‘ఢిల్లీలో ఏ రోడ్లో చూసినా కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లే కనిపించాలి. నిన్న లాల్‌కిలా వద్దకు వెళ్తే అక్కడ ఒక్క పోస్టర్ కూడా కనిపించలేదు.. ఇలా అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మనం గెలిచినట్టే..’ ఫోన్లో కేంద్రమంత్రి గోయల్ ఎవరితోనో గట్టిగా మాట్లాడుతున్నారు. ‘మన పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి వెయ్యి పోస్టర్లు అతికించే బాధ్యత అప్పగించండి. మన కోసం ప్రధాని రోజుకు రెండు గంటలే పడుకొని 22 గంటలు పనిచేస్తున్నారు. ఆ రెండు గంటలు కూడా నిద్రపోకుండా ఉండేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. దేశం కోసం ప్రధాని నిద్ర కూడా త్యాగం చేస్తుంటే మీరు గోడలకు పోస్టర్లు అంటించలేరా’ అని ఎవరినో ఫోన్లో అడుగుతున్నారు.
ఎదురుగా తెలంగాణ నాయకులు, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి కనిపించగానే గోయల్ ‘ఇంతకాలానికి మా దారికి వచ్చారు. చెప్పండి ఎన్ని పోస్టర్లు కావాల’ని నవ్వుతూ అడిగారు. ‘పోస్టర్లు మాకెందుకు సార్ అవేమన్నా తిండి పెడతాయా’ అని నిరంజన్‌రెడ్డి కొశ్చన్ మార్క్ ముఖంపెట్టాడు. ‘రెడ్డిగారు మీరెంత అమాయకులు.. పోస్టర్లు తిండిపెట్టవు, ఓట్ల వర్షం కురిపిస్తాయి. వేల కోట్లు ఖర్చుచేసి కాళేశ్వరం కట్టినా, 24 గంటలు విద్యుత్ ఇచ్చినా, ఇంటింటికి నీరు, రైతుబంధు అదీ.. ఇదీ… అని కాదు మీరు చాంతాడంత పనుల జాబితా చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ, మేం ఒక్క సినిమాతో తడాఖా చూపిస్తాం. మారండి రెడ్డిగారు మారండి.’ అని గోయల్ నిరంజన్ను అనునయిస్తూ పలికాడు.
‘సార్ ఇప్పుడు ఆ పోస్టర్ల సంగతికేం గానీ తెలంగాణలో పండిన ధాన్యం కొనమని అడగడానికి వచ్చాం కొంటున్నారా? లేదా? ఆ సంగతి చెప్పండి’ అని నిరంజన్ అడిగారు. ‘తెలంగాణలో వరి పండించడమేంటి రా అని మేం ఆశ్చర్యపోతుంటే కొనమని ఒత్తిడి తేవ డం మరో వింత. మాకు తెలిసినంతవరకు తెలంగాణ అంటే కరువు కాటకాలతో అల్లాడే ప్రాంతం. రైతుల ఆత్మహత్యలు పేదరికం ఆర్ట్ సినిమాకు లైవ్ అనుకునేవాళ్ళం, మీరు కూడా పంటలు పండిస్తున్నారా? కలికాలం’ అని గోయల్ వ్యంగ్యంగా నవ్వారు. ‘మీలాంటి వారి పాలనలో తెలంగాణ అలా ఉన్నా.. ఇప్పుడు దేశానికి తిండిపెట్టే అన్నపూర్ణగా, దేశానికి జవసత్వాలుగా నిలిచిన ఐదు రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. పోస్టర్ల రాజకీయం ఇంకెంతకాలం. దేవుడు కరుణిస్తే తెలంగాణ అభివృద్ధి మాడల్‌ను దేశమంతా చూస్తున్నది గోయల్ సాబ్’ అని నిరంజన్ చురకంటించారు.
సర్లెండి వరిని మాత్రమే కొంటాం, ఈ మాట ముందే చెప్పాం. మీరెన్ని సార్లు వచ్చినా ఇదేమాట. తెలంగాణ వాళ్లకు హిందీ వస్తుంది కదా ఒకేమాట ఎన్నిసార్లు చెప్పించుకుంటారు.’ అని గోయల్ చిరాకుగా పలికాడు.
