తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం, పార్టీ మ్యానిఫెస్టోను అటకెక్కించటంలో ప్రధాని మోదీ మార్గంలో దూసుకెళ్తున్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మ్యానిఫెస్టో ద్వారా ప్రకటించి, తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చింది. తీరా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రధానిగా ఇచ్చిన ఆ హామీని తూచ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘పార్టీ’ ఫిరాయింపుదారులు అనర్హులయ్యేలా చట్ట సవరణ చేస్తామని రాజ్యాంగ ప్రతి సాక్షిగా హామీ ఇచ్చారు రాహుల్‌గాంధీ. తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి తూచ్ అంటున్నారు. వరుసబెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటున్నారు. తన హామీని, కాంగ్రెస్ మ్యానిఫెస్టోను అటకెక్కించిన రేవంత్ నిర్ణయాలను రాహుల్‌గాంధీ ఏ మాత్రం ఖండించడం లేదు. అంటే బీజేపీ, కాంగ్రెస్ దొందూ, దొందేనని రాహుల్‌గాంధీ చెప్పదలచుకున్నారా?
జవహర్లాల్ నెహ్రూను కించపరుస్తూ ప్రధాని మోదీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరుస్తూ సీఎం రేవంత్ గొప్పవాళ్లుగా భాసించగలమని భ్రమిస్తున్నారు. ఈ మూడు సార్లే కాదు, మరో మూడు సార్లు ప్రధాని ఐనా నెహ్రూలా మోదీకి, మరో పదిసార్లు సీఎం అయినా కేసీఆర్‌లా, రేవంత్‌కు ప్రజల హృదయాల్లో చోటు దక్కదు గాక దక్కదు. ఎందుకంటే నెహ్రూ, కేసీఆర్‌లు తమ లక్ష్యసాధనంగా రాజకీయాన్ని మలచుకున్నవాళ్లు. ఉదాహరణకు హిరాకుడ్, భాక్రానంగల్ వంటి భారీ ఆనకట్టలతో వ్యవసాయ అభివృద్ధికి.. ఖిలాయ్ రూర్కెలా, ఉక్కు కర్మాగారాలతో పారిశ్రామికాభివృద్ధికి దృఢమైన పునాది వేసి, అలీన విదేశాంగ విధానం ద్వారా భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చి భారతీయుల హృదయాలలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు నెహ్రూ. దటీజ్ భారత రత్న జవహర్లాల్ నెహ్రూ.
‘మిషన్ కాకతీయ’తో ఆకలి తెలంగాణను అన్నపూర్ణగా ‘భారత ధాన్యాగారం’గా రూపొందించారు కేసీఆర్. ఎడ్యుకేషనల్ హబ్, వేల గురుకులాలతో తెలంగాణ విద్యాభివృద్ధికి.. ఐటీ హబ్ ద్వారా పారిశ్రామికాభివృద్ధికి… హరితహారాలతో హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, యాదాద్రిని అద్భుత శిల్పకళా క్షేత్రంగా, అపర తిరుమలగా… అటవీ పునరుద్ధరణ ద్వారా వర్షాభావ, కాలుష్యరహిత తెలంగాణను కేవలం దశాబ్దకాలంలో తలసరి ఆదాయంలో భారతాగ్ర రాష్ట్రంగా తెలంగాణను రూపొందించిన లక్ష్యసాధకుడు తెలంగాణ పిత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. మరో ముఖ్యాంశమేమంటే, ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన తెలంగాణ పితను వల్గర్‌గా, కఠోరంగా దూషిస్తే ప్రజల దృష్టిలో హీరోనౌతానన్న భ్రమలో ఉన్నట్లున్నారు రేవంత్. కానీ, జాతిపితను హతమార్చిన గాడ్సేలా అపఖ్యాతి పాలౌతారన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి.
పాలన పట్ల, రాష్ట్ర ప్రగతి పట్ల దృష్టిసారించవలసిన రేవంత్ బ్లాక్‌మెయిలింగ్ ప్రలోభాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పీక్కోవటమే ఎజెండాగా పెట్టుకున్నారు. పైగా నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కుంటే తప్పుకానిది, నేను బీఆరెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటే తప్పేమిటని దబాయిస్తున్నారు. అవకాశవాద మేధావులు, మీడియావాళ్లు ఆయనతో గొంతుకలపటం మరింత దురదృష్టం.
