ఇది ఒక్క వ్యాసం కాదు, వ్యాసపరంపర. పూర్తిగా వేరే దేశంగా బతికిన తెలంగాణ ప్రాంత ప్రజల బతుకులు ఆంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకుల పాలనలో ఎట్లా ఛిద్రమయ్యాయో తెలిపే సుదీర్ఘ కథ. ఇప్పుడే ఓటు హక్కు పొందిన, పొందుతున్న యువత కోసం, 2014 ముందు పరిస్థితులు పట్టించుకోనివారికీ, తెలియనివారికీ, తమ కష్టాలకు కారకులెవరో గుర్తించనివారికీ ప్రత్యేకంగా వెలువరిస్తున్న విషయపరంపర. ఉమ్మడి ఏపీ అసలు ఎందుకు, ఎలా ఏర్పడిందో, ఆ రోజునుంచీ ఏమి జరిగిందో అన్ని వివరాలతో రాస్తున్న వ్యాస పరంపర. తెలంగాణ మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా చదువవలసిన అంశాలు వివరించిన దీర్ఘ రచన.
1956, నవంబర్ 1; పెంక మీద ఉన్న తెలంగాణ పొయ్యిలో బడ్డ రోజు! ప్రత్యేక దేశంలో ఉన్న ఈ ప్రాంతం బ్రిటిష్ రాజుల గులాంలైన ఆంధ్రవారి పాలనలోకి ఎలా వెళ్లిందో తెలియాలంటే అసలు అంతకుముందు జరిగిన ఆంధ్ర ప్రాంత చరిత్ర కొంతైనా తెలియాలి. ఈ మొదటి వ్యాసంలో ఆ సంగతులు తెలుసుకుందాం!
దాదాపు ఒక శతాబ్దంన్నర – 150 ఏండ్లపైన- మద్రాసు రాష్ట్రంలో తమిళులతో కలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులకు తమకు అన్యాయం జరుగుతున్నదని అనిపించింది. అందుకే, ప్రత్యేక ఆంధ్రా ఉద్యమం మొదలుపెట్టారు. ఆంధ్రులు ఆంధ్ర ప్రాంతంలోనూ, రాయలసీమ ప్రాంతంలోనూ ఉన్నారు.
అయితే వారిద్దరి మధ్య కూడా సయోధ్య, నమ్మకం లేవు. 1926లో స్థాపించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో మొదలైన విభేదాలు ఎక్కువయ్యాయి. 1913 నుంచీ 1935 వరకూ జరిగిన ఆంధ్ర మహాసభలలో కూడా ఆంధ్ర నాయకుల పెత్తనం సాగేటప్పటికీ రాయలసీమ వారు తాము ఆంధ్ర రాష్ట్రంలో కలవబోమనీ, తమిళులతోనే ఉంటామనీ చెప్పటంతో ఆంధ్ర నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. వారిని బ్రతిమిలాడుకొని 1937లో శ్రీబాగ్ ఒడంబడికతో ఒప్పించారు. కానీ, అందులోని అంశాలు- విద్యాసంస్థల ఏర్పాటు, కరువు జిల్లాలున్న రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటిని ఇవ్వటంలో ప్రాజెక్టుల ప్రాధాన్యం, జనసాంద్రత కాక భూమి విస్తీర్ణాన్ని బట్టి శాసనసభ స్థానాల నిర్ణయం, రాజధాని గానీ, హైకోర్టు గానీ ఆ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యటం వంటి ఒడంబడికలు శ్రీబాగ్ అగ్రిమెంట్లో ఉన్నాయి. కానీ ఆంధ్రానేతల బుద్ధి తెలుసు కదా! తమ రాష్ట్రం తాము అభివృద్ధి చేసుకోవాలని కాకుండా, మద్రాసు నగరాన్ని సొంతం చేసుకోవాలనే దురాశ వల్ల ఈ రెండు ప్రాంతాలకు రాష్ట్రం బదులు, రాజధాని కోసం గోల ఎక్కువైంది. శతాబ్దాల నుంచీ తమిళుల రాజధాని అయిన మద్రాసు నగరం ఆంధ్రకు రాజధానిగా కావాలన్న గొంతెమ్మ కోరికతో 1914 నుంచీ ఉద్యమం జరిగినా ఫలితం లేకుండాపోయింది. 1950లో రావలసిన రాష్ట్రం అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పట్టాభి సీతారామయ్య తనను ముఖ్యమంత్రిగా ఒప్పుకోడని రాష్ట్రం ఏర్పడకుండా ప్రకాశం పంతులు అడ్డుపడ్డాడు.
ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అప్పుడే ఆ రాష్ట్రం ఏర్పడి ఉంటే ఈ కలవాల్సిన కర్మ తెలంగాణకు తప్పేది. అయితే తర్వాత కూడా అమాయకుడు పొట్టి శ్రీరాములును నిరాహార దీక్షలో దించి, 58 రోజులకు ఆయన మరణానికి కారకులైనా, ఆంధ్ర నాయకుల మద్రాసు దురాశ తీరలేదు. పైగా నిజాం రాష్ట్రం ఎక్కడుందో తెలియని శ్రీరాములు హైదరాబాద్ కోసం, విశాలాంధ్ర కోసం ప్రాణత్యాగం చేశారని అబద్ధాల చరిత్రలు సృష్టించారు. తెలంగాణ ఉద్యమాన్ని విధ్వంసంగా తర్వాతి రోజులలో వర్ణించిన ఆంధ్ర వారు రైళ్ళ దగ్గర్నించీ అన్నీ తగలబెట్టి విధ్వంసానికి పాల్పడటంతో 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు దక్కకపోవడంతో కర్నూలు రాజధానిగా చేసుకొని తాత్కాలిక డేరాలు ఏర్పర్చుకొని పాలన సాగించారు ఆంధ్ర నాయకులు. వారి పత్రాలను 24 గంటలలో వారికి అప్పగించి చేతులు దులుపుకొని సంతోషించారు తమిళ సోదరులు. అసలు ఈ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన ఒకే ఒక్క ఉద్యోగాన్ని ఆంధ్ర ప్రాంతమైన గుం టూరులో ఒక తమిళుడికి ఇవ్వడంతో మొదలైం ది. అయితే ఇక్కడ ఒక్క విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి. అది ఆంధ్రులకు వారి ప్రాంతం మీద ప్రేమ ఉన్నదా అన్న అంశం! నిజానికి ఆంధ్ర ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధి చెందకపోవటానికి, ఈ రోజుకీ – 72 ఏండ్ల తర్వాత-వారికి రాజధాని లేకపోవటానికి కారణం ఆంధ్ర రాజకీయ నాయకులే!
దీనికి తార్కాణం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటైతే జరిగింది కానీ, మద్రాసు నగరం వదిలి ఒక్క మేధావీ, విద్యావంతుడూ, వ్యాపారవేత్తగా, సినీరంగ ప్రముఖులూ, ఇతర కళాకారులు, శాస్త్రజ్ఞులూ ఎవరూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లలేదు. 2014 నుండీ ఆంధ్ర ముఖ్యమంత్రి హైదరాబాదు నుండి పాలన సాగించినట్టే, ప్రముఖులు, విద్యావంతులు, ధనవంతులూ ఎవరూ మద్రాసు నుండీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లకపోవడం ఒక కారణమైతే, ఇంకో కారణం ఆ నాయకుల కాకి బుద్ధి! తమ రాష్ట్రం ఏర్పడిన సంతోషం వెలిబుచ్చకుండా రాష్ర్టావతరణ రోజే హైదరాబాద్ రాజధాని మంత్రం మొదలుపెట్టారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ దగ్గర నుండీ, నీలం సంజీవరెడ్డి దాకా! పోనీ, ఆంధ్ర ప్రాంతంలో అనువైన భూమిలో ఒక మంచి చిన్న రాజధానిని కూడా ఏర్పాటు చేసుకోకుండా, పక్క ప్రాంతం మీద కన్నువేసి పాలన సాగించారు. అప్పటి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ మురికి నీరు, పెద్ద సంఖ్యలో తిరుగుతూ పందులు కనిపించాయి. అలా ఉన్నా ఒక మంచి చోట ప్రభుత్వానికి భవనాలు కట్టుకోవాలన్న సోయి లేదు, ప్రాంతం మీద ప్రేమ లేదు ఆంధ్ర రాజకీయ నాయకులకు!
విశాలాంధ్ర నినాదం నెహ్రూకి నచ్చలేదు. వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, సంఘాలు కలసికట్టుగా జీవిస్తున్న హైదరాబాద్ రాష్ర్టాన్ని కలుషితం చెయ్యటానికి ఆయన ఇష్టపడలేదు. ఏ పరిస్థితుల్లో అది జరిగిందో వచ్చే వ్యాసంలో చూద్దాం. ప్రస్తుతం ఆంధ్ర వారి ఆలోచనలు అర్థం చేసుకుందాం.
నిజానికి తెలంగాణ తెలుగు, ఆంధ్రభాషకు అక్షరాలు తప్ప ఏ పోలికా లేదు. వ్యాస మహా భారతంలోనూ అంతకుముందే రాసిన వాల్మీకి రామాయణంలోనూ ఆంధ్ర ప్రాంత ప్రసక్తి ఉంది. వారి ప్రాంతం ఆంధ్రం, జాతి ఆంధ్రం, భాష ఆంధ్రం. కవిత్రయం తాము వ్యాస భారతాన్ని ఆంధ్రుల కోసం ఆంధ్రీకరించామని చెప్పారు. తెలుగు అన్నది 1955లో వచ్చిన మాయాబజార్ సినిమాలో కూడా వాడలేదు. గోంగూర పచ్చడిని ‘ఆంధ్ర శాకం’ కింద వర్ణించారే కానీ, తెలుగు పచ్చడి అనలేదు. తెనాలికి చెందిన శంకరంబాడి సుందరాచారి అన్న కవి విశాలాంధ్ర వాదం బలపరచటానికి రాసిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ కాస్తా (ఆంధ్ర నాయకుల దురాశ, ఇతర ప్రాంతాల మీద ప్రేమ, తమ ప్రాంతం మీద చిన్న చూపుతో,) తెలంగాణ వారికి ఉరితాడై బిగిసింది. ఆంధ్ర తల్లి, సవితి తైల్లె ఈ ప్రాంతం వారిని వివక్షాపూరితంగా పాలించింది.
కనీసం ఈ 58 సంవత్సరాలలోనైనా ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ సంపద కొల్లగొట్టిన ధనంతో ఒక చక్కటి నగరం ఆంధ్ర పాలకులు నిర్మించుకోలేదంటే వారికి తమ మాతృభూమి మీద ఎంత ప్రేముందో తెలియటం లేదా! దీనికి ఇంకా నిరూపణలెందుకు? 1953, అక్టోబర్ 1 నుంచి 1956 నవంబర్ 1 దాకా జరిగిన నాటకాలు వచ్చే వ్యాసంలో. ఏది ఏమనుకున్న 1956 నవంబర్ నుంచి తెలంగాణ వారికి 57 ఏండ్ల 7 నెలల శని దశ మొదలైంది.