‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనేది ఒక సామెత. కానీ, తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అది తప్పు అని నిరూపించారు. దాదాపు ఆరు దశాబ్దాలు కలిసి ఉన్నా, వారు వీరవలేదు, వీరు వారవలేదు. తెలంగాణ ప్రజల స్నేహతత్వం, పరాయివారి పట్ల ఆదరం, వ్యత్యాసాలు పట్టించుకోకుండా గౌరవించే సంస్కారం ఆంధ్రావారికి అబ్బలేదు. ఆంధ్రవారి కుటిలత్వం, మోసపుటెత్తులు, ఇసింట రమ్మంటే ఇల్లంతా నాదే అనే తెగింపుతత్వం, వారే అధికులమనే అహంకారం, ఎదుటివారిని అవమానించే కుసంస్కారం తెలంగాణ ప్రజలకు రాలేదు.
సుమారు అరవై ఏండ్ల సహవాసం (?) తర్వాత రాష్ర్టాలు విడిపోయి తెలంగాణ రాష్ట్రం, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాక పరిస్థితి ఏమిటి? నిజానికి ఆంధ్రప్రదేశ్‌కు ఈ విడిపోవటం మొదటిసారి కాదు. 1953లో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా కర్నూలు రాజధానిగా ఏర్పడింది, ఆంధ్రుల సొంతరాష్ట్రం. అయితే అప్పుడు వారు ప్రవర్తించిన తీరు, 2014 తర్వాత ఒక దశాబ్దం తర్వాత వారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. అవేమిటో పరిశీలిద్దాం.
మొదటి విషయం, ఆంధ్ర రాజకీయ నాయకులకు వారి ప్రాంతం మీద, ప్రజల మీద ప్రేమాభిమానాలు, ఆదరం, జాలి, కరుణ లాంటి భావాలు అస్సలు లేవు. ఇంత కఠోర సత్యం ఎలా తెలుస్తుంది? వారి రాష్ట్రమేర్పడ్డాక వారి ప్రవర్తన వలన అని చెప్పాలి. 1912 నుంచి ఉద్యమం లాంటిది చేసి, తీరా 41 ఏండ్ల తర్వాత ఏర్పడిన రాష్ర్టాన్ని ఎంత అభివృద్ధిలోకి తేవాలి? అదేం లేకపోగా కర్నూలును రాజధానిగా మలచకుండా, మూడేండ్లు ఎట్లాగో గడిపి, హైదరాబాద్‌లో పడ్డారు. నిజానికి రాష్ట్రం ఏర్పడినా, రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు, పత్రికాధినేతలు, శాస్త్రజ్ఞులు, కళాకారులు, ఇతర ధనవంతులు, ముఖ్యంగా ఆంధ్ర సినిమా పరిశ్రమ ఏ ఒక్కరూ మద్రాస్ నుంచి తమ రాష్ర్టానికి వచ్చి స్థిరపడలేదు. కనీసం తమవంతుగా ఒక్క విద్యాసంస్థ, దవాఖాన, పరిశ్రమ ఆంధ్రప్రాంతంలో స్థాపించలేదు. తమిళులు తమను హీనంగా చూసినా మద్రాస్‌లో స్థిరపడ్డ వారు అక్కడే ఉండిపోయారు. ఇక రాజకీయ నాయకులకీ తమ ప్రాంత అభివృద్ధి తమ బాధ్యత అనే సోయిలేక, తెలంగాణతో బలవంతంగా తమ రాష్ర్టాన్ని కలిపించారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా, వారు తమ నియోజకవర్గంలో ఒక్క నగరం, కొన్ని పట్టణాలుగా అభివృద్ధి చేయాలని అనుకోలేదు. అన్ని అమరిన హైదరాబాద్‌లో స్థానిక ప్రజల మీద పెత్తనాలు చేశారు. 58 ఏండ్లలో వారి ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చేస్తే అమరావతి కష్టాలుండేవి కావు. చిన్న పనుల కోసం కూలీలు కూడా హైదరాబాద్ వలస వచ్చేవారు కాదు. ఈ విషయం ఆంధ్ర ప్రజలు గమనించాలి.