కానీ, నాటి చారిత్రక వాస్తవాలను ఒకసారి పరిశీలిద్దాం.. తెలంగాణ శిశువును శక్తివంతంగా తీర్చిదిద్దుకోవాలన్నదే కేసీఆర్ ఏకైక లక్ష్యం. సదరు లక్ష్యాన్ని నిరాటంకంగా కొనసాగించాలంటే..? 1. శత్రువులు ఏకమై తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ మాత్రం అవకాశం లేనంతగా దాన్ని పటిష్ఠపరుచుకోవటం. ఉదాహరణకు చంద్రబాబు-రేవంత్‌ల ఓటుకు నోటు వ్యవహారం, వగైరా. 2.ఉద్యమకారులనే మంత్రులుగా తీసుకుని వాళ్లకు శిక్షణనివ్వటం ద్వారా కాలహరణమౌతుంది కనుక, ఇతర పార్టీల వారైనా కొందరు అనుభవజ్ఞులను మంత్రులుగా నియమించుకోవటం. తద్వారా తన లక్ష్య సాధనను వేగవంతం చేయటం. 3.నాటి చీకటి తెలంగాణలో వెలుగులు నింపాలన్న తపనతో ఖర్చుకు వెనకాకుండా తక్షణం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనటం. 4.వర్షాభావంతో, సాగునీరు లేక బోరులెండి, విద్యుత్తు కొరతతో ట్రాన్స్ఫార్మర్లు కాలి, పంట చేలు ఎండి, దిక్కుతోచక రైతులు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడటాన్ని అరికట్టాలన్న దీక్షతో, అప్పుచేసి మరీ 90 వేల కోట్లతో, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందిన కాళేశ్వరాన్ని కేవలం మూడేండ్లలో పూర్తిచేయటం ఆయన లక్ష్యసాధనా వేగానికి నిలువెత్తు నిదర్శనాలు. నాడు సోషలిస్టు శిశువును బలోపేతం చేసుకునే వెసులుబాటు కోసం ఫాసిస్టు హిట్లరుతో కొంతకాలం రాజీ చేసుకున్నాడు రష్యాధినేత స్టాలిన్. అలాగే తెలంగాణ శిశువును ఎక్కదీసుకునే వెసులుబాటు కోసం కేంద్రంలోని కార్పొరేట్ బీజేపీతో స్నేహపూర్వకంగా మెలిగారు కేసీఆర్. నాడు తన రష్యా భద్రత కోసం హిట్లర్‌తో రాజీ పడ్డందుకు ప్రపంచం దుమ్మెత్తిపోస్తున్నా లెక్కచేయలేదు స్టాలిన్. అలాగే ప్రగతి నిరోధక బీజేపీతో రాజీ పడ్డాడంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసినా లెక్కచేయలేదు కేసీఆర్. అర్జునునకు తాను గురిపెట్టిన పక్షి తప్ప, మరేవీ కనిపించనట్టు, లక్ష్య సాధకులకు తమ లక్ష్యమే తప్ప ఇంకేవీ కనిపించవు, వినిపించవు. తన అధికార పదవీ భద్రత కోసం, రేవంత్ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపుల అక్రమాన్ని, తెలంగాణను శీఘ్రంగా సుసంపన్నం చేయాలన్న లక్ష్యంతో చేసిన కేసీఆర్ చర్యతో పోల్చి సమర్థించటం రాహుల్‌గాంధీని, కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఘోరంగా అవమానపర్చటమే.
కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప ఎవరూ లేకుండా బీఆర్ఎస్ను ఖాళీ చేస్తానంటూ సవాల్ విసురుతున్న రేవంత్‌రెడ్డి విస్మరిస్తున్న వాస్తవాలు రెండున్నాయి. 1.పడినా తిరిగి ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం బీఆర్ఎస్. 2.పడగొడితే రేపటి కల్లా మరింత ఎత్తుగా, అందంగా తన గూటిని అల్లుకోగలిగిన సాలీడంత ఓర్పు, నేర్పు గల ఉద్యమనేత కేసీఆర్.