అయోధ్య రామాలయంలో ఇటీవల జరిగిన భారీ చోరీ అంశం దేశవ్యాప్తంగా భక్తులకు ఆందోళన కలిగించే అంశం. దాదాపు రూ.200 కోట్ల వరకు చోరీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. చోరీ వ్యవహారం బయటకు రాగానే దేవుని మీద భక్తితో తాము ఇచ్చిన విరాళాలు ఏమయ్యాయోనని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగినా, నీట్ పేపర్ లీక్ అయినా పాకిస్థాన్ కుట్ర అంటూ తెలివిగా తప్పించుకునే కేంద్ర పాలకులను రామాలయంలో జరిగిన భారీ చోరీ ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి దక్షిణాది రాష్ర్టాల్లో ఆలయాలను చూసిన వారికి ఉత్తరాదిలో ఆలయాల నిర్వహణ తీరులో నిర్లక్ష్యం, బాధ కలుగుతాయి.
ఇటీవల కాలంలో చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. దక్షిణాది రాష్ర్టాల్లో ఆలయాలను సందర్శించిన వాళ్లు చార్ధామ్ యాత్రలో ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ప్రాణాలకు సైతం తెగించి కేదార్నాథ్ వెళ్తే..మైనస్ ఎనిమిది డిగ్రీల చలి, ఇబ్బందికర పరిస్థితులు కంటే..భక్తిభావం కంటే డబ్బులకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి విస్తుపోయారు. ఉత్తరాదిలో ప్రఖ్యాత ఆలయాలు ఉన్నా భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. చార్ధామ్ యాత్రలో నాలుగు ప్రధాన ఆలయాలు ఉత్తరాఖండ్‌లోనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రధాన ఉపాధి అవకాశాలు, ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తాయి. అయినా ఆలయాల వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన లేదు. సాధారణ భక్తుడికి దైవం మీద చాలా విశ్వాసం ఉంటుంది. అదే దేవుడికి దగ్గరగా ఉండే సిబ్బందికి, పాలకులకు దైవం మీద అంత నమ్మకం, భక్తి ఉండదేమో.
ప్రభుత్వ సొమ్ముతో తెలంగాణలోని భద్రాచలంలో కంచర్ల గోపన్న రామాలయాన్ని నిర్మించాడని మనం గొప్పగా చెప్పుకొంటే, శ్రీరాముని సొమ్మునే స్వాహా చేశామని అయోధ్య రామాలయ నిర్వాహకులు చెప్పుకోవాలేమో. భద్రాచలం రామాలయం, అయోధ్య రామాలయం రెండూ రామాలయాలే. రెండింటి నిర్మాణంలో ప్రత్యేకత ఉన్నది. తానీషా కాలంలో ప్రభుత్వ సొమ్ముతో భద్రాచలం ఆలయం నిర్మిస్తే, కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ఉపయోగించుకున్నది. దేశ చరిత్రనే మార్చేసిన ఈ ఆలయం నిర్వహణలో పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉన్నది.
దక్షిణాది రాష్ర్టాల్లోని చాలా ఆలయాల్లో హుండీ లెక్కించే పరకామణి కూడా భక్తి భావంతో సాగుతుంది. చిన్న పొరపాటు జరిగినా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. కానీ అయోధ్య రామాలయంలో సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడి కోట్లు స్వాహా చేశారంటే ఆలయ నిర్వహణ తీరు ఏమిటో అర్థమవుతుంది. వందల కోట్ల సంపద చోరీ ఘటన కేంద్ర, రాష్ట్ర పాలకులకు మాయని మచ్చలాంటిది.
అయోధ్య రామాలయం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో సమాజ్‌వాది ఎంపీ అవదేశ్ ప్రసాద్ గెలిచారు. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తోపాటు స్థానిక ఎంపీ చోరీ గురించి మొదట ఆరోపణలు చేసిన తర్వాతే ప్రభుత్వం స్పందించింది. ఆ తర్వాత బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ ఘటనపై విచారణకు డిమాండ్ చేశారు. కానీ చోరీ లేదు, ఏం లేదు..ఇవన్నీ పుకార్లు అని తొలుత ఆలయ కమిటీ కొట్టిపారేసింది. కానీ సమాజ్‌వాది పార్టీ నేతల ఆరోపణలతో వాస్తవాలు బయటకు వచ్చాయి. జరిగిన చోరీ ఘటనపై ప్రస్తుతానికి సిట్ కమిషన్ వేశారు. భక్తుల మనోభావాలతో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ అంశంపై ప్రస్తుతం మౌనంగానే ఉన్నది. కోట్లాది మందికి దైవం మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది.
ఆర్టీఐ చట్టాన్ని ఆధారం చేసుకొని కొందరు యాక్టివిస్ట్‌లు ఆలయాలపై పడేవారు. ఆర్టీఐ కమిషనర్‌గా ఉన్నప్పుడు వీరిని గమనించే అవకాశం లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ ఒక యాక్టివిస్ట్ కేసులో ఆలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ సంపాదిస్తున్న అంశాన్ని ప్రస్తావించి ఆయనకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్డర్ వేశారు. కొంతమంది సిబ్బందికి సైతం ఇదేవిధంగా పాపభీతి, దేవునిపై నమ్మకం ఉండదు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వ నిధులతో యాదగిరిగుట్ట లాంటి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించినా ఆలయం పేరుతో ఓట్లు అడుగలేదు. దైవం మీద విశ్వాసంతోనే ఆయన ఆలయం నిర్మించారు. కానీ రాజకీయంగా ఓట్లు పొందాలని కాదు. దేవుడి పేరుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దక్షిణాది ఆలయాలను చూసి నేర్చుకోవాలి.
– బుద్దా మురళి