పాకిస్థాన్ ప్రేరేపిత జీహాదీ ఉగ్ర మూకలు పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపడంపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 370వ అధికరణం రద్దు తర్వాత ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్ పర్యటనకు వస్తూ అక్కడి ప్రజలతో మమేకం కావడాన్ని జీర్ణించుకోలేని ఇస్లామిక్ మతఛాందస జీహాదీ శక్తులు పథకం ప్రకారం పర్యాటకులను కాల్చిచంపడం కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే. ఈ దుర్మార్గపు చర్యతో భారత్‌లో మళ్లీ హిందూముస్లిం మత విభజన తేవడం పాక్ సైనిక పాలకుల పన్నాగం. 77 ఏండ్ల కిందట భారత్, పాకిస్థాన్‌లుగా విడిపోయినా పాక్ పలుమార్లు మత విద్వేష విషం కక్కుతూ యుద్ధాలకు, దురాక్రమణలకు పూనుకున్న దృష్టాంతాలెన్నో.
భారత్‌ను గుడ్డిగా ద్వేషించే పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిఫ్ మునీర్ పహల్గాం మారణకాండకు కారకుడని రూఢీగా తెలుస్తున్నది. పాక్‌లో పేరుకే ప్రజాస్వామ్యం. అయితే నిజమైన అధికారం చెలాయిస్తున్నది పాక్ ప్రధాన దండ నాయకులేనని తెలిసిందే. పాక్ ఏర్పడిన 77 ఏండ్లలో 3 దశలలో 33 ఏండ్ల పాటు వీరే ప్రభుత్వాలను కూలదోసి, పాలనా యంత్రాంగంపై పట్టు బిగించి నిరంకుశ రాజ్యం చెలాయించింది. మిగతా సంవత్సరాలలో పేరుకే పౌర ప్రభుత్వాలే కానీ, అంతిమ అధికారం సైన్యం గుప్పిట్లోనే ఉంది. ఎవరైనా ధిక్కరిస్తే వారి గతి అంతే.
మునుపటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వ నిర్ణయాలే అంతిమం అని గట్టిగా నిలిస్తే 2022లో కుట్ర ద్వారా ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూల్చి, ప్రత్యర్థులైన నవాజ్ షరీఫ్ ముస్లిం లీగ్, పాక్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టోలతో కొత్త కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ కీలక పాత్ర పోషించాడు. ఇమ్రాన్‌ఖాన్ బహుళ జనాదరణ కలిగిన నేత. కానీ ఆసిఫ్ మునీర్ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, సైనిక నిఘా విభాగం రెండింటికీ డైరెక్ట్టర్ జనరల్‌గా వ్యవహరిస్తూ తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ఇమ్రాన్ ఖాన్ సతీమణి బుష్రా బీబీ అక్రమంగా డబ్బు, వజ్రాలు, స్వర్ణాభరణాలు సంపాదించిన చేదు నిజం ప్రధాని దృష్టికి తేవడంతో ఆగ్రహించిన ఇమ్రాన్‌ఖాన్ మునీర్‌ను పదవి నుంచి తొలగించడంతో ఇరువురి మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఆరంభమైంది. ఖురాన్‌ను కంఠస్థం చేసిన మునీర్ దేశంలో మత రాజకీయాలను ఎగదోయడం ప్రారంభించారు. ఈ విషయంలో ఇస్లామిక్ సైన్యాధ్యక్షుడిగా ఉండిన జనరల్ జియావుల్ హక్ మునీర్‌కు స్ఫూర్తి. పాకిస్థాన్ ఇప్పటికే అనేక రంగాల్లో తీవ్ర ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటూ, దివాలా స్థితిలో ఉన్నది. ఈ దుస్థితి నుంచి పాక్ ప్రజల దృష్టిని మళ్లించడానికే జనరల్ మునీర్ పహల్గాంలో లష్కరే తోయిబా జీహాదీ తీవ్ర వాదులను అమాయక విహార యాత్రికులపై దాడికి ఉసిగొల్పి భీతావహ పరిస్థితి సృష్టించారని తెలుస్తున్నది. ద్విజాతి సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకొని హిందువులు-ముస్లింలు ఎప్పటికీ ఏకీకరణం కాలేరనే దుర్మార్గ వాదన వినిపిస్తూ భారత్‌లో విద్వేషాలు రెచ్చగొట్టే పథకం వేశారు. మతాన్ని, రాజకీయాలను మత ఉగ్రవాదాన్ని జోడించి ఎన్నటికీ సయోధ్య కుదరని స్థితికి తెచ్చారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టుపై పాక్ సైన్యంలో విభేదాలున్నా అసమ్మతిని మునీర్ కఠినంగా అణచివేశాడు. దేశ విభజన జరిగినప్పుడు మునీర్ తండ్రి టీచర్. సయ్యద్ సర్వర్ పాక్‌కు వచ్చి రావల్పిండిలో స్థిరపడ్డారు. అక్కడి మదర్సాలో మునీర్ చదివాడు. ఆ తర్వాత పాక్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొంది ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో అధికారి అయ్యాడు. కుట్ర ద్వారా ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించాక, షాబాజ్, నవాజ్ షరీఫ్ సోదరులు పాక్ సైన్యాధ్యక్షుడిగా మునీర్‌ను ఆమోదిస్తూ సంతకం చేయక తప్పలేదు. జనరల్ మునీర్ ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నా త్రివిధ దళాల అధిపతుల పదవీకాలాన్ని మూడు నుంచి ఐదేండ్లకు పెంచుతూ పార్లమెంటు తీర్మానించడంతో 2027 వరకు మునీర్ కొనసాగడం ఖరారైంది.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో అంతర్గత అసమ్మతి, ఉగ్రవాద శక్తులు చెలరేగిపోవడంతో, తీవ్ర ఆర్థిక దుస్థితి నెలకొన్నది. ప్రజలు కొనుగోలు శక్తి క్షీణించి దివాలా స్థితిలో ఉన్నా, పాక్ పాలకులు జీహాదీ మత భావనలు ప్రేరేపించి కశ్మీర్లో భారత్‌పై దాడులకు కుట్రలు కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. పహల్గాంలో కొందరు జిహాదీ ఉగ్రవాదుల మారణకాండ తర్వాత భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది.
పహల్గాం మారణకాండ జరిగినప్పుడు కశ్మీర్ పౌరులు అపూర్వంగా స్పందించి యాత్రికులకు ఆశ్రయం, రక్షణ కల్పించి ఆదుకోవడం ప్రశంశనీయం. మతోద్రిక్తతలు రెచ్చగొట్టే కుతంత్రాల ప్రభావానికి లొంగకుండా మానవీయ దృష్టిలో స్పందించి కులం, మతం, ప్రాంతం ఏవైనా తామంతా భారతీయులమని చాటారు.
ఈ పరిస్థితుల్లో దేశరక్షణ, ప్రాదేశిక సమగ్రత, సమైక్యత, ప్రజల్లో దేశభక్తి భావనలు పెంపొందించాలి. ముఖ్యంగా ప్రజల్లో మత విద్వేష భావనలు రెచ్చగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం కావాలి. ప్రజల ఐక్యతే దేశ రక్షణకు శ్రీరామరక్ష.
– పతకమూరు దామోదర్ ప్రసాద్ 94409 90381