తెలంగాణ అస్తిత్వస్వరాలు గాలి సోకితేనే మండే భాస్వరాలు. ఆ నిప్పు రవ్వలు ఎప్పుడూ చల్లారవు. ఏడు దశాబ్దాలుగా ఎగసిపడుతూనే ఉన్నాయి. తీవ్రవైన ధర్మాగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. ఆ చరిత్ర తెలియని మూర్ఖులు చెలగాటం ఆడాలనుకుంటే నిలువునా దహించుకుపోక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరం దాటింది. తొమ్మిదిన్నరేండ్లపాటు తోక ముడిచిన కాలకేయులు రెండున్నరేండ్లుగా మళ్లీ విజృంభిస్తున్నారు . తమ అడుగులకు మడుగులొత్తే పాలకుల అండతో విర్రవీగుతున్నారు. మళ్లీ ఒక అలజడి మొదలైంది. పొంచి ఉన్న ప్రమాదం పసిగట్టిన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమకారులు తిరిగి మరో సాంస్కృతికోద్యమానికి శంఖారావం పూరిస్తున్నారు.
గత కొంతకాలంగా తెలంగాణ వ్యతిరేక శక్తులు రెచ్చగొట్టే కార్యక్రమాల ఫలితంగా రాజుకుంటున్న ఆందోళన ఇడుపు కాయితం సినిమా పేరును వెక్కిరించడంతో భగ్గుమన్నది. సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తున్నది. ఆ పేరు తెలుగే కాదన్నట్టు ‘తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉంటుందా?’ అని ఒకడు, ‘సబ్ టైటిల్స్ వేస్తారా?’ అని ఇంకొకడు ఇలా తెలంగాణ భాషను వెటకారం చేస్తూ చౌకబారు వ్యాఖ్యానాలు చేశారు. తెలుగు వాళ్లంతా ఒక్కటి కదా అని సన్నాయి నొక్కులు నొక్కేవారు వాటిని ఖండించలేదు. తెలంగాణ సమాజమే తిరగబడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు గతంలో ఒక సభలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ అవుతున్నది.
అచ్చమైన వ్యాకరణబద్ధమైన భాష తెలంగాణ భాషేనని ఆంధ్రా ప్రాంత భాష ఇంగ్లిష్తో కలుషితమైపోయిందని అన్నారు. వాస్తవానికి ఆంధ్రము, తెలుగు ఒక్కటి కాదు. ఆంధ్ర శబ్దం జాతి వాచకం. భాషా వాచకం కాదు. త్రిలింగ దేశమే తెలంగాణ. త్రిలింగదేశం మాట్లాడేది తెలుంగు. తర్వాత తెలుగుగా మారింది. కనుక తెలంగాణదే అసలైన తెలుగుభాష. నన్నయ మొదలుకొని ప్రాచీన కవులంతా తెలుగులో రాశామన్నారు కానీ ఆంధ్ర భాషలో రాశామని చెప్పలేదు. కవిత్రయ మహాభారతం, బమ్మెర పోతన భాగవతం అని మాత్రమే వ్యవహరించారు. శ్రీమదాంధ్ర మహాభారతం, శ్రీమదాంధ్ర మహాభాగవతం అనే పేర్లు మూలాల్లో లేవు. కొత్తగా తెచ్చి పెట్టినవే. కరీంనగర్ జిల్లా బొమ్మలగుట్ట శాసనం వల్ల తెలుగు భాషకు గుర్తింపు దక్కింది. అధికారికంగా ప్రాచీన హోదా లభించింది. తెలంగాణ భాషా సాహిత్యాలు మాత్రమే పురాతనమైనవని చెప్పడానికి అది చాలు.
