ఢిల్లీ మహా నగరంలోని వీధి కుక్కలన్నిటినీ తక్షణమే షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వును మార్చుకోవడం జంతు ప్రేమికులకు సంతోషం కలిగించింది. కానీ, ఈ కేసుకు మూలమైన చిన్నారి ఛవీ మరణం వల్ల తీవ్ర ఆవేదనకు గురైన ఆమె కుటుంబసభ్యులకు మాత్రం అసంతృప్తిని మిగిల్చింది. ఒకరకంగా ఇది కుక్కల బెడదతో సతమతమయ్యే సామాన్యుల మనోభావాలకు కూడా దగ్గరగా ఉన్నదని చెప్పవచ్చు. ఢిల్లీలో ఆరేండ్ల ఛవీ వీధిలోకి వెళ్లినప్పుడు కుక్కలు దాడిచేశాయి.
చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఈ ఘటనతో కలత చెందిన జస్టిస్ పార్ధీవాలా నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా కేసును స్వీకరించింది. గత ఆగస్టు 11న ఈ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఢిల్లీలోని వీధికుక్కలన్నింటినీ ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగాలని ఢిల్లీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీనిపై జంతు ప్రేమికుల బృందాలు వ్యతిరేకతను తెలిపాయి. మరోవైపు ఈ ఆదేశాల అమలులో గల ఆచరణాత్మకతపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి మరో ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి ఈ వ్యవహారాన్ని పంపారు.
సరిగ్గా మొదటి తీర్పు వెలువడిన 11 రోజుల తర్వాత ఈ ధర్మాసనం ఆ తీర్పును తలకిందులు చేసింది. రేబిస్ సోకినవి, దూకుడుగా ప్రవర్తించేవాటిని తప్పించి మిగతా కుక్కలకు టీకాలు వేసి, ఆపరేషన్లు చేసి వీధుల్లోకి, అంటే, ఎక్కడినుంచి పట్టుకొచ్చారో అక్కడే వదిలిపెట్టాలని స్పష్టం చేసింది. వీధికుక్కల పట్ల కాఠిన్యం కన్నా కారుణ్యాన్నే సర్వోన్నత న్యాయస్థానం ఎంచుకున్నదనేది వాస్తవం. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. మరి ఛవీ లాంటి చిట్టితల్లులకు రక్షణ ఎలా? అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. వీధికుక్కల సంఖ్యపై సరైన గణాంకాలేవీ అందుబాటులో లేవు.
అధికారిక లెక్కల్లో 1.7 కోట్లుగా చెప్తున్నప్పటికీ మూడున్నర కోట్ల దాకా ఉంటాయని రకరకాల అంచనాలు తెలియజేస్తున్నాయి. మనుషులపై కుక్కల దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క ఢిల్లోలోనే 2025 జనవరి-జూన్ మధ్యకాలంలో 35 వేల పైచిలుకు కుక్కకాటు సంఘటనలు చోటు చేసుకున్నాయి. మామూలు దాడులకైతే లెక్కే ఉండదనుకోవచ్చు. ఇక రేబిస్ మరణాల విషయానికి వస్తే 2019లో దేశంలో 4,146 మంది కుక్కల నుంచి సంక్రమించిన వ్యాధి వల్ల కన్నుమూశారు. బతికినవారు చికిత్స కోసం ఎంత ఖర్చుచేసి ఉంటారు? ఎంతగా బాధలకు లోనై ఉంటారు? అనే ప్రశ్నలు సమాధానాలు వెతకడం అనవసరం.
మన దేశంలో జంతు జనాభా వ్యాప్తి నిరోధక నిబంధనలు (2023) ఉన్న మాట నిజమే. అవి పెద్దగా ప్రభావం చూపడం లేదనేదీ వాస్తవమే. ఆగస్టు 11 ఉత్తర్వుల్లో ద్విసభ్య ధర్మాసనం ఇదే చెప్పింది. జనాభా నియంత్రణ ఆపరేషన్లు 70 శాతం దాటితేగానీ ఉపయోగం ఉండదనే అభిప్రాయం నిపుణుల్లో ఉన్నది. ఇలాంటివి కఠినంగా అమలుచేసి వీధి శునకాల సమస్య నుంచి పూర్తిగా విముక్తి సాధించిన దేశంగా నార్వే ఓ ఉదాహరణను నెలకొల్పింది. తగిన సిబ్బందిని, సాధన సంపత్తిని సమకూర్చి అదే తరహా విముక్తిని ఇక్కడా సాధించమని పార్ధీవాలా ధర్మాసనం సూచించింది. కానీ, ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలతో అదంతా అటకెక్కింది. కుక్కల్లో మంచిచెడ్డలు విడమర్చి చూడటం కష్టమే. మనిషికి, కుక్కకు గల ‘అనుబంధం’ గురించి ఎంత గొప్పగా అయినా చెప్పుకోవచ్చు. కానీ, స్వేచ్ఛా భారతంలో కుక్కల భయం లేకుండా స్వేచ్ఛగా వీధుల్లోకి వెళ్లే అవకాశం లేకపోతే ఎలా?