‘పంజాబ్‌లో పండించిన గోధుమలు అన్నీ కొంటున్నప్పుడు, తెలంగాణలో పండించిన ధాన్యం కొనాలి కదా?’ ‘రెడ్డిసాబ్ పంజాబ్‌లో గోధుమలన్నీ కొంటే చూశారు కదా, మొన్న పంజాబ్ రైతులు ఢిల్లీలో ఎలా ఉద్యమం చేశారు చివరికి మా మోదీ సాబ్ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదు, గోధుమలు కొన్నా, వాళ్లు మమ్మల్ని కాదని ఆప్‌ను గెలిపించారు. రైతులు అంతే తెలంగాణలో మేం మొత్తం ధాన్యం కొన్నా రైతులు మమ్ములను పట్టించుకోరు. రైతులను, యువతను, విద్యార్థులను, వారిని, వీరిని నమ్ముకోవడం కన్నా జీవం లేని పోస్టర్లే మా పార్టీకి జీవం పోస్తాయి. అందుకే పోస్టర్లను నమ్ముకోవడం మంచిదనుకున్నాం’ అని గోయల్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అక్కడే ఉన్న తెలుగు కమలం ‘మనిషిని నమ్మితే ఏముందిరా? పోస్టర్‌ను నమ్మినా ఫలితముందిరా..’అని పాడాడు. అర్థం తెలియదు కానీ పరమార్థం తెలుసు’ అని గోయల్ వెకిలిగా నవ్వాడు. ‘పంజాబ్‌లో గోధుమలు కొంటున్నారు. కానీ, గోధుమపిండి చేసుకొస్తేనే కొంటామనడం లేదు కదా, మరి తెలంగాణ రైతులపట్ల ఈ వివక్ష ఎందుకు? ఇంతకాలం ఇబ్బందుల్లోనే ఉన్న రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు. పంజాబ్ రైతుల్లా తెలంగాణ రైతులను చూడాల్సిన బాధ్యత మీకు లేదా..?’ అని మంత్రులు గోయల్‌ను రిక్వెస్ట్ చేశారు. ‘రెడ్డిసాబ్ ధాన్యాన్ని కొనం, బియ్యం కొంటాం ఇది ఫైనల్.’ అని ‘గోయల్ చెప్పగానే ‘మా బాధ అర్థం చేసుకోండి’ ఈ సీజన్ పంటలో బియ్యం ఇవ్వాలంటే నూకలు వస్తాయి. అదీ మా బాధ ’అని మంత్రులు చెప్పారు.
‘నూకలా.. హహా నూకలా’ అని గోయల్ నవ్వి ‘మీ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పండి. ఇలా మా వెంటపడి చంపుకుతినే బదులు నూకలు తినడం నేర్చుకోండని’ గోయల్ బదులిచ్చారు. ‘పీఎం సాబ్తో మీటింగ్ ఉంది. కశ్మీర్ ఫైల్స్ పోస్టర్ల పంపిణీ, ఏ హాలులో ఎంతమంది సినిమా చూశారో మోదీ సాబ్ రివ్యూ చేస్తున్నారు. మేం ఏ రోజుకారోజు ఈ లెక్కలు సార్‌కు చెప్పాలి ఇక మీరు వెళ్ళండి’ అని గోయల్ సినిమా వసూళ్ల లెక్కల్లో తలదూర్చారు. ‘మీకు నూకలు చెల్లిపోయాయి నూకలు చెల్లిపోతే ఇలాంటి పనులే చేస్తార’ని మంత్రులు కోపంగా బయటకువచ్చారు.
‘పీఎం సాబ్తో మీటింగ్ ఉంది. కశ్మీర్ ఫైల్స్ పోస్టర్ల పంపిణీ, ఏ హాలులో ఎంతమంది సినిమా చూశారో మోదీ సాబ్ రివ్యూ చేస్తున్నారు. మేం ఏ రోజుకారోజు ఈ లెక్కలు సార్‌కు చెప్పాలి ఇక మీరు వెళ్ళండి’ అని గోయల్ సినిమా వసూళ్ల లెక్కల్లో తలదూర్చారు.
– కౌటిల్య