సమైక్య రాష్ర్టానికి ఆంధ్రప్రదేశ్ అనే నామకరణంతో ఆంధ్ర అనే పదం స్థిరపడింది. తెలుగుకు పర్యాయపదంగా ఆంధ్ర శబ్దాన్ని తెలంగాణ సమాజం ఆదరించింది. కానీ తెలంగాణ పదాన్ని ఆంధ్రాధిపత్యవాదులు ఏనాడూ ఆదరించలేదు.. ఆమోదించలేదు. పైగా ఉర్దూతో కూడిన సంకర భాష తెలంగాణ భాష అని వెక్కిరించారు. సినిమాల్లో కూడా విలన్లకు, జోకర్లకు తెలంగాణ భాషను, మిగతా పాత్రలకు గుంటూరు, కృష్ణా జిల్లాల భాష ఉపయోగించడం పరిపాటి అయిపోయింది. విశేషమేమిటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని భాష కూడా విలక్షణంగా ఉంటుంది. మధ్యాంధ్ర ప్రాంత వాసులకు చాలా పదాలు అర్థం కావు.
అందుకోసం సబ్ టైటిల్స్ డబ్బింగులను వారు ఆశ్రయించడం లేదు కదా. తెలంగాణనే తేలిగ్గా దొరికిందా. ఈనాటికీ ఆంధ్రా ప్రజల భాషలో ఉర్దూ పదాలు ఎన్నో కనిపిస్తాయి. ఇంగ్లిష్ పదాలకైతే లెక్కేలేదు. పాలకులంతా వారే కాబట్టి సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర శబ్దమే సుదీర్ఘకాలం రాజ్యమేలింది. తెలంగాణ అస్తిత్వోద్యమాలకు జంకిన సమైక్యవాదులు ఆంధ్ర పదం బదులుగా తెలుగు పదం వాడడం ప్రారంభించారు. ఆంధ్రమాత స్థానంలో కొత్తగా తెలుగుతల్లిని ప్రతిష్టించారు.
తెలంగాణ తల్లి కొత్తగా వచ్చి చేరింది కాదు.1950 నాటికే తెలంగాణ తల్లిభావన ఉన్నది. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని అన్నారు దాశరథి. అయినా 60 ఏండ్లపాటు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ తల్లి, వైతాళికుల విగ్రహాలు కనుమరుగైపోయాయి. పాఠ్యాంశాలలో తెలంగాణ చరిత్ర, సామాజిక ఉద్యమాలు, ఆధ్యాత్మిక, భౌగోళిక వైభవాలు వివక్షకు గురయ్యాయి. తెలంగాణ ప్రజలు త్యాగాలకు, బలిదానాలకు వెనుదీయకుండా ఉద్యమించి తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నారు. తెలంగాణ భాషాసంస్కృతులను పతాక స్థాయిలో నిలబెట్టారు. చిరకాల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నారు .
సొంత రాష్ట్రం ఏర్పడ్డా వెక్కిరింతలు, వెటకారాలు పోలేదని తెలియడానికి 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ తొలి సమావేశాల తొలి రోజే తార్కాణం. కొత్తగా ఎన్నికైన వారు అసెంబ్లీకి వస్తే తెలంగాణ వ్యతిరేకుల ఆశాజ్యోతి అయిన ఒక టీవీ చానల్ దళిత, బహుజన ఎమ్మెల్యేలను ఎంత అసహ్యంగా, నీచంగా మాట్లాడిందో ప్రపంచమంతా గమనించింది. అసెంబ్లీ వేదికగా ఆ మీడియా సంస్థను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కడిగిపారేసి కట్టడి చేశారు.
నేటి పాలకుల్లో తెలంగాణ పక్షాన నిలిచేవారు ఉండి ఉంటే ప్రత్యర్థులు గొంతు విప్పే సాహసం చేసేవారా? తెలంగాణ పదం డిక్షనరీలోనే లేదని, అది స్వార్థపరులు సృష్టించిందని, ఆంధ్ర పదం మాత్రమే ఉన్నదని ఆంధ్రా గడ్డపై చంద్రబాబు సాక్షిగా మహానాడులో చాటి చెప్పే ధైర్యం చేసేవారా? ఏనాడూ జై తెలంగాణ అని పిడికిలెత్తి నినదించని ఉద్యమ వ్యతిరేకి పాలనలో ప్రతీపశక్తులు దాడికి ఎగబడడంలో ఆశ్చర్యమేమున్నది? సందు దొరికితే సమైక్య రాష్ట్రం చేసేయ్యాలన్న కసి వలసవాదుల్లో కనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ అందకుండా చేయాలనే దుర్బుద్ధి బయటపడుతూ ఉన్నది. చిన్న విషయాలే కదా అని ఏ వ్యాఖ్యలను కొట్టి పారేయడానికి వీలు లేదు. తెలంగాణకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది.
కేసీఆర్ హయాంలో దేశ సమైక్యత, సమగ్రతకు తెలంగాణ దర్పణంగా నిలిచింది. ఇక్కడి ప్రజలు ఎలాంటి వైషమ్యాలు ప్రదర్శించలేదు. సమైక్య పాలనలో నెలకొల్పిన ఏకపక్ష సాంస్కృతిక ప్రతీకలను పోనీలే అని వదిలేశారు. దశాబ్దాల అవమానాలు, వివక్షల గాయాలు సలుపుతున్నా సహృదయంతో సర్దుకుపోయారు. మరోవైపు కేసీఆర్ పాలనలో తెలంగాణ వైతాళికుల పురస్కారాలు, పేర్లు, విగ్రహాలు, స్మారక నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. బోనాలు, బతుకమ్మ రాష్ట్ర పండుగలు అయ్యాయి. పాఠ్యాంశాల నుంచి ప్రపంచ తెలుగు మహాసభల వరకు తెలంగాణ ఔన్నత్యం శిఖరాయమానంగా నిలిచింది. తంగేడు పువ్వు, పాలపిట్టకు అధికార హోదా దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రలో కాకతీయ శిలాతోరణం, చార్మినార్ చోటు దక్కించుకున్నాయి.
ఇలా ఒకటా రెండా వేయి రూపాలతో వెలిగిన తెలంగాణ అస్తిత్వ జెండా క్రమక్రమంగా అవనతమవుతున్నది. ఆనాటి సుందర దృశ్యాలు మసకబారిపోతున్నాయి. అమరుల జ్యోతి కళావిహీనమైపోయింది. చూస్తుండగా సమైక్యవాదుల విగ్రహాలు రాజధాని చౌరస్తాల్లో కొలువు తీరుతున్నాయి. దాయాది రాష్ట్ర పాలకుడు హైదరాబాద్ నడిబొడ్డున నిలిచి, తెలంగాణ మీ అయ్య జాగీరా? అని తొడగొట్టి సవాల్ చేసేదాకా వ్యవహారం ముదిరిపోయింది. తెలంగాణ అస్తిత్వ రాజకీయ రూపమైన ‘గులాబీ జెండా దిమ్మెలను కూల్చండి, పసుపు జెండాలను ప్రతిష్ఠించండి’
అని ఇక్కడి పాలకుడే పచ్చ జెండా ఊపితే విరోధులు విరుచుకుపడకుండా ఉంటారా? అందులో భాగంగానే ‘ఇడుపు కాయితం’పై వెక్కిరింత. వరుస పరిణామాలు చూస్తుంటే మళ్లీ ఏదో కుట్రకు తెరతీశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్తమాన తెలంగాణలో ఒక్క భౌగోళిక అస్తిత్వం తప్ప స్వయంపాలన పరాధీనం అయిపోయింది. సాంస్కృతిక అస్తిత్వం అవమానాల పాలవుతున్నది. కాలకూట విషసర్పాలు కరకట్టకు పోయినా, చచ్చి పోయినా కోరల్లో విషం అలాగే ఉంటుంది. అవి గుచ్చుకుంటే ప్రాణాపాయం సంభవిస్తుంది. తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం ఇది.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238