం కావటానికి కొన్ని దేశాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. అయితే విధాన పరంగా భారత ప్రభుత్వ ప్రతిపాదనలు బాగానే ఉన్నా కార్యాచరణలో మాత్రం వెనుకబడి ఉంది. పర్యావరణ పరిరక్షణలో అడవులు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అటవీ చట్టానికి చేపట్టిన సవరణలు చూస్తే దేశ విస్తీర్ణంలో 33 శాతం అడవుల కొనసాగింపు అనే విషయం అసాధ్యమని స్పష్టం అవుతున్నది. పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే ప్లాస్టిక్ ఉత్పత్తుల విషయంలో ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విషయంలో భారత్ ఇంకా ఉదాసీనంగానే ఉంది. ఈ ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా వాస్తవంలో ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. నీటి కాలుష్యం కూడా ఎక్కువ అవుతున్నది. కర్బన ఉద్గారాలను కూడా నిర్దేశించుకున్న స్థాయికి కట్టడి చేయలేకపోయాం. ప్రపంచంలోని చాలా దేశాల్లో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి.
ఈ భూమి ప్రపంచ ప్రజలందరిదీ. మనం ఈ భూమిపై సురక్షితంగా మనుగడ సాగించాలన్నా, భావి తరాల వారికి భూమి నివాస యోగ్యంగా ఉండాలన్నా తక్షణమే పర్యావరణ అనుకూలమైన జీవన విధానాన్ని అవలంబించాలి. ప్రకృతి పట్ల మనం చూపే ప్రేమ, సంప్రదాయాలకు సాంకేతికత జోడించాలి. ప్రభుత్వాలు కూడా పర్యావరణ అనుకూలమైన విధానాలను, పథకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి.
రుద్రరాజు శ్రీనివాసరాజు: 94412 39578