తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రమే కాదు, మీడియా పనిచేసే తీరు కూడా మారాల్సి ఉన్నది. ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రజల ఆశలు, అవసరాలు, సమస్యలను ప్రతిబింబించాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు తెలంగాణ ప్రజల దృష్టితో కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాలకు దగ్గరగా వార్తలు చూపిస్తున్నాయనే భావన ప్రజల్లో బలంగా పెరుగుతున్నది.
మీడియా అనేది నిజాన్ని చెప్పాల్సిన వేదిక. కానీ అదే మీడియా ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తే, ప్రజలకు వచ్చే సమాచారం అసంపూర్ణంగా లేదా వక్రీకరణగా మారుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వంటి వారిపై సందర్భం లేకుండా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, గత బీఆర్ఎస్ పాలనపై విషయం చిమ్మడం, స్కామ్ లు అంటూ తప్పుగా ప్రచారం చేయడం, మంచి పాల న అంశాలను పూర్తిగా పక్కన పెట్టడం లాంటి ధోరణి ప్రజల్లో పలు అనుమానాలకు కారణమవుతున్నది.
తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇలాంటి మీడియా ధోరణులు చూశాం. అప్పట్లో తెలంగాణ డిమాండ్‌ను తక్కువ చేసి చూపించేలా, ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేలా కథనాలు వచ్చాయి. కానీ అప్పటి నుంచే కొన్ని ప్రధాన చానళ్లు తెలంగాణ డిమాండ్‌ను తక్కువ చేయడం, ఆంధ్ర ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్వరాలను చూపించకపోవడమే కాకుండా కించపరిచేలా చూపించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకూడదనే కుట్రతోనే అసత్య కథనాలు ప్రసారం చేశాయనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి.
తెలంగాణ ఉద్యమాన్ని ‘ప్రాంతీయ వాదం’, ‘విభజన రాజకీయాలు’, ‘అభివృద్ధికి అడ్డంకి’ అనే పదాలతో చిత్రీకరిస్తూ, ఉద్యమకారులపై అనుమానాలు, భయాలను సృష్టించే ప్రయత్నం జరిగింది. కొన్ని చానళ్లు, పత్రికలు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల, సంపన్న వర్గాల దృక్పథానికి అనుకూలంగా తెలంగాణ ఆకాంక్షలను చిన్నచూపు చూశాయి. ఉద్యమ సమయంలో జరిగిన ఆత్మ బలిదానాలు, నిరసనలు, ప్రజా ఉద్యమాల తీవ్రతను తక్కువగా చూపించి, సమైక్య ప్రభుత్వ వాదనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల భావోద్వేగాలను నిర్వీర్యం చేశాయి. రాష్ట్ర సాధన తర్వాత కూడా పెద్ద మీడియా సంస్థల యాజమాన్యాలు ఆంధ్ర నేపథ్యం కలిగిన కార్పొరేట్ గ్రూపుల చేతుల్లో ఉండటం వల్ల, వారి కవరేజీలో పక్షపాత ధోరణి ఉండేది. ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు. అనేక సందర్భాల్లో జరిగిన ఘటనలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. అదే మీడియా ఇప్పుడు కూడా రూపం మార్చుకుని, తెలంగాణ ఆత్మగల రాజకీయ నాయకత్వాన్ని నిరంతరం అవమానించే ప్రయత్నం చేస్తున్నది. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం.
టీవీ చానళ్లు నిర్వహించే డిబేట్లు, ప్యానెల్ చర్చలు, బ్రేకింగ్ న్యూస్‌లు కూడా ఒక నిర్దిష్ట రాజకీయ కథనాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు..కేసీఆర్ హయాంలో అమలు చేసిన అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నప్పటికీ, వాటిని తక్కువగా చూపిస్తూ, ఇతర పక్షాల అబద్ధపు ఆరోపణలను హైలైట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల ఆలోచనలో గందరగోళం సృష్టించారు. ముఖ్యంగా కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తప్పుగా చిత్రీకరించే కథనాలను నేటికీ ఆపడంలేదు. ఆ చానళ్లు పొరుగు రాష్ట్ర నాయకుల పట్ల మాత్రం అనుకూల వైఖరిని కనబరుస్తూ ద్వంద్వ ప్రమాణాలను బయట పెట్టుకుంటున్నాయి.
కేసీఆర్ పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల విషం చిమ్ముతున్న మీడియాకు తోడుగా సోషల్ మీడియా కూడా మొత్తం ప్రక్రియలో రెచ్చిపోతున్నది. ఆంధ్రా కేంద్రంగా పనిచేస్తున్న అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్, యూట్యూబ్ చానెళ్లు, ట్రోలింగ్ గ్రూపులు తెలంగాణ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు వార్తలు, వీడియోలు, వక్రీకరణలను వైరల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దాడులు, అవమానకరమైన మీమ్స్, అసత్య ఆరోపణలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ డిజిటల్ ప్రచారం సాధారణ ప్రజల మనసుల్లో గందరగోళం, ద్వేష భావాలు మరింత రాజేస్తున్నాయి.
మీడియా కవరేజీలో పక్షపాత ధోరణి ఆరోపణలు కొత్త కావు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై ఆంధ్రా చానళ్లు తరచూ అసత్య ఆరోపణలనే హైలైట్ చేస్తూ వార్తలు ప్రసారం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం, వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడటం, ఆ వ్యాఖ్యలను ఆంధ్రా చానళ్లు విస్తృతంగా ప్రసారం చేయడంతో తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది.
కేసీఆర్ ఇటీవల ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు శాపం’ అని వ్యాఖ్యానించినప్పుడు కూడా ఆంధ్రా మీడియా దానిని పెద్దగా హైలైట్ చేసి, ఆయనను తీవ్రంగా విమర్శించింది. ఆ వ్యాఖ్య చారిత్రక, భావోద్వేగ నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ, దానిని తెలంగాణ వ్యతిరేక భావజాలంగా, విభజన వాదంగా చూపించే ప్రయత్నం జరిగింది. మీడియా ఫ్రేమింగ్ ఒక నాయకుడి పట్ల ఉద్దేశపూర్వకంగా ఎవరి ప్రయోజనాల కోసమో, ఎలా బురద చల్లుతుందో ఈ సందర్భంతో మనకు అర్థమవుతున్నది.
చారిత్రకంగా చూస్తే, తెలుగు మీడియా రంగం ఎక్కువగా ఆంధ్రా ప్రాంతంలోని పెద్ద వ్యాపార వర్గాల ఆధిపత్యంలో ఉన్నది. పత్రికలు, టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు, వాటి యాజమాన్యాలు రాజకీయాలతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్ర చానళ్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీ సాన్నిహిత్యం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. తెలుగుదేశం అనుకూల మీడియా రేవంత్‌రెడ్డికి అనుకూలంగా స్పష్టమైన స్టాండ్ తీసుకున్నట్టు బహిరంగ రహస్యమే. ఆ మీడియా సంస్థల కవరేజీ కూడా ఆ రాజకీయ వాదనను అనుసరిస్తున్నది. ఇది తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రమాదకరం. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం.. ఈ విషయాన్ని గమనిస్తున్నది.
– మహేంద్ర తోటకూర