రెండవ లక్షణం గత దశాబ్దంలో జరిగినదే. అందరికీ తెలుసు. అది దూరవిద్యలాగ దూరపరిపాలన! ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులే కాదు, ఆఖరికి మంత్రులు, ముఖ్యమంత్రి కూడా రోజూ హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లి మళ్లీ సాయంత్రం ఇక్కడికి చేరుకొనేవారు. ఒక టీచర్, బ్యాంక్ ఉద్యోగి కూడా ఎక్కడికి బదిలీ అయితే, అక్కడికి కుటుంబంతో పాటు వెళ్లిపోతారు. అలాంటిది ఎక్కడ పరిపాలన చేయాలో అక్కడ ఉండకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా, బెల్లు కొట్టగానే ఇంటికి పరుగెత్తే బడి పిల్లల్లాగ హైదరాబాద్ రావటం దేనికి? కట్టుబట్టలతో తమను గెంటేశారని డప్పుకొట్టేవారికి మళ్లీ ఆ ప్రదేశానికి రావటానికి సిగ్గు అనిపించాలి కదా! లేకపోతే గెంటేశారని అబద్ధాలైనా చెప్పటం మానుకోవాలి. ఈ పదేండ్ల ఏడుపు ఇంకా ఆగటం లేదు. తాజాగా మహానాడులో మహాగోడు వినిపించింది.
మాకు మహాపీడ వదిలిందని తెలంగాణ ప్రజలు సంతోషించకుండా, తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పుంజుకోవాలని ఒకడు అంటాడు. తెలంగాణ పదం ఏ డిక్షనరీలో కూడా లేదని ఇంకో అజ్ఞాని అంటాడు. ఈయన అస్సలు చదువుకోకపోతే ఎవరైనా కనీసం ఈ పదకోశాల్లో ఉన్నది చదివి వినిపించాలి.
ఆక్స్ఫర్డ్, మిరియమ్-వెచ్స్టర్, డిక్షనరీ.కామ్ మొదలైనవి. తెలంగాణలో భాష అచ్చ తెలుగు భాష (ఆంధ్ర భాష పూర్తిగా సంస్కృత పదభూయిష్టమై ఉంటుంది). తెలంగి లేక ప్రాచీన కాలం న ఉంచీ వాడిన తెలుగు+అంగన అంటే తెలుగు భాష మాట్లాడే ప్రాంతం అని వాడేవారు. దానిని సంస్కృతంలో త్రైలింగ దేశం (కాళేశ్వరం, శ్రైశైలం, ద్రాక్షారామం.. మూడు శివాలయాల మధ్య ఉన్న ప్రాంతం) అని పిలిచారు. కనుక తెలుగు ప్రాంతం తెలంగాణ మాత్రమే. రామాయణ, మహాభారత చరిత్రలలోనూ, ఐతరేయ బ్రాహ్మణికంలోనూ స్పష్టంగా వారి ప్రాంతం, దేశం ఆంధ్రమనీ, వారిది ఆంధ్ర జాతి అనీ, వారి భాష ఆంధ్రమనీ ఉన్నది కానీ, వారికి తెలుగు అన్న పదానికీ ఏమీ సంబంధంలేదు. అది ఒక మోసపూరిత రాజకీయ చర్యగా పార్టీ పేరు మిగిలింది. క్రీస్తు శకం 1418లో బహమనీ రాజుల శాసనాల్లో తెలంగాణ అనే పదం ప్రస్తావన ఉన్నది. తెలుగు, తెలంగాణ లేవని ఆంధ్రదేశం పార్టీ వారు రాజకీయ కారణాల వల్ల కానీ, అజ్ఞానాంధకారంలో ఉండి గానీ మళ్లీ వదరితే వారి పార్టీ పేరు మార్చుకోవలసి వస్తుంది.
