170 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ రైల్వే దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందింది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రైల్వేల విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. 2017లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం ఇందులో ఒకటి. ప్రభుత్వం తీసుకున్న అశాస్త్రీయ నిర్ణయాల్లో దీనిని ఒకటిగా చెప్పుకోవచ్చు.
స్వాతంత్య్రానికి ముందు కూడా దేశంలో ప్రధాన రవాణా వ్యవస్థగా రైల్వే పేరుగాంచింది. దేశ ఆర్థికవృద్ధికి రైల్వే చోదకశక్తిగా పనిచేసింది. అయితే, రైల్వేలు ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించాలి. బ్యూరోక్రాట్ విధానాలకు దూరంగా ఉండాలి. అయితే, రైల్వేను వాణిజ్య సంస్థగా గుర్తించి, దానిని కేటాయించిన నిధులను శాశ్వత రుణంగా చూడటంతో పాటు ఒక్క దెబ్బతో దాని ఆర్థిక స్వయంప్రతిపత్తిని, పనితీరును దెబ్బతీసే విధానాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేయడం అందులో ఒకటి. డివిడెండ్ చెల్లింపును రద్దు చేయడమే కాకుండా రైల్వేల హోదాను తగ్గించేశారు.
ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే రైల్వేను కూడా పరిగణించడం మొదలుపెట్టారు. రైల్వే బడ్జెట్ అనేది రైల్వే ఆర్థిక పనితీరును, ఇతర అంశాలను వివరంగా పర్యవేక్షించేందుకు వీలు కల్పించే ఓపెన్‌బుక్. అలాంటిది దాని బడ్జెట్‌ను తొలగించి సాధారణ బడ్జెట్లో కలపడం ఉద్దేశపూర్వకమేనన్న విమర్శలున్నాయి. రైల్వేల జవాబుదారీతనాన్ని నీరుగార్చి తమకు నచ్చినట్టు చేయడానికే ఇటువంటి చర్యలు చేపడుతున్నట్టు ఆరోపణలున్నాయి.
రైల్వే భద్రత, ఆర్థికం, ప్రాజెక్టులపై వార్షిక మదింపు నివేదికలను గతంలో పార్లమెంటుకు సమర్పించేవారు. రైల్వే పనితీరును వివరిస్తూ, ప్రతిపక్షాల ప్రశ్నలకు రైల్వే మంత్రి సమాధానాలు చెప్పేవారు. అయితే, ఇదంతా గతానికి సంబంధించినది. ఇప్పుడు రైల్వే మంత్రికి అది పార్ట్‌టైం ఉద్యోగంగా మారింది. పార్లమెంటు సభ్యులు కూడా రైల్వేలపై జరుగుతున్న విధ్వంసాన్ని పట్టించుకోవడం మానేశారు.
ఇప్పుడిక రైల్వేల ఆర్థిక స్వయంప్రతిపత్తి ముగిసింది. దాని ఆర్థిక అంశాలపై పరిశీలన కూడా ముగిసింది. సాధారణ బడ్జెట్‌తో రైల్వే బడ్జెట్‌ను ముడిపెట్టడం వల్ల ప్రత్యేకించి తనిఖీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా దుబారా పెరిగింది. దీని కారణంగా భారీ మొత్తంలో నిధులు, నిరంతరాయంగా ట్రాఫిక్ డిమాండ్ ఉన్నప్పటికీ 2016 నుంచి నష్టాల్లో మునిగిపోయింది. రైల్వేలో ఇప్పుడు దుబారా, వృథా పెరిగిపోతున్నది. జవాబుదారీతనం లేని రైల్వే యాజమాన్యం బ్రాడ్‌గేజ్ వ్యవస్థ విద్యుదీకరణ కోసం విపరీతంగా ఖర్చు చేస్తుండటం ఇందుకు ఒక ముఖ్య ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2017లో ప్రారంభించిన అత్యాధునిక డీజిల్ షెడ్ సహా వేలాది డీజిల్ లోకోమోటివ్‌లు, వాటి సహాయక మౌలిక సదుపాయాలు దీనివల్ల నిరుపయోగంగా మారాయి.
