చింతలమానేపల్లి, జూన్ 11 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పెను గాలుల ధాటికి సుమారు 25కు పైగా ఇండ్ల పై కప్పులు (రేకులు,పెంకులు) లేచిపోయాయి. ఇండ్ల గోడలు సైతం కూలిపోవడంతో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు సుమారు 20కి పై విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇండ్ల గోడలుకూలడం, కప్పులు ఎగిరిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్తులు బయటకు పరుగులు తీశారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఆస్తి నష్టం సంభవించింది. వర్షం కోలుకోలేని దెబ్బ తీసిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులు స్పందించి గూడెం గ్రామంలో సహాయక చర్యలు చేపట్టాలని, నష్టపోయిన వారికి పరిహారం ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. సర్పంచ్ సునీత, పంచాయతీ కార్యదర్శి ఎలుములే వెంకయ్య, రెవెన్యూ అధికారులు,నాయకులు కూలిన ఇండ్లను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు గూడెంలో విద్యుత్ పున:రుద్ధరణ పనులు చేపట్టారు.