తెలుగు అనే పదం తెలంగి+ అంగన (వాడ, ప్రాంతం, దేశం) అనే పదం నుంచే వచ్చింది. ముందు ఆంధ్రదేశంగా వారి పార్టీ పేరు మార్చుకొని ఈ పదాలన్నీ వారి భాషలోంచి తీసివేయవచ్చు. కనీసం 1417, 1510, 1500, 1318, 1220, 1300, 1570- ఈ కాలం నాటి ఈ ప్రాంత చరిత్ర చదివి మాట్లాడండి. తెలంగాణ పదం దొరుకుతుంది.
ఇక నిజంగా ఆశ్చర్యం కలిగించే మూడ విషయం. మనం ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు వారెవరైనా సరిగ్గా మాట్లాడకపోతేనే మనకు మళ్లీ ఆ ఇంటికి వెళ్లాలని అనిపించదు. అలాంటిది మీరు, మీ సహజీవనం, సాహచర్యం మాకు ఒద్దుమొర్రో అని దాదాపు నాలుగున్నర దశాబ్దాలు నిరసన తెలిపి, ఊరేగింపులు చేసి, ఉద్యమాలు నడిపి, సబ్బండవర్ణాలు తెలంగాణ పాంచజన్యం పూరించారు. ఉద్యమంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 2009 నుంచి 2014 వరకు ఆంధ్ర పాలకుల నాటకాలతో వందల మంది తెలంగాణ బిడ్డలు అసువులు బాసారు. అలాంటి తెలంగాణలో అసలు ఉండటానికి ఆంధ్రా నేతలకు కొద్దిగా అయినా ఆత్మగౌరవం దెబ్బతినదా? విడాకులు తీసుకున్న భార్య మీద యాసిడ్ పోసే ఘనులు కూడా ఉంటారు కదా. గతంలో డిపాజిట్లు కోల్పోయి, తుడిచిపెట్టుకోయిన పార్టీని బలోపేతం చేస్తామని ఒకడు వాగుతాడు.
మీకు రాష్ర్టాన్ని పాలించుకునే సత్తా లేదని 2014లో పేలిన వాళ్లకు పదేండ్ల పాలన చూసిన తర్వాతైనా సిగ్గురాలేదా? రెండున్నరేండ్లలో రూ.700 కోట్లు పెట్టి కట్టుకున్న తెలంగాణ సచివాలయ భవనం లాంటిది కట్టడం 12 ఏండ్లలో మీకు సాధ్యం కాలేదు. మూడు ఏండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం కట్టి లక్షలాది ఎకరాలు సాగు చేస్తున్న తెలంగాణను ఆ పేరుతో పిలిస్తే ఏమి, హైదరాబాద్ రాష్ట్రం అంటే ఏమిటి తేడా? తెలుగూ మీది కాదు, హైదరాబాదూ మీది కాదు.
వెళ్లగొట్టినా మీ ప్రాంతం మీద మమకారం కలగలేదంటే ఇక మీ ప్రాంత ప్రజలే మీ గురించి ఆలోచించుకోవాలి. మీ మోసపూరిత రాజకీయాలను అనుభవించాం.మీ సినిమా పాటల రికార్డింగు డాన్సుల సంస్కృతి పరికించాం. 73 ఏండ్ల నుంచి రాజధాని లేక అల్లాడుతున్న మీ ప్రజానీకాన్ని ఇప్పుడైనా పట్టించుకోండి. 2029 ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయటం కాదు, కనీసం అప్పటికైనా అమరావతిలో మూడు భవనాలు కట్టుకోండి. ఎయిర్‌పోర్టులు రైల్వే స్టేషన్లు, క్వాంటం భవనాలు తర్వాత చూద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్!
– కనకదుర్గ దంటు, 89772 43484