ముళ్ళు పరుచుకున్న
మానవ దేహాల మూలాలను
తడిమి చూసి రావాలి
శుష్కించిపోయిన మనస్సుకు
స్వచ్ఛమైన మాటలతో…
ఒక ఉపశమన మంత్రం చెప్పాలి..
నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన
అవసరాలను కాసింత పక్కకు నెట్టి
మానవత్వపు విలువలను పెంచే,
ఒక గీతాలాపన చేయాలి!
గుండె భారాన్ని తగ్గించి ఓదార్పునిచ్చే
సంతోష సందర్భాన్ని
ఇప్పుడొక్కసారి
ముందేసుకొని చర్చించాలి!
ఎగురుతున్న నవ్వు రెక్కలను కత్తిరించిన..
నడక నేరుస్తున్న పాదాలకు ముళ్లు గుచ్చిన..
నిజాన్ని చూడాల్సిన కళ్ళకు మసిపూసిన..
కుళ్ళు దేహాల వికృతచేష్టలకు
చరమగీతం పాడాలి!!
కనుచూపు మేరను క్రమబద్ధీకరించి
ఇంపైన రంగులద్ది తేటతెల్లం చేయాలి..!!
ఇప్పుడొకసారి వెనక్కి తిరిగి ఎవరికివారే
గత చరిత్ర చూసుకొని మెదలాలి!
జయంతి వాసరచెట్ల: 99855 25355