పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తప్పక జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016 నవంబర్ 8న, రాత్రి 8 గంటల సమయంలో రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ అనూహ్య ప్రకటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. లక్షలాది మంది ప్రజలు బ్యాంకుల ముందు క్యూ లైన్లు కట్టారు.
ఒక నివేదిక ప్రకారం… సుమారు వెయ్యి కోట్ల రూపాయల రద్దయిన నోట్లనైనా జమ చేయించలేని పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం క్యూ లైన్లలో గంటల పాటు నిరీక్షించి వందలాది మరణించారు. బ్యాంకుల్లో నోట్లు లెక్కబెట్టడానికి చాలాచోట్ల మెషిన్లు కూడా లేకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు మాన్యువల్‌గా లెక్కబెట్టారు. దీంతో కొన్ని నకిలీ నోట్లను వారు గుర్తుపట్టలేకపోయారు. ఆ నష్టాన్ని ఉద్యోగులే భరించాల్సి వచ్చింది. తమ వంటింట్లో పోపు పెట్టెల్లో డబ్బు పొదుపు చేసిన మహిళలు కూడా ఈ నిర్ణయంతో భారీగా నష్టపోయారు.
సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) నివేదిక ప్రకారం 16 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. చిరు వ్యాపారులు భారీ నష్టాన్ని చవిచూశారు. పెద్ద నోట్ల రద్దు ఎందుకు చేశారు? ఎవరుచేయమన్నారు? అసలు ఈ నోట్ల రద్దుతో ఒనగూడిన ప్రయోజనం ఏమిటో ప్రభుత్వమూ చెప్పలేదు, ప్రజలకు అర్థం కాలేదు. తాజాగా సుప్రీం కోర్టు నోట్ల రద్దుపై కేంద్రాన్ని వివరణ కోరడంతో తిరిగి ఇప్పుడు నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ కూడా నోట్ల రద్దుపై అసమ్మతిని వ్యక్తం చేసింది. అయినా కేంద్రం ఒంటెత్తు పోకడతో నోట్ల రద్దు నిర్ణయాన్ని మార్చుకోలేదు. కొత్త నోట్ల ప్రింటింగ్‌కు ఆర్బీఐకి 8 వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా. 2014లో రూ.36 కోట్ల నకిలీ నోట్లు పట్టుబడగా, 2019లో 25 కోట్లు, 2020లో 52 కోట్లు నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. ఇందులో 500 రూపాయల నోట్లు 102 కోట్లున్నాయి. 2016 నవంబర్ 13న పీఎం నరేంద్ర మోదీ నోట్ల రద్దుపై భావోద్వేగంగా మాట్లాడుతూ.. ‘తనకు 50 రోజుల సమ యం ఇవ్వాలని, అప్పుడు నోట్ల రద్దు నిర్ణ యం తప్పు అని తెలితే నిలబెట్టి శిక్షించాలని’ ప్రాధేయపడ్డారు. అంతేకాదు, ‘నన్ను కొందరు బద్నాం చేస్తారని, బర్బాద్ చేయజూస్తారని, నన్ను చంపేస్తారని’ కూడా మాట్లాడారు.
నల్లధనం దాచుకున్న వారి మీద, విపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా మాట్లాడారన్నది అందరికీ తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరికి ప్రయోజనం జరిగిందో, ఏమో తెలియదు. కానీ, సామాన్యులు మాత్రం కష్టపడి, చెమటోడ్చి కాస్తో, కూస్తో సంపాదించుకున్నవారు, పొదుపు చేసుకున్నవారు, బిడ్డల పెండ్లిళ్లకు డబ్బు కూడబెట్టుకున్నవారు ఆకస్మిక నోట్ల రద్దుతో ఇబ్బంది పడ్డారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు కన్నీరు గార్చారు. ఆ దృశ్యాలు బాధాకరం. కేంద్రం 2020లోనూ కరోనా సందర్భంగా చెప్పాపెట్టకుండా, ఆకస్మికంగా దేశమంతా లాక్డౌన్ విధించింది. దీనివల్ల కూడా దేశంలో భారీ నష్టం వాటిల్లింది. ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగాన్ని, అధిక ధరలను ఎదుర్కొన్నది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేక సామాన్యుడు ఆగమయ్యాడు. కరోనా కాలంలో ఆక్సిజన్ లభించక వేలాది మంది ప్రజలు మరణించారు.
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాలనలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. సుప్రీంకోర్టు హెచ్చరించినా కులమతాలను రెచ్చగొట్టే విద్వేషపూరిత ఉపన్యాసాలు నాయకులు బంద్ చేయడం లేదు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల పేర కేంద్రం రాజకీయ నేతలు, అధికారుల నుంచి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నది. 3,086 కేసులు నమోదైతే ఇందు లో 23 మందికే శిక్షలు పడ్డాయి. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే ఈ దాడులు జరుగుతుండటం విడ్డూరం. వారిని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని స్పష్టమవుతున్నది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుందోనని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎం.డి.మునీర్: 99518 65223