రైల్వే బడ్జెట్‌ను రద్దు చేయడం, దాని ఫలితంగా ప్రభుత్వ నిఘా లేకపోవడంతో దాని భద్రతపై ప్రతికూల ప్రభావం చూపాయనడంలో సందేహం లేదు. రైల్వే ఆస్తుల నిర్వహణ, భర్తీ, భద్రతా కేటగిరీ సిబ్బందిని సకాలంలో భర్తీ చేయడం, భద్రతా పరమైన మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం వంటి ప్రధాన అంశాలపై నిర్లక్ష్యం కనిపిస్తూ ఉన్నది. అయినా రైల్వేలు రాజీ ధోరణిని అవలంబిస్తున్నాయి. రైల్వే సిబ్బంది కనుక ‘వర్క్ టు రూల్’కు తగ్గట్టుగా పనిచేయాలని నిర్ణయించుకుంటే వ్యవస్థ కుంటుపడుతుందని రైల్వే యాజమాన్యం ఆందోళన చెందుతున్నది. కాంట్రాక్ట్ కార్మికులను భారీగా నియమించడం వల్ల సాంకేతిక నిర్వహణ వర్గాలలో నైపుణ్యం కలిగిన మానవశక్తి కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇది భద్రతను మరింత ప్రశ్నార్థకం చేస్తుంది.
భద్రత కేటాయింపులపై ఎటువంటి పర్యవేక్షణ లేకుండా, నిర్వహణ ఆస్తులను భర్తీ చేసేందుకు ఉపయోగించే కీలకమైన తరుగుదల రిజర్వ్ ఫండ్ (డీఆర్ఎఫ్) నిధుల కేటాయింపు గణనీయంగా క్షీణించింది. 2013-14లో రూ. 8 వేల కోట్లుగా ఉన్న నిధుల కేటాయింపు 2020-21 నాటికి రూ. 200 కోట్లకు చేరుకున్నది. చివరికి 2021-22లో జీరోకు పడిపోయింది. ‘కాగ్’ అంచనాల ప్రకారం 2020-21 వరకు రూ.95 వేల కోట్ల విలువైన ఆస్తులను భర్తీ చేయాల్సి ఉండగా, ఆ సమయంలో భద్రత కోసం బడ్జెట్‌ను రూపొందించడం ప్రభుత్వ ఉదాసీన వైఖరికి అద్దం పడుతున్నది. సురక్షితమైన, సరసమైన కస్టమర్ కేంద్రీకృత, పర్యావరణ స్థిరమైన రవాణాను అందించడం.. అనే రైల్వేల కార్పొరేట్ మిషన్‌ను ఈ ప్రభుత్వం స్పష్టంగా కోల్పోయింది.
90 శాతం మందికిపైగా ప్రజలు రెండవ తరగతిలోనే ప్రయాణించే మన దేశంలో వందేభారత్, ఎయిర్ కండిషన్డ్ సేవలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెట్టింది. ఉన్నత వర్గాల మనస్తత్వానికి ఇదొక ఉదాహరణ. 2011-12తో పోలిస్తే 2022-23లో సెకండ్ క్లాస్, నాన్ సబర్బన్ సెగ్మెంట్లో ఏకంగా బిలియన్ (వంద కోట్ల) మంది ప్రయాణికులు తగ్గిపోయారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్’ అనే మెరుపు వెనక క్రూరమైన పెట్టుబడిదారీ నీతి ప్రబలుతున్నది. మొత్తం మీద ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను రద్దు చేయడం ఒక అపరిమిత విపత్తు.
– మాథ్యూ జాన్, మాజీ ఐఏఎస్ అధికారి
‘ది వైర్’ సౌజన్యంతో…