2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ప్రతి 30 మంది విద్యార్థులకూ ఒక టీచర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రాథమికోన్నత స్థాయిలో ప్రతి 35 మంది విద్యార్థులకూ ఒక టీచర్, ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్‌ల వారీగా ఉపాధ్యాయులు ఉండాలి. ప్రస్తు తం దేశంలో రాష్ర్టాల వారీ గా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఒక్కోలా ఉన్నది.
రాష్ర్టాల వారీగా విద్యార్థుల సంఖ్యను అనుసరించి ఈ రేషియో ఆధారపడి ఉంటుంది. అయితే 30 మందికి ఒక ఉపాధ్యాయుడే ఉండాలని కాదు, 30 మందిలోపు విద్యార్థులు ఉంటే ప్రాథమిక స్థాయి పాఠశాలలో ఎంతమందైనా ఉపాధ్యాయులు ఉండవచ్చు. తెలంగాణలో 2015లో విడుదల చేసిన జీవో 11, 17లను అనుసరించి హేతుబద్ధీకరణ జరిపారు. 2021లో జారీ చేసిన మరో జీవో 25 ప్రకారం హేతుబద్ధీకరణ చేస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నా అమలు కాలేదు. అయితే, జాతీయస్థాయిలో కంటే రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఎక్కువ ఉన్నదని, ప్రతి 17 మంది విద్యార్థులకూ ఒక టీచర్ అందుబాటులో ఉన్నారని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో సంవత్సరం ఒక్కోవిధంగా విద్యార్థుల ప్రవేశాలు, మొత్తం విద్యార్థుల సంఖ్య ఒక్కోరకంగా ఉంటున్నది. రాష్ట్రంలో 24,224 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 16,455 ప్రాథమిక, 3,097 ప్రాథమికోన్నత, 4,672 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 10 మంది లోపు విద్యార్థులు ఉంటే ఒక ఎస్జీటీ, 11 నుంచి 60 లోపు విద్యార్థులు ఉంటే ఇద్దరు ఎస్జీటీలు ఉన్నారని సంబంధిత అధికారులు చెప్తున్నారు.
అయితే, కొన్ని పాఠశాలల్లో ఈ లెక్కల్లో కొంత వ్యత్యాసం ఉన్నది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ బడులు పోటీ పడాలంటే ప్రైమరీ స్థాయిలోనే అదనపు టీచర్లను కేటాయించాలి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి బోధించేందుకు 1.06 లక్షల మంది టీచర్లు ఉన్నారు. రాష్ట్రంలో లక్షా 25 వేల టీచర్ పోస్టులు మంజూరైనా ఇంకా 19 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హేతుబద్ధీకరణతో కొన్ని పోస్టులు మిగులుగా చూపెట్టినప్పటికీ దాదాపు 10 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ హేతుబద్ధీకరణ అంటూ వార్తలు వస్తుండడంతో మొత్తం ఖాళీలు గల్లంతై అదనపు టీచర్లు ఉంటారని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకూ ఒక టీచర్ అని కాకుండా ప్రభుత్వ పాఠశాలల మనుగడను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ పాఠశాలలతో పోటీని తట్టుకొని నిలబడాలంటే ప్రతి తరగతికీ ఒక టీచర్ ఉండాలి.
ప్రతి సబ్జెక్టుకూ ఒక టీచర్ అనే డిమాండ్ వస్తున్నప్పటికీ స్కూల్ అసిస్టెంట్‌తో పోలిస్తే ఎస్జీటీ పోస్టులకు సబ్జెక్టు వారీగా టీచర్ పోస్టుల కేటాయింపు జరుగదు. కనుక వాస్తవ పరిస్థితులను గమనంలోకి తీసుకొని 10 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు తప్పనిసరిగా ఇద్దరు ఉపాధ్యాయులు, 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు, 30 మంది విద్యార్థులకు పైగా ఉంటే నలుగురు టీచర్లను కేటాయించాలి. దీనివల్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయంతో పాటు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు దోహదపడుతుంది. డీఎస్సీ రూపంలో నిరుద్యోగ సమస్య కూడా కొంతవరకు తీరుతుంది.
ఇదిలావుండగా, హైస్కూల్‌కు సంబంధించి విద్యార్థుల సంఖ్య పూర్తిగా ప్రాథమిక స్థాయి పాఠశాలలను అనుసరించి ఉంటాయి. మరోపక్క ప్రభు త్వ ఉన్నత పాఠశాలకు విద్యార్థుల సంఖ్య గురుకుల మాడల్ స్కూళ్లు, ప్రైవేట్ పాఠశాలల రూపంలో విద్యార్థుల సంఖ్యపై ప్రభావం చూపుతుంది. కనుక ప్రాథమిక స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచాలంటే గతానికి భిన్నంగా అదనపు టీచర్లను కేటాయిస్తే కచ్చితంగా మార్పు ఉంటుంది.
– రావుల రామ్మోహన్‌రెడ్డి 63054 58920