కొందరు అల్పబుద్ధులకు నిజం నచ్చకపోవచ్చు. అద్దం అబద్ధం చెప్పదు. లెక్కలు రోజుకో వేషం వెయ్యవు. రెండు రెండ్లు ఎప్పుడూ నాలుగే. కేసీఆర్ అనే మూడక్షరాలు తెలంగాణ సాధించిన ఘనచరిత్రకు ఆనవాలు. పదేండ్ల ప్రగతి పరుగులకు చేవ్రాలు. అద్దాల మేడల్లో కులుకుతున్న రాజకీయ మరుగుజ్జులు అజ్ఞానంతో రాళ్లు విసురుతున్నారు. పిదపబుద్ధులు అహంకారంతో పేలుతున్నారు. కేసీఆర్ అనే పేరు వారికి నిత్య పారాయణం. పొద్దున లేస్తే ఆ పేరు చెరిపేస్తా, మరిపిస్తా అని కుప్పి గంతులు. పాపం వారిది వైరభక్తి. కేసీఆర్ నామజపం లేకుండా వారికి పూటైనా గడవదు. వారు ఎంతగా వాచాలత చూపిస్తుంటే కేసీఆర్ అం తగా బలపడుతున్నారు. ఈ గడ్డ మీద ప్రజాభిమానంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటున్నారు. ఆయన పదేండ్ల పాలనను జనం పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. చివరికి సర్కారు స్వయంగా వెల్లడించిన గణాంకాలూ కేసీఆర్‌కే జై కొడుతున్నాయి. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంక నివేదిక 2024 అందుకు తాజా ఉదాహరణ.
బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిలో రాష్ట్రం వేసిన అంగలకు అది దివి టీ పట్టింది. రాష్ట్ర సాధకుడే ప్రగతి రథ చోదకుడైతే, అందునా అద్వితీయ దార్శనికుడైతే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. స్వరాష్ట్రం సాధించి కేసీఆర్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన 2014 ప్రాంతం నుంచి 2024 మధ్యన గల పదేండ్ల కాలంపై తెలంగాణ ప్రణాళికా విభాగం రూపొందించిన నివేదిక అందుకు అద్దం పట్టింది. రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా ఆ నివేదికను విడుదల చేశారు. ఆ పదేండ్లలో రాష్ట్ర జీఎస్డీపీ దాదాపు 200 శాతం పెరుగుదల నమోదు చేసింది. తలసరి ఆదాయం జాతీయ తలసరిలో రెట్టింపైంది. సాగుకు సంపూర్ణంగా అండదండలు అందించి దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు కేసీఆర్. ఆయన నేతృత్వంలో పంటల విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2023-24 నాటికి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక కేసీఆర్ విజయ గీతికలా తయారవడం విశేషమే మరి.
ఇవన్నీ బీఆర్ఎస్ ప్రచార విభాగం విడుదల చేసిన లెక్కలు కావు. పదేండ్లలో అభివృద్ధి జరిగింది. అది దేశవ్యాప్తంగా మన్ననలు అందుకున్నది. విశ్వవీధుల్లో విజయ పతాకను ఎగరేసింది. నామరూపాల్లేకుండా చేస్తాం, బహిష్కరిస్తాం అని ఎగిరెగిరి పడుతున్నవారికి ఈ లెక్కలు గొంతులో పచ్చి వెలక్కాయలే. ఆకాశం మీదకు దుమ్మెత్తి పోయాలనుకునే నోటి దురుసు వీరులకు భంగపాటే. కేసీఆర్ వైభవోజ్వల పాలనకు మసిపూయాలనుకునే వారికి ఈ నివేదిక ఓ చెంపపెట్టు. తెలంగాణ నిలిచి గెలిచింది. ఆ కీర్తి కిరీటం కేసీఆర్‌కు కాక మరెవరికి దక్కుతుంది? కేసీఆర్ మా నేత.. అభివృద్ధి ప్రదాత అని గుండెల్లో నిలుపుకొన్న ప్రజలను అడిగితే తెలుస్తుంది. చెరిపేస్తే చెరిగిపోయేందుకు కేసీఆర్ అనేది గోడమీది రాతకాదు. శిలాక్షరం. సువర్ణాక్షరం. కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి నికార్సైనది. ఇది దాచేస్తే దాగని సత్యం. కేసీఆర్ జన్మదిన సంబురాలు జరుపుకొన్న ప్రజలే అందుకు నిదర్శనం. నిప్పులాంటి ఆ సత్యం జయిస్తుంది అనునిత్యం.