తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ‘వాటర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ’ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. చరిత్రలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఒక తరం భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ రోజు ఈ రెండు రాష్ర్టాలు అలాంటి కీలక మలుపు వద్ద నిల్చున్నాయి. ఆకాశంలో మేఘాలు కనిపించడం లేదు. పొలాల్లో పచ్చదనం లేదు. చెరువుల్లో నీరు లేదు. రైతు కండ్లల్లో ఆశ కనిపించడం లేదు. రాజకీయాల్లో కూడా ఎలాంటి మార్పూ లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఎన్నికల లెక్కలు, అధికార పోరాటాలే ప్రధాన చర్చలుగా కొనసాగుతున్నాయి. కానీ రైతు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. ‘వర్షం పడకపోతే నేను బతకడం ఎలా?’ ఈ ప్రశ్నకు ఇప్పటివరకు ఏ పాలకుల నుంచీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. ఇది కేవలం కరువు కాదు… నాగరికతకు వస్తున్న హెచ్చరిక.
తెలంగాణలో రైతులు విత్తనాల సంచులు తెరిచి ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. వేలాది ఎకరాల్లో సాగు ప్రారంభం కాలేదు. గ్రామాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. అటు హైదరాబాద్‌లో పరిస్థితి కూడా భిన్నంగా లేదు. భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. వేలాది కుటుంబాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. ఒకప్పుడు నగరానికి నీటిని సరఫరా చేసిన చెరువులు, వాగులు ఇప్పుడు నగర విస్తరణకు బలైపోయాయి. మనం ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నీళ్లు అందించే నగరం.. నీళ్లు కొనుక్కునే నగరంగా ఎలా మారింది? ప్రకృతి మనపై కోపంగా లేదు.. మనమే ప్రకృతిని మరచిపోయాం. ఈ సంక్షోభానికి కారణం ఒక్క వర్షాభావం కాదు. ఐదు దశాబ్దాలుగా వర్షపు నీటిని భూమిలో నిల్వ చేయకుండా, భూగర్భజలాలను మాత్రం విచ్చలవిడిగా వినియోగించాం. చెరువులను పూడ్చేశాం. వాగులను ఆక్రమించాం. అడవులను నరికేశాం. నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలను విస్తరించాం. ఒకప్పుడు ప్రతీ గ్రామంలో కనిపించే చిన్న కుంటలు, మట్టి గుం తలు, వర్షపు ప్రవాహ మార్గాలు, సహజ జలమార్గాలు నేడు కనుమరుగైపోయాయి. ప్రకృతి మా త్రం ఈ లెక్కలను ఎప్పుడూ మర్చిపోదు. ఇప్పు డు అదే లెక్కను మన ముందు ఉంచుతున్నది.
ఇది వర్షాభావం కాదు..‘వాటర్ గవర్నెన్స్’ వైఫల్యం. ఇజ్రాయెల్‌లో మనకంటే చాలా తక్కువ వర్షం పడుతుంది. అయినా అక్కడ ప్రతి నీటిబొట్టునూ రెండుసార్లు ఉపయోగిస్తారు. సింగపూర్‌లో సహజ నీటి వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి. అయినా ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థను నిర్మించింది. ఆస్ట్రేలియా ఎన్నో కరువులను ఎదుర్కొన్నది. అయినా వాటిని శాస్త్రీయ ప్రణాళికలతో అధిగమించింది. ఈ దేశాలు నీటిని రాజకీయ అంశంగా కాకుండా జాతీయ భద్రతా అంశంగా చూశాయి.
రైతు కోసం కొత్త వ్యవసాయ విధానం అవసరం. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రైతులకు చెప్పే సలహా ఒక్కటే-‘కొన్నిరోజులు ఆగండి… వర్షం వస్తుంది’ అని. ఇది సలహా కాదు. నిర్లక్ష్యం. వర్షం ఆలస్యమైతే ఏ పంట వేయాలి? ఎంత విస్తీర్ణంలో వేయాలి? ఎంత నీరు అవసరం? ప్రత్యామ్నాయ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ సమాచారం ప్రతి రైతు మొబైల్‌కూ చేరాలి. మండలానికొక వాతావరణ, వ్యవసాయ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌కు ట్యాంకర్లు కాదు… కొత్త నీటి సంస్కృతి కావాలి. ట్యాంకర్ అనేది శాశ్వత పరిష్కారం కాదు. ప్రతి భవనంలో పనిచేసే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఉండాలి. శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమలు, ఉద్యానవనాలు తప్పనిసరిగా వినియోగించాలి. చెరువులను పునరుద్ధరించాలి. భూగర్భ జలాల వినియోగాన్ని డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించాలి. ‘వాటర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ’ ప్రకటించాలి. ప్రతి వారం నీటి నిల్వలు, భూగర్భ జలాల స్థాయిపై ప్రజలకు అధికారిక సమాచారం ఇవ్వాలి. ప్రతి జిల్లాకు ప్రత్యేక కరువు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. తక్కువ నీటితో సాగయ్యే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పశుగ్రాస పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
ప్రతి గ్రామానికి వాటర్ బడ్జెట్ రూపొందించాలి. గ్రామానికి ఎంత వర్షం పడుతుంది? ఎంత నీరు నిల్వ చేయవచ్చు? ఎంత వినియోగించాలి? అనే లెక్కలు ప్రజల ముందు ఉంచాలి. ఫామ్ పాండ్లు, రీఛార్జ్ పిట్స్, చెక్‌డ్యామ్‌లు, పర్క్యులేషన్ ట్యాంకులు, కాంటూర్ ట్రెంచ్‌లు వంటి నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. భూగర్భ జలాల వినియోగంపై కఠిన చట్టాలు తీసుకురావాలి. ప్రతి నగరంలో శుద్ధిచేసిన మురుగునీటి పునర్వినియోగాన్ని తప్పనిసరి చేయాలి.
ప్రతి ప్రభుత్వ భవనంలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నదో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. చెరువులు, వాగుల ఆక్రమణలను అత్యంత తీవ్రమైన పర్యావరణ నేరంగా పరిగణించాలి. ముఖ్యమంత్రి అధ్యక్షతన క్లయిమేట్ వాటర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి, నీటి నిర్వహణను అన్ని శాఖల సమన్వయంతో అమలు చేయాలి. రాజకీయ నాయకులకు ఒక ప్రశ్న.. మీ నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? వాటిలో ఎన్ని పునరుద్ధరించారు? ఎన్ని రీఛార్జ్ బావులు నిర్మించారు? ఎన్ని వర్షపు నీటి సంరక్షణ పనులు పూర్తయ్యాయి? ప్రజలు ఇకపై ఈ ప్రశ్నలనే నేతలను అడగాలి. ఎందుకంటే తాగునీరు లేకపోతే అభివృద్ధి ఉండదు. సాగునీరు లేకపోతే వ్యవసాయం ఉండదు. వ్యవసాయం లేకపోతే గ్రామాలు నిలువవు. గ్రామాలు లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది ఉండదు.
చివరి మాట: ఈ దేశంలో ప్రభుత్వాలు మారుతాయి. రాజకీయ పార్టీలు మారుతాయి. ఎన్నికలు వస్తుంటాయి. కానీ ఒక విషయం మాత్రం మారదు. వర్షం కురిసే రోజే వచ్చే ఏడాది నీటిని సేకరించాలి. ప్రకృతి ప్రతి ఏడాది మనకు ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాన్ని కోల్పోతే, మన పిల్లలు ట్యాంకర్ల కోసం క్యూలో నిలబడే భవిష్యత్తును వారసత్వంగా పొందే ప్రమాదం ఉన్నది. అప్పుడు చరిత్ర మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. ‘వాతావరణ మార్పు గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నప్పుడు.. మీరు రాజకీయాలు చేశారు. కానీ నీటిని ఎందుకు కాపాడలేదు? ‘ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది రేపటి తరం కాదు. నేటి సమాజం.. మన పాలకులు. అదీ.. ఈ రోజే.. ఇప్పుడే.
– శ్యాంమోహన్