సమాజం పురోగతికి నిజమైన కొలమానం మహిళలకు, ముఖ్యంగా బాలికలకు లభించే భద్రత, గౌరవం, న్యాయంలోనే ఉంటుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన మన రాష్ర్టానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావటం ఒక చేదు నిజాన్ని బట్టబయలు చేసింది. చట్టాలు ఎన్నో ఉన్నా, సెక్షన్లు ఎన్నెన్ని ఉన్నా, పోరాటాలు ఎన్ని జరిగినా..అధికార బలం, అంగబలం, ఆర్థిక బలం
ఉన్నవారి ఎదుట బాధితులు ఇంకా న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి పూర్తిగా మారలేదని ఈ ఘటన స్పష్టం చేసింది. చట్టం లక్ష్యం ఏమిటి? వాస్తవం ఏమిటి?
పోక్సో చట్టం ఒక స్పష్టమైన లక్ష్యంతో రూపొందింది. 18 ఏండ్లలోపు బాలికలను లైంగిక నేరాల నుంచి రక్షించటం, నేరస్థులపై కఠిన శిక్షలు విధించటం, మైనర్లకు అనుకూలమైన విచారణ వాతావరణాన్ని కల్పించటం, వారి గోప్యతను కాపాడటం, త్వరితగతిన న్యాయం అందించటం. తాజాగా పోక్సో కేసు వెలుగుచూసిన తర్వాత ప్రజల మనసులో మెదిలే ప్రశ్న ఒక్కటే..చట్టాలు పుస్తకాల్లో ఉన్నంత బలంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? మైనర్ బాలికపైనే విచారణ ఎందుకు? ఒక బాలిక ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినప్పుడు, సమాజం ఆమెకు అండగా నిలబడాలి. కానీ మనం చూస్తున్నది దానికి పూర్తి విరుద్ధం.
ఆమె వయస్సును ప్రశ్నించటం, కుటుంబాన్ని అవమానించటం, వ్యక్తిత్వ హననానికి దిగజారటం వంటి చర్యలు అమానుషం. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది రాజకీయ నేతల అనుచరులు, డబ్బులు తీసుకుని పనిచేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆ బాలిక, ఆమె కుటుంబం గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తూ, ఆరోపణల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయటం. ఆమె విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రత్యామ్నాయ కథనాలు సృష్టించటం సమాజం సిగ్గుపడాల్సిన విషయం. పోక్సో చట్టం మైనర్ల గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నది. అలాంటప్పుడు అదే గౌరవాన్ని బహిరంగంగా దెబ్బతీయటం మరింత ఆందోళనకరం.
ఈ కేసులో ఆరోపణల తీవ్రత ఉన్నప్పటికీ, ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు కావటం, నిందితుడిని వెంటనే అరెస్టు చేయకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఇదే స్థానంలో ఒక సాధారణ వ్యక్తి ఉంటే ఇదే విధానం ఉండేదా? అనే ప్రశ్న అనివార్యంగా తలెత్తుతున్నది. ఈ సంఘటన బయటపెట్టిన చేదునిజాలు కొన్ని సందర్భాల్లో ప్రధాన మీడియా పూర్తిగా మౌనం వహించగలదు. రాజకీయ పలుకుబడి, అధికారం దర్యాప్తులను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నది. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటే, అది ప్రజాస్వామ్యానికే ముప్పు.
న్యాయం కోరుతున్న ఒక బాలికపై వేసిన నిందలు, రకరకాల వేధింపులు మన సామాజిక బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వ్యవస్థలు మౌనం వహించిన ఈ చీకటిలో ఆశ చూపింది ఒక్కటే..ప్రజల గొంతు. సామాజిక మాధ్యమాల వేదికగా సామాన్య పౌరులు చేసిన నిరంతర పోరాటం, ప్రశ్నించటం, ఒత్తిడి తేవటం వల్లే ఈ కేసు ముందుకు సాగింది. ఈ విషయాన్ని ప్రజా చర్చలో సజీవంగా ఉంచింది ప్రజలే. ఈ ఒత్తిడి లేకపోతే కేసు ఇంత దూరం వచ్చేదా? అరెస్టులు జరిగేవా? అనే ప్రశ్నలు ప్రజల్లో సహజంగానే తలెత్తుతున్నాయి. ఇది రాజకీయ అధికార దుర్వినియోగంపై ప్రజల ఐక్యత సాధించిన విజయం. న్యాయంపై నమ్మకం నిలవాలంటే నిందితుడి అరెస్టు కేవలం ఆరంభం మాత్రమే; అంతిమ న్యాయం కాదు. కేసు ఇంకా కొనసాగుతున్నది.
పలుకుబడి ఉన్న రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు, దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి జోక్యం లేకుండా జరగాలి. ఈ నేపథ్యంలో సంబంధిత కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. ఇది రాజకీయ డిమాండ్ కాదు; న్యాయ ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టటానికి అవసరమైన చర్య. ఆ వ్యక్తి అధికారంలో ఉన్నంతకాలం దర్యాప్తు పూర్తిగా స్వతంత్రంగా జరుగుతుందని ప్రజలకు నమ్మకం కల్పించటం కష్టం. ఒక బాలికకు న్యాయం జరిగేలా చూడటానికి, దర్యాప్తుపై ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ప్రభావం ఉండకూడదు. పదవి కంటే న్యాయం గొప్పది. అధికారం కంటే చట్టం గొప్పది.
ముగింపు: ఇది కేవలం ఒక బాలిక వ్యక్తిగత విషయం కాదు. ఇది మన కుమార్తెల భవిష్యత్తు, భద్రతకు సంబంధించిన ప్రశ్న. ‘నువ్వు ఒంటరివి కావు, నీ వెనుక సమాజం ఉన్నది’ అనే నమ్మకాన్ని ప్రతి బాలికకు కల్పించాల్సిన బాధ్యత మనందరిది. న్యాయం కోసం పక్షపాతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడటం మనందరి సామాజిక బాధ్యత. బాలికకు దక్కాల్సిన గౌరవం, రక్షణ, న్యాయం..ఇవి రాజకీయ నినాదాలు కాదు; రాజ్యాంగం కల్పించిన హక్కులు.
– (వ్యాసకర్త: కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు)
తుల